T20 World Cup 2021 : కనీసం ఒక్కటైనా..! సఫారీ ఆశలు నెరవేరేనా..? దక్షిణాఫ్రికా పూర్తి బలబలాలు ఇవే..!

South Africa Team

T20 World Cup 2021 : ప్రతిసారీ బోలెడు ఆశలతో రావడం.. చివరికి ఒట్టి చేతులతో తిరిగి వెళ్లడం.. సౌతాఫ్రికా జట్టుకు అలవాటైంది. ఈ సారైనా ఎలాగైనా.. కప్ గెలిచి.. బోణి కొట్టాలని భావిస్తోంది.

 • Share this:
  ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ధనాధన్ టోర్నీ టీ -20 వరల్డ్ కప్ (T-20 World Cup) మొదలైంది. రెండంచెల్లో పోటీలు జరగనుండగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా మొత్తం 16 జట్లు ఈసారి బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే క్వాలిఫైయర్స్ మ్యాచ్ లు జరుగుతుండగా.. అసలు సిసలు సమరం సూపర్ -12 స్టేజీ అక్టోబర్ 23 న ప్రారంభం కానుంది.
  ర్యాంకింగ్‌ ప్రకారం భారత్ (India), వెస్టిండీస్ (West Indies), ఇంగ్లండ్ (England), ఆస్ట్రేలియా(Australia), దక్షిణాఫ్రికా(South Africa), పాకిస్తాన్ (Pakistan), న్యూజిలాండ్(Newzealand), అఫ్గానిస్తాన్‌(Afganistan) (8 జట్లు) నేరుగా అర్హత సాధించాయి. రౌండ్‌–1 లో క్వాలిఫయింగ్‌ టోర్నీ మ్యాచ్‌లు జరుగుతున్నాయ్. శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా (గ్రూప్‌–ఎ) ... బంగ్లాదేశ్, స్కాట్లాండ్, ఒమన్‌ ,పాపువా న్యూగినియా (గ్రూప్‌–బి) రెండు గ్రూప్‌లుగా విడిపోయి అర్హత మ్యాచ్‌లు ఆడుతున్నాయ్. రెండు గ్రూప్‌లలో టాప్‌–2లో నిలిచిన నాలుగు జట్లు మిగిలిన 8 టీమ్‌లతో కలిసి ఈనెల 23 నుంచి ‘సూపర్‌–12’లో పోటీ పడతాయి. ఇక్కడా 12 జట్లను గ్రూప్‌–1, గ్రూప్‌ –2లుగా విభజించారు. తమ గ్రూప్‌ లోని మిగిలిన ఐదు జట్లతో మ్యాచ్‌లు ఆడిన అనంతరం రెండు గ్రూప్‌లలో అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు సెమీఫైనల్‌కు చేరతాయి.

  పేరుకు పెద్ద జట్టు. ఎంతో మంది స్టార్లు ఆ జట్టు నుంచి వచ్చారు. కానీ, వరల్డ్ కప్ ఈవెంట్లుల్లో మాత్రం ఆ జట్టు ప్రదర్శన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆ జట్టే సఫారీ టీమ్. ఒక్కసారైనా తమ జట్టు ప్రపంచకప్‌ను ముద్దాడితే చూడాలనే దక్షిణాఫ్రికా దేశ ప్రజల దశాబ్దాల కల మాత్రం తీరట్లేదు. ఇప్పటివరకూ ప్రపంచకప్‌ బోణీ కొట్టని సఫారీ సేన.. ఐదేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ పొట్టి ప్రపంచకప్‌లో టైటిల్‌ సాధించి ఆ నిరీక్షణకు ముగింపు పలకాలని చూస్తోంది.

  ఒకప్పుడు టాప్ ప్లేయర్స్ తో కళకళలాడిన దక్షిణాఫ్రికా జట్టు.. ఒక్కొక్కరుగా ఆ క్రికెటర్లు వీడ్కోలు పలకడంతో మునుపటి ప్రభ కోల్పోయింది. ప్రస్తుత జట్టులో నాణ్యమైన ఆటగాళ్లున్నప్పటికీ ఆ జట్టు కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని మాత్రం కల్పించలేకపోతున్నారు. పైగా ఈ టీ20 ప్రపంచకప్‌నకు అనుభవజ్ఞులైన డుప్లెసిస్‌, ఇమ్రాన్‌ తాహిర్‌, క్రిస్‌ మోరిస్‌ దూరమవడం ఆ జట్టును దెబ్బతీసేదే. ఐపీఎల్‌లో సీఎస్కే తరపున గొప్పగా రాణించిన డుప్లెసిస్‌ను ప్రపంచకప్‌ జట్టులోకి ఎంపిక చేయలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌ మీద దృష్టి సారించడం కోసమే అతను ఈ ఏడాది ఆరంభంలో టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. అయినప్పటికీ అతనికి నిరాశే ఎదురైంది.

  ఇక తాహిర్‌ను కూడా సెలక్షన్‌ పరిగణలోకి తీసుకోలేదు. ఆల్‌రౌండర్‌ మోరిస్‌ ఇతర కారణాల వల్ల అందుబాటులో లేకుండా పోయాడు. ప్రస్తుత జట్టులో కెప్టెన్‌ బవుమా, డికాక్‌, మర్‌క్రమ్‌, మిల్లర్‌, డసన్‌లతో కూడిన బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్‌తో జోరు అందుకున్న మర్‌క్రమ్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక పేస్‌ ద్వయం నార్జ్‌, రబాడ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున ఎలాంటి ప్రదర్శన చేశారో తెలిసిందే. తమ వేగంతో, కచ్చితత్వంతో వీళ్లు ప్రత్యర్థి బ్యాటర్లకు సవాలు విసరగలరు.

  ఇది కూడా చదవండి : అమ్మో.. దాన్ని నేను తట్టుకోలేను.. ఎవరికీ కనిపించకుండా పోతాను..

  ప్రపంచ నంబర్‌వన్‌ టీ20 బౌలర్‌గా ఉన్న స్పిన్నర్‌ షంసీతో ప్రత్యర్థులకు ప్రమాదం పొంచి ఉంది. మిడిలార్డర్‌లో నిలకడ లేమి.. బ్యాటర్లు కచ్చితంగా రాణిస్తారనే నమ్మకం లేకపోవడం ఆ జట్టుకు ఇబ్బందిగా మారింది. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ లాంటి బలమైన జట్లతో పాటు గ్రూప్‌- 1లో ఉన్న సఫారీ జట్టు.. సెమీస్‌ చేరాలంటే శక్తికి మించి శ్రమించాల్సిందే. ప్రస్తుత ఫామ్‌ ప్రకారం చూస్తే ఈ టోర్నీలోనూ ఆ జట్టుకు నిరాశే తప్పదనే అభిప్రాయాలు కలుగుతున్నాయి.

  సౌతాఫ్రికా షెడ్యూల్ :  మ్యాచ్ నెం డేట్ మ్యాచ్  వెన్యూ టైం స్టేజ్
  1 అక్టోబరు 23 ఆస్ట్రేలియా వర్సెస్‌ దక్షిణాఫ్రికా అబుదాబి 03:30 సూపర్‌ 12
  2 అక్టోబరు 26 సౌతాఫ్రికా వర్సెస్‌ వెస్టిండీస్‌ దుబాయ్‌ 03:30 సూపర్‌ 12
  3 అక్టోబరు 30 సౌతాఫ్రికా వర్సెస్‌ A1 షార్జా 03:30 సూపర్‌ 12
  4 నవంబరు 2 సౌతాఫ్రికా వర్సెస్‌ B2 అబుదాబి 03:30 సూపర్‌ 12
  5 నవంబరు 6 ఇంగ్లండ్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా షార్జా 07:30 సూపర్‌ 12

  కీలక ఆటగాళ్లు: బవుమా, డికాక్‌, మర్‌క్రమ్‌, నార్జ్‌, రబాడ, షంసి

  ఉత్తమ ప్రదర్శన: సెమీస్‌ (2009, 2014)

  దక్షిణాఫ్రికా జట్టు: బవుమా (కెప్టెన్‌), కేశవ్‌ మహారాజ్‌, డికాక్‌, ఫోర్టుయిన్‌, హెండ్రిక్స్‌, క్లాసెన్‌, మార్‌క్రమ్‌, మిల్లర్‌, ముల్డర్‌, ఎంగిడి, నార్జ్‌, ప్రిటోరియస్‌, రబాడ, షంసీ, వాండర్ డసెన్‌
  Published by:Sridhar Reddy
  First published: