AUS vs IRE : టి20 ప్రపంచకప్ (T20 World Cup 2022) 2022లో ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా (Australia) సమష్టి ప్రదర్శన కనబరిచింది. గ్రూప్ ‘1’లో భాగంగా జరిగిన పోరులో ఐర్లాండ్ (Ireland)పై 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. 180 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 18.1 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. లొర్కాన్ టక్కర్ (48 బంతుల్లో 71 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) చివరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. అయితే ఇతడికి ఇతర ప్లేయర్ల నుంచి సహకారం అందలేదు. దాంతో టక్కర్ పోరాటం చివరకు వృధాగా మిగిలింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా, మ్యాక్స్ వెల్, కమిన్స్, స్కార్క్ తలా రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో ఆస్ట్రేలియా 5 పాయింట్లతో గ్రూప్ లో రెండో స్థానానికి చేరుకుంది. అయితే నెట్ రన్ రేట్ విషయంలో మాత్రం ఆస్ట్రేలియా పేలవంగా ఉంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్ తో పోలిస్తే ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్ తక్కువగా ఉంది.
ఇది కూడా చదవండి : ప్లేట్ మార్చేసిన పాకిస్తాన్.. మొన్న గెలవాలని పూజలు.. ఇప్పుడు ఓడాలని
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఐర్లాండ్ ను ఆస్ట్రేలియా బౌలర్లు దెబ్బ తీశారు. ఫామ్ లో ఉన్న కెప్టెన్ ఆండ్రూ బాల్ బిర్నీ (6)ను కమిన్స్ బౌల్డ్ చేశాడు. ఇక మూడో ఓవర్లో బౌలింగ్ కు వచ్చిన మ్యాక్స్ వెల్ ప్రమాదకర ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (11)తో పాటు హ్యారీ టెక్టర్ (6)ను అవుట్ చేశాడు. డబుల్ బ్రేక్ ఇచ్చాడు. ఇక కర్టీస్ క్యాంఫెర్ (0)ను స్టార్క్ సూపర్ యార్కర్ తో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో ఐర్లాండ్ 25 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒక దశలో ఐర్లాండ్ 100 పరుగులు కూడా చేస్తుందా అని అనిపించింది. అయితే టక్కర్ మరో ఎండ్ లో ఒంటరి పోరాటం చేయడంతో ఐర్లాండ్ 137 వరకు చేరుకోగలిగింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఒక దశలో 200 మార్కును ఈజీగా దాటుతుందని అనిపించినా చివర్లో ఐర్లాండ్ బౌలర్లు కమ్ బ్యాక్ చేయడంతో అనుకున్న స్కోరు కంటే కూడా 20 నుంచి 40 పరుగులు తక్కువగానే ఆస్ట్రేలియా చేసింది. అరోన్ ఫించ్ (44 బంతుల్లో 63; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేశాడు. మార్కస్ స్టొయినిస్ (25 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సక్స్) ఫర్వాలేదనపించాడు. వీరిద్దరూ మినహా మిగిలిన ఆస్ట్రేలియా బ్యాటర్స్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఐర్లాండ్ బౌలర్లలో మెకార్థి 3 వికెట్లు, జాష్ లిటిల్ 2 వికెట్లతో రాణించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, David Warner, Glenn Maxwell, Pat cummins, Steve smith, T20 World Cup 2022