టీ20 ప్రపంచకప్ 2022 (T20 World Cup 2022) వేటను టీమిండియా (Team India) ఘనంగా ప్రారంభించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మట్టికరిపించి మిగతా జట్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఇక, దాయాది దేశంపై విజయంతో యావత్ భారత్ దేశం దీపావళి పండుగ (Diwali Festival)ను ఘనంగా చేసుకుంది. ఏకంగా టీ20 ప్రపంచకప్ గెలిచినంత ఆనందపడింది. అయితే.. టీమిండియా మాత్రం ఈ సూపర్ విక్టరీ సెలబ్రేషన్స్ కు దూరంగా ఉంది. కనీసం కేక్ కూడా కట్ చేయలేదు. పాక్ పై సూపర్ విక్టరీతో దీపావళిను ఘనంగా చేయాలని భారత దౌత్య అధికారులు ప్లాన్ చేశారు. సిడ్నీ వేదికగా గ్రాండ్ దివాళీ పార్టీని ఆటగాళ్ల కోసం ఏర్పాటు చేశారు. అయితే, భారత దౌత్య అధికారులకు ఊహించని షాకిచ్చారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.
భారత అధికారులు ఏర్పాటు చేసిన డిన్నర్ ను చివరి నిమిషంలో రద్దు చేయించారు. పాకిస్థాన్ విజయాన్ని ఏమాత్రం సెలెబ్రేట్ చేసుకోవద్దని, ప్రపంచకప్ గెలవడమే అంతిమ లక్ష్యమని ఆటగాళ్లకు మెసేజ్ పంపించారు రోహిత్, ద్రవిడ్. సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సూచనల మేరకే రాహుల్ ద్రవిడ్ పార్టీని రద్దు చేసినట్లు తెలుస్తోంది.
అయితే, భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు మ్యాచ్ ముగిసిన వెంటనే చాలా మంది తమ గదుల్లోకి వెళ్లిపోయారు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా మాత్రం మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. మరుసటి ఉదయమే సిడ్నీకి బయల్దేరారు. సోమవారం పూర్తిగా రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత కొందరు జిమ్ చేయగా.. మరికొందరూ బయట సరదాగా తిరిగారు. అంతిమ లక్ష్యం కోసం ప్రయాణం చేస్తున్నప్పుడు చిన్న చిన్న వాటిని సెలెబ్రేట్ చేసుకోవడం సరికాదని, టీమ్ విధానాన్ని ఫాలో అవుదామని సీనియర్ ఆటగాళ్లు ప్లేయర్లకు తెలిపారు.
మెల్బోర్న్ మ్యాచ్ నరాలు తెగేంతగా ఉత్కంఠగా సాగింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో 160 పరుగుల టార్గెట్ ను 20 ఓవర్లలో అందుకుంది. నాలుగు వికెట్ల తేడాతో గెలిచి టీ20 ప్రపంచకప్ లో బోణీ కొట్టింది. విరాట్ కోహ్లీ(Virat Kohli) మ్యాచ్‌ని మలుపు తిప్పడమే కాకుండా 53 బంతుల్లో 82 పరుగులు చేశాడు.హార్దిక్ పాండ్యా (Hardik Pandya) 40 పరుగులతో సత్తా చాటాడు.
ఫస్ట్ మ్యాచులో గెలిచిన టీమిండియా ఈ నెల 27న నెదర్లాండ్స్ తో (India vs Netherlands) అమీతుమీ తేల్చుకోనుంది. పాకిస్తాన్ పై గెలిచినంత మాత్రాన డచ్ జట్టును తేలికగా తీసుకోవడానికి లేదు. వరల్డ్ కప్ లో ప్రతి మ్యాచూ కీలకమే. దీంతో.. నెదర్లాండ్స్ ను తక్కువ అంచన వేయకుండా పోరాడితే మంచిదని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.
భారత తుది జట్టు అంచనా :
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ / అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ/ యుజువేంద్ర చాహల్, అర్ష్ దీప్ సింగ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, India VS Pakistan, Rahul dravid, Rohit sharma, T20 World Cup 2022, Team India, Virat kohli