వెస్టిండీస్ వెటరన్ బ్యాటర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (Chris Gayle) ప్లేటు ఫిరాయించాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా 42 ఏళ్ల గేల్ ప్రవర్తించిన తీరుతో.. అతడు కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ భావించారు. అయితే, తాను కెరీర్‌కు వీడ్కోలు పలకలేదని.. స్వదేశంలో సొంత ప్రేక్షకుల సమక్షంలో గుడ్‌బై ప్రకటించాలనుకుంటున్నట్టు గేల్ స్వయంగా తెలిపాడు. కానీ, ఒకరకంగా ఆటకు వీడ్కోలు పలికినట్టేనని అన్నాడు. తాను రిటైర్మెంట్ తీసుకోలేదని, సరదా కోసమే ఆటకు వీడ్కోలు పలికినట్లు బిల్డప్ ఇచ్చానని స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గేల్.. ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లుగా ప్రవర్తించాడు.
రిటైర్మెంట్ గురించి ఎక్కడా ప్రస్తావించిన యూనివర్స్ బాస్.. మ్యాచ్ ఆసాంతం ఇదే తన చివరి గేమ్ అన్నట్లు బిల్డప్ ఇచ్చాడు. గాగుల్స్‌తో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ విండీస్ వీరుడు.. ఔటైన అనంతరం మైదానంలో అభిమానులందరికి అభివాదం చేశాడు. సహచర ఆటగాళ్ల నుంచి గౌరవందనం స్వీకరించాడు. గ్లోవ్స్, కెమెరాలపై సంతకం చేస్తూ హల్చల్ చేశాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లతో కలిసి చిందేశాడు.
దీంతో యూనివర్స్‌ల్ బాస్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నాడని అంతా భావించారు. సోషల్ మీడియా వేదికగా అతని రికార్డులు గుర్తు చేసుకుంటూ అభిమానులు, విశ్లేషకులు అభినందనలు తెలిపారు. గేల్ శకం ముగిసిందని, తనదైన ఆటతో అలరించిన గేల్‌కు కృతజ్ఞతలంటూ కామెంట్ చేశారు. కానీ తాను ఆటకు వీడ్కోలు పలకలేదని, సరదా కోసమే ఇలా చేశానని చెప్పి గేల్ అందర్నీ ఫూల్ చేశాడు. మ్యాచ్ తర్వాతమాట్లాడుతూ.. తాను మరో అంతర్జాతీయ మ్యాచ్ ఆడతానని, సొంతగడ్డపై జమైకా వేదికగా ఘనంగా వీడ్కోలు అందుకుంటానని చెప్పాడు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు.. తన కోసం ఈ ఏర్పాట్లు చేస్తుందని ఆశిస్తున్నానని తన మనసులోని కోరికను బయటపెట్టాడు.
"నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించలేదు. సరదా కోసమే అలా చేశాను. నాకు మరో ప్రపంచకప్ కూడా ఆడాలనుంది. కానీ నాకు ఆ అవకాశం ఇవ్వకపోవచ్చు. స్వదేశంలో సొంత అభిమానుల సమక్షంలో జమైకా వేదికగా మరో మ్యాచ్ ఆడి ఘనంగా వీడ్కోలు పలకాలనుకుంటున్నా. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నా కోసం ఈ ఏర్పాట్లు చేస్తుందని ఆశిస్తున్నా. నాకు మద్దతు తెలిపిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు " అని గేల్ తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆస్ట్రేలియా 8 వికెట్లతో గెలుపొంది సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 రన్స్ చేసింది. కెప్టెన్ కీరన్ పోలార్డ్(31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 44), ఎవిన్ లూయిస్(26 బంతుల్లో 5 ఫోర్లతో 29) రాణించగా.. చివర్లో ఆండ్రీ రస్సెల్(7 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లతో 18 నాటౌట్) కీలక పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(4/39) నాలుగు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ తలో వికెట్ తీశారు.
ఇది కూడా చదవండి : రిషబ్ పంత్, శిఖర్ ధావన్ లకు బ్యాడ్ న్యూస్.. ఆ ద్రోణాచార్యుడు ఇక లేరు..!
ఆ తర్వాత లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 16.2 ఓవర్లలో 2 వికెట్లకు 161 రన్స్ చేసి 22 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకున్నారు. డేవిడ్ వార్నర్(56 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 89 నాటౌట్), మిచెల్ మార్ష్(32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. అయితే, ఈ మ్యాచ్ ఆఖరిదంటూ మరో విండీస్ ఆల్ రౌండర్ డ్వాన్ బ్రావో ప్రకటించిన సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chris gayle, Cricket, T20 World Cup 2021, West Indies