టీ20 వరల్డ్‌కప్ 2021 (T20 World Cup 2021) మ్యాచ్‌లు రసవత్తరంగా జరుగుతున్నాయి. అన్ని జట్లు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్నాయి. పాకిస్థాన్ చేతిలో ఓటమి తర్వాత న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగే మ్యాచ్ కోసం భారత్ (India Vs New Zealand) సిద్ధమవుతోంది. ఆ టీమ్తోనూ ఓటమి ఎదురైతే టోర్నమెంట్ ఆశలపై నీలి మేఘాలు కమ్ముకున్నట్లే అవుతుంది. మరోవైపు, న్యూజిలాండ్ ది కూడా అదే పరిస్థితి. పాకిస్థాన్ చేతితో ఎదురైన పరాజయాన్ని మరిచి టోర్నీ ముందుకు సాగాలంటే తప్ప గెలవాల్సిన మ్యాచ్ కోసం సమాయత్తం అవుతోంది. టీమిండియాతో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే, ఈ కీలక మ్యాచ్ కు ముందు న్యూజిలాండ్ శిబిరంలో టెన్షన్ మొదలైంది. తుది జట్టు కూర్పుపై ఆ జట్టు తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.
ఇలా టెన్షన్ పడటానికి కారణం కూడా ఉంది. టీ20 ప్రపంచకప్ 2021 టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గాయం కారణంగా ఇప్పటికే స్టార్ పేసర్ లుకీ ఫెర్గూసన్ మెగా టోర్నీ దూరం కాగా.. మరో స్టార్ ప్లేయర్‌కు గాయం అయింది. షార్జాలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ కాలి బొటన వేలికి గాయం అయింది. ప్రస్తుతం అతడి గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని సమాచారం తెలుస్తోంది. దీంతో అతడు ఆదివారం టీమిండియాతో జరిగే మ్యాచ్‌లో ఆడుతాడో లేదో సరైన సమాచారం మాత్రం లేదు. ఒకవేళ గప్తిల్ దూరమయితే..న్యూజిలాండ్ కు పెద్ద మైనస్ గా మారనుంది.
గప్తిల్ స్ధానంలో టిమ్ సైఫర్ట్ ఓపెనర్ గా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. పాకిస్థాన్ మ్యాచులో న్యూజిలాండ్ బ్యాటర్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. కీలక సమయంలో వికెట్లు చేజార్చుకుని పాక్ ముందు మోస్తరు లక్ష్యాన్ని మాత్రమే ఉంచారు. టిమ్ సీఫెర్ట్, కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్ విఫలమయ్యారు. వీరందరూ ఫామ్ అందుకుంటేనే టీమిండియాపై విజయం సాధించే అవకాశం ఉంటుంది.
మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీలతో కూడా స్పిన్ విభాగం పటిష్టంగానే ఉంది. స్టార్ పేసర్ లుకీ ఫెర్గూసన్ టీమిండియాతో మ్యాచ్‌కే కాదు.. టోర్నమెంట్ మొత్తానికీ దూరం అయ్యాడు. అతని కుడి కాలి చీలమండంలో తేలికపాటి ఫ్రాక్చర్ ఏర్పడడంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఆతడి స్థానంలో డారిల్ మిచెల్ ఆడనున్నాడు. టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్ వంటి సీనియర్లు బౌలర్ల అనుభవం ఆ జట్టుకు ప్లస్ పాయింట్ కానుంది.
తుది జట్లు (అంచనా):
న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్/ డారిల్ మిచెల్, టిమ్ సీఫెర్ట్ (కీపర్), కేన్ విలియమ్సన్(కెప్టెన్), డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, మిచెల్ సాంట్నర్, డారిల్ మిచెల్/టాడ్ ఆస్టిల్, టిమ్ సౌతీ, ఇష్ సోథీ, ట్రెంట్ బౌల్ట్.
టీమిండియా : కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా/ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ/రవిచంద్రన్ అశ్విన్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Ind vs Nz, India vs newzealand, Kane Williamson, T20 World Cup 2021, Virat kohli