Home /News /sports /

T20 WORLD CUP 2021 SA VS SL LIVE UPDATES SOUTH AFRICA WON BY 4 WICKETS IN THRILLING MATCH SRD

SA Vs SL : మిల్లర్ కిల్లర్.. హసరంగ హ్యాట్రిక్ వృధా.. ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాదే విక్టరీ..

David Miller (PC : ICC)

David Miller (PC : ICC)

SA Vs SL : ఇక, ఈ మ్యాచ్ లో టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో రెండో హ్యాట్రిక్ నమోదైంది. శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ వానిందు హసరంగ, సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో హ్యాట్రిక్ నమోదుచేశాడు.

    టీ -20 వరల్డ్ కప్ (T20 World Cup 2021) లో భాగంగా షార్జా క్రికెట్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్ లో సౌతాఫ్రికా (South Africa) థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. శ్రీలంక విధించిన 143 పరుగుల టార్గెట్ మరో బంతి మిగిలుండగా ఛేజ్ చేసింది సౌతాఫ్రికా టీమ్. ఆఖరి ఓవర్ లో 15 పరుగులు అవసరమైన సమయంలో సౌతాఫ్రికా హిట్టర్ రెండు వరుస సిక్సర్లతో తన టీమ్ కు విజయాన్ని అందించాడు. ఈ ఓటమితో శ్రీలంక సెమీస్ ఆశలు గల్లంతైనట్టే. 143 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ ఆరంభించిన సౌతాఫ్రికాకి శుభారంభం దక్కలేదు. రీజా హెండ్రిక్స్ 12 బంతుల్లో 11 పరుగులు చేసి ఛమీరా బౌలింగ్ ‌లో అవుట్ కాగా.. క్వింటన్ డి కాక్ 10 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసి చమీరా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

    ఆ తర్వాత రస్సీ వాన్ దేర్ దుస్సేన్ 11 బంతుల్లో 16 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు.49 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా. ఐడెన్ మార్క్‌రమ్ 20 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసి హసరంగ బౌలింగ్‌లో అవుట్ కాగా, కెప్టెన్ తెంబ భువుమా 46 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 46 పరుగులు చేసి హసరంగ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.

    అయితే.. ఆఖరి రెండు ఓవర్లలో 25 పరుగులు రావాల్సి రావడంతో మ్యాచ్‌పై ఉత్కంఠ రేగింది. చమీరా వేసిన 19వ ఓవర్‌లో సిక్సర్‌తో 10 పరుగులు రాబట్టాడు రబడా. ఆఖరి ఓవర్‌లో విజయానికి 15 పరుగులు ఉండగా తొలి బంతికి సింగిల్ మాత్రమే వచ్చింది. అయితే వరుసగా రెండు సిక్సర్లు బాదిన డేవిడ్ మిల్లర్, విజయాన్ని ఖాయం చేసేశాడు. ఆ తర్వాత మిల్లర్ సింగిల్ తీయగా, విజయానికి 2 బంతుల్లో 1 పరుగు కావాల్సిన దశలో ఫోర్ బాది లాంఛనాన్ని ముగించాడు రబాడా.

    ఇక, ఈ మ్యాచ్ లో టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో రెండో హ్యాట్రిక్ నమోదైంది. శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ వానిందు హసరంగ, సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో హ్యాట్రిక్ నమోదుచేశాడు. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో ఇది మూడో హ్యాట్రిక్ కాగా, ఈ టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఇది రెండో హ్యాట్రిక్.


    15వ ఓవర్ ఆఖరి బంతికి మార్క్‌రమ్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన వానిందు హసరంగ, 18వ ఓవర్‌లో వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నాడు. 46 పరుగులు చేసిన సౌతాఫ్రికా కెప్టెన్ భువమా, నిశ్శంకకి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా ఆ తర్వాతి బంతికి పెట్రోరియస్‌ను గోల్డెన్ డకౌట్ చేశాడు హసరంగ.... ఆ తర్వాతి బంతికి రబాడా అవుట్ కోసం అప్పీలు చేసినా అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. రివ్యూకి వెళ్లినా బంతి అవుట్‌ సైట్ లెగ్‌కి పిచ్ అవుతుండడంతో నాటౌట్‌గా ప్రకటించాడు థర్డ్ అంపైర్.


    ఇక, అంతకుముందు.. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక తేలిపోయింది. ఆ జట్టు ఓపెనర్ నిశ్శంక రాణించడంతో ఓ మోస్తరు లక్ష్యాన్ని సౌతాఫ్రికా ముందు ఉంచారు లంకేయులు. నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగుల స్కోరు వద్ద ఆలౌట్ అయింది. 58 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 72 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు నిశ్శంక. ఇక షంసీ నాలుగు ఓవర్లలో 17 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, South Africa, Sri Lanka, T20 World Cup 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు