ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ధనాధన్ టోర్నీ టీ -20 వరల్డ్ కప్ (T-20 World Cup) మొదలైంది. రెండంచెల్లో పోటీలు జరగనుండగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా మొత్తం 16 జట్లు ఈసారి బరిలోకి దిగనున్నాయి. అసలు సిసలు సమరం సూపర్ -12 స్టేజీ అక్టోబర్ 23 న ప్రారంభం కానుంది. ర్యాంకింగ్ ప్రకారం భారత్ (India), వెస్టిండీస్ (West Indies), ఇంగ్లండ్ (England), ఆస్ట్రేలియా(Australia), దక్షిణాఫ్రికా(South Africa), పాకిస్తాన్ (Pakistan), న్యూజిలాండ్(Newzealand), అఫ్గానిస్తాన్(Afganistan) (8 జట్లు) నేరుగా అర్హత సాధించాయి. ఇక, వరల్డ్ కప్ లోనే హై ఓల్టేజ్ మ్యాచ్ అక్టోబర్ 24 న భారత్ - పాకిస్థాన్ ల మధ్య జరగనుంది. ఈ బ్లాక్ బస్టర్ పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక, ఈ మెగాటోర్నీలో దాయాది దేశం పాకిస్తాన్ బలబలాలెంటో ఓ లుక్కేద్దాం.
సరిగ్గా టీ20 ప్రపంచకప్‌కు ముందే పాకిస్థాన్ జట్టులో అలజడి మొదలైంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్ లాంటి జట్లు పాక్ లో పర్యటించకుండా పర్యటనలు రద్దు చేసుకున్నాయ్. ఇక, ప్రధాన కోచ్ మిస్బావుల్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ రాజీనామా.. పాకిస్ధాన్ జట్టులో లుకలుకల్ని బయటపెట్టింది. పొట్టి కప్పు కోసం మొదట ప్రకటించిన జట్టుపై విమర్శలు.. తిరిగి ఆటగాళ్ల జాబితాలో మార్పులు.. కొత్త కోచ్‌ల నియామకం.. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రపంచకప్‌నకు పాకిస్థాన్ సిద్ధమైంది. మైదానం బయట ఎన్ని సమస్యలున్నా.. ఆటలో మాత్రం సత్తాచాటి రెండో సారి టీ20 ప్రపంచకప్‌ను పట్టేయాలనే లక్ష్యంతో పోరుకు సై అంటోంది.
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పేరు వినగానే ముందుగా అనిశ్చితితో కూడిన ఆట గుర్తుకు వస్తుందనడంలో సందేహం లేదు. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో అద్భుత పోరాటంతో విజయం దక్కించుకోవడం.. కచ్చితంగా గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో చేజేతులారా పరాజయం పాలవడం ఆ జట్టుకు అలవాటుగా మారింది. దీంతో కొన్నేళ్లుగా యూఏఈలోనే వివిధ జట్లతో పాక్ సిరీస్‌లు ఆడినప్పటికీ.. ఇప్పుడు అక్కడే జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఆ జట్టును ఫేవరేట్ అని చెప్పలేని పరిస్థితి. అలా అనీ తక్కువ అంచనా వేయలేం.
బలమైన బ్యాటింగ్, పటిష్ఠమైన పేస్ బౌలింగ్‌తో ఈ పొట్టి కప్పుకు సిద్ధమైన పాక్.. రెండో సారి ట్రోఫీ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. 2009లో ఆ జట్టు తొలిసారి కప్పు గెలిచింది. టీ20ల్లో ఆ జట్టుకు మంచి రికార్డే ఉంది. అనుభవజ్ఞుడైన షోయబ్ మాలిక్‌తో పాటు మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ జట్టుతో చేరడం పాక్ బలాన్ని పెంచేదే. బ్యాటింగ్ భారం మొత్తం కెప్టెన్ బాబర్ అజామ్‌పైనే ఉంది. కొన్నేళ్లుగా అన్ని ఫార్మాట్లలోనూ అతను నిలకడగా రాణిస్తున్నాడు. అతనితో పాటు ఫకార్ జమాన్, మహమ్మద్ రిజ్వాన్, హైదర్ అలీ మంచి ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసొచ్చే అంశం.
ఇది కూడా చదవండి : బాబర్ అజామ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా!
ఇక యువ పేసర్లు షహీన్ షా అఫ్రిది, మహమ్మద్ వసీమ్‌తో పాటు హసన్, హారిస్ తమ వేగంతో సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. అయితే నాణ్యమైన స్పిన్నర్లు జట్టులో లేకపోవడం పాక్‌కు ఇబ్బందే. అంతే కాకుండా టాప్‌ఆర్డర్ విఫలమైతే మిడిలార్డర్ చేతులెత్తేయడం కూడా సమస్యగా మారింది. మరోవైపు కొత్త కోచ్‌లు హేడెన్, ఫిలాండర్‌లు ఆటగాళ్లతో త్వరగా కలిసిపోతేనే మంచి ఫలితాలు రాబట్టే అవకాశం ఉంది. అఫ్గానిస్థాన్, భారత్, న్యూజిలాండ్‌తో కలిసి పాక్ గ్రూప్- 2లో ఉంది. ఆదివారం తొలి మ్యాచ్‌లో భారత్‌తో తలపడుతున్న పాక్ విజయంతో వేటను మొదలెట్టాలని చూస్తోంది. కానీ ఐసీసీ టోర్నీల్లో ఇప్పటివరకూ టీమిండియాపై గెలిచిన రికార్డు లేని ఆ జట్టు మరోసారి ఓటమి పాలైతే ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదముంది.
పాకిస్థాన్ షెడ్యూల్ :
మ్యాచ్ నెం | డేట్ | మ్యాచ్ | టైం | వెన్యూ | స్టేజ్ |
1 | అక్టోబరు 24 | ఇండియా వర్సెస్ పాకిస్తాన్ | 07:30 | దుబాయ్ | సూపర్ 12 |
2 | అక్టోబరు 26 | పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ | 07:30 | షార్జా | సూపర్ 12 |
3 | అక్టోబరు 29 | అఫ్గనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ | 07:30 | దుబాయ్ | సూపర్ 12 |
4 | నవంబరు 2 | పాకిస్తాన్ వర్సెస్ A2 | 07:30 | అబుదాబి | సూపర్ 12 |
5 | నవంబరు 7 | పాకిస్తాన్ వర్సెస్ A2 | 07:30 | షార్జా | సూపర్ 12 |
కీలక ఆటగాళ్లు: బాబర్, ఫకార్, షాదాబ్, రిజ్వాన్, షోయబ్ మాలిక్, షహీన్ అఫ్రిది
ఉత్తమ ప్రదర్శన: ఛాంపియన్స్ (2009)
పాకిస్థాన్ జట్టు: బాబర్ అజామ్ (కెప్టెన్), షాదాబ్, అసిఫ్ అలీ, ఫకార్, షోయబ్ మాలిక్, హైదర్, హారిస్, హసన్, ఇమాద్, హఫీజ్, నవాజ్, రిజ్వాన్, మహమ్మద్ వసీమ్, సర్ఫ్‌రాజ్, షహీన్ అఫ్రిది
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Babar Azam, India VS Pakistan, Pakistan, T20 World Cup 2021