INDvsPAK: వరల్డ్ కప్‌లో అలాంటి మ్యాచ్ మరెప్పుడూ జరగలేదు.. పాకిస్తాన్‌పై టీమ్ ఇండియా అరుదైన రికార్డు

ఇండియా - పాకిస్తాన్ ఆడిన అరుదైన ఆ మ్యాచ్ గురించి మీకు తెలుసా? (PC: ICC)

T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్‌లో ఇవాళ ఇండియా - పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనున్నది. గతంలో ఈ రెండు జట్లు ఐదు సార్లు తలపడగా.. అన్నింటా టీమ్ ఇండియానే విజయం సాధించింది. అయితే వీటన్నింటిలో డర్బన్ వేదికగా 2007లో జరిగిన మ్యాచ్ చాలా ప్రత్యేకమైనది. ఈ మ్యాచ్ టైగా ముగియగా.. తొలి సారి బౌల్ అవుట్ ద్వారా మ్యాచ్ ఫలితాన్ని తేల్చారు.

 • Share this:
  ఇండియా - పాకిస్తాన్ (India Vs Pakistan) మ్యాచ్ అంటేనే ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటిది వరల్డ్ కప్ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కపోవడం గ్యారెంటీ. ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) భారత్-పాక్ జట్లు 5 సార్లు తలపడగా.. అన్నింటా టీమ్ ఇండియానే (Team India) విజయం సాధించింది. అయితే ఈ ఐదు మ్యాచ్‌లలో అందరికీ ఎప్పటికీ గుర్తుండి పోయేది మాత్రం 2007లో జరిగిన లీగ్ మ్యాచే. దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ (First T20 World Cup) మ్యాచ్ నెంబర్ 10లో ఇండియా-పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. డర్బన్ వేదికగా 2007 సెప్టెంబర్ 14న జరిగిన ఈ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బౌలింగ్ చేయడానికి నిర్ణయించుకున్నది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. ఓపెనర్లు గౌతమ్ గంభీర్ (0), వీరేంద్ర సెహ్వాగ్ (5)లను మహ్మద్ ఆసిఫ్ పెవీలియన్ పంపాడు. అయితే వన్ డౌన్‌లో వచ్చిన రాబిన్ ఊతప్ప (50) అర్ద సెంచరీతో జట్టుకు ఆదుకున్నాడు. యువరాజ్ సింగ్ (1), దినేశ్ కార్తీక్ (11) నిరాశ పరిచినా.. ఎంఎస్ ధోని (33), ఇర్ఫాన్ పఠాన్ (20) పర్వాలేదనిపించారు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.

  ఇక 142 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు టాపార్డర్ విఫలమైంది. సల్మాన్ భట్ (17), ఇమ్రాన్ నజీర్ (7), కమ్రాన్ అక్మల్ (15), యూనిస్ ఖాన్ (2) విఫలమయ్యారు. షోయబ్ మాలిక్ (20) పర్వాలేదని పించాడు. అయితే మిస్బా ఉల్ హక్ (53) చివరి వరకు పోరాడాడు. యాసిర్ అరాఫత్ (12)తో కలసి మ్యాచ్‌ను ఆఖరి వోవర్ వరకు తీసుకొని వెళ్లాడు. అయితే ఆఖరి రెండు బంతుల్లో 1 పరుగులు చేయాల్సిన సమయంలో శ్రీశాంత్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒక బంతిని మిస్బా మిస్ చేశాడు. ఆఖరి బంతికి కూడా సరైన షాట్ కొట్టలేకపోయాడు. అయితే ఒక పరుగు చేయాలని ప్రయత్నించి మిస్బా ఉల్ హక్ రనౌట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది.

  India Vs Pakistan: దాయాదీల పోరులో గెలిచేదెవరో? గత రికార్డులు ఇవే.. భారత్‌ను ఊరిస్తున్న మరో రికార్డు


   

  ప్రస్తుతం టీ20 మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ ఫలితాన్ని తేలుస్తున్నారు. కానీ తొలి టీ20 వరల్డ్ కప్ సమయంలో ఈ నిబంధన లేదు. అప్పట్లో బౌల్ అవుట్ ద్వారా మ్యాచ్ ఫలితాన్ని నిర్దారించేవారు. దీంతో పాకిస్తాన్ - ఇండియా మ్యాచ్‌లో బౌల్ అవుట్ నిబంధన అమలు చేశారు. కెప్టెన్ ధోనీ తన వ్యూహాలకు ఇక్కడే పదును పెట్టాడు. రెగ్యులర్ బౌలర్లతో కాకుండా పార్ట్ టైం బౌలర్లతో బౌల్ అవుట్ బంతులు వేయించాడు. ఒక్క హర్బజన్ మాత్రమే వీళ్లలో రెగ్యులర్ బౌలర్. తొలి బంతి వేసిన వీరేందర్ సెహ్వాగ్ వికెట్లను పడగొట్టాడు. అయితే పాకిస్తాన్ తరపున బంతి విసిరిన యాసిర్ అరాఫత్ వికెట్లు మిస్ చేశాడు. ఇక రెండో బంతికి హర్బజన్ సింగ్ వికెట్లు తీశాడు. కానీ పాక్ బౌలర్ ఉమర్ గుల్ వికెట్ పడగొట్టలేకపోయాడు. మూడో బంతి వేసిన రాబిన్ ఊతప్ప కూడా వికెట్లను పడగొట్టాడు. అయితే పాకిస్తాన్ తరపున మూడో బంతి వేసిన షాహిద్ అఫ్రిది కూడా బంతిని మిస్ చేయడంతో భారత జట్టు బౌల్ అవుట్ ద్వారా విజయం సాధించింది. ఆ తర్వాత పాక్-భారత్ ఏనాడూ బౌల్ అవుట్ ఆడలేదు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో బౌల్ అవుట్ ఆడిన జట్లుగా ఇండియా-పాకిస్తాన్ రికార్డు సృష్టించాయి.
  Published by:John Naveen Kora
  First published: