Ind Vs Pak : అయిపాయ్.. ! థ్రిల్లింగ్ లేదు.. డ్రామా లేదు.. పాకిస్థాన్ దే మ్యాచ్..

Photo Credit : Twitter

Ind Vs Pak : థ్రిల్లింగ్ లేదు.. డ్రామా లేదు. హై యాక్షన్ పోరులో పాకిస్థాన్ సింగిల్ హ్యాండడ్ గా విక్టరీ కొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా రెండు విభాగాల్లో తీవ్ర తప్పిదాలు చేసిన టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంది.

 • Share this:
  హై ఓల్టేజ్ పోరు కాస్తా ఏకపక్షం అయింది. బ్లాక్ బస్టర్ పోరులో దాయాదిదే పై చేయి. టీ-20 వరల్డ్ కప్ ల్లో తమకున్న చెత్త రికార్డును చెరిపేస్తూ చరిత్ర సృష్టించింది పాకిస్థాన్. 152 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పాక్ ఓపెనర్లు వికెట్ కోల్పకుండా 18.5 ఓవర్లలో టార్గెట్ ఊదేశారు. ఇద్దరూ వికెట్ కోల్పోకుండా మరో 13 బంతులు మిగిలుండగానే టార్గెట్ ని ఫినిష్ చేశారు. బాబర్ అజామ్ (52 బంతుల్లో 68 పరుగులు), మహ్మద్ రిజ్వాన్ (55 బంతుల్లో 79 పరుగులు ) చేశారు ఈ ఇద్దరూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీ బాదుతూ.. సింగిల్ తీస్తూ.. టీమిండియా బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. ఈ క్రమంలో పది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేశారు .ఆ తర్వాత కూడా బాబర్, రిజ్వాన్ ల వికెట్లు తీయలేక నానా తంటాలు పడ్డారు భారత బౌలర్లు. ఈ క్రమంలో మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ లు ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ విజయంతో పాకిస్థాన్ 2 పాయింట్లతో ధనాధన్ టోర్నీలో బోణి చేసింది.

  దుబాయ్ వేదికగా జరుగుతున్న హై ఓల్టేజ్ టెన్షన్ మ్యాచులో ఫస్ట్ లో తడబడ్డ భారత్ ఆఖరికి నిలబడింది. విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ కు తోడు.. పంత్ కీలక ఇన్నింగ్స్ టీమిండియాను రేస్ లో నిలబెట్టింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(49 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్‌తో 57) హాఫ్ సెంచరీతో ఆదుకోవడంతో దాయాదీ పాకిస్థాన్ ముందు భారత్ 152 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్‌కు.. రిషభ్ పంత్(30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) మెరుపులు తోడవడంతో భారత్ పోరాడే స్కోర్ చేయగలిగింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు చేసింది. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది మూడు వికెట్లు తీయగా.. హసన్ అలీ, షాదాబ్ ఖాన్, హ్యారిస్ రౌఫ్ చెరొక వికెట్ తీశారు.
  ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. పాక్ యువపేసర్ షాహిన్ షా అఫ్రిది వేసిన ఫస్ట్ ఓవర్ నాలుగో బంతికి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో, భారత్ 1 పరుగుకే ఓ వికెట్ కోల్పోయింది. క్రీజులోకి కెప్టెన్ విరాట్ కోహ్లీ రాగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. దీంతో, అఫ్రిది వేసిన మూడో ఓవర్ ఫస్ట్ బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్ ధాటిగా ఆడించే ప్రయత్నం చేశాడు. అయితే షాహిన్ షా వేసిన ఐదో ఓవర్‌లో కోహ్లీ భారీ సిక్సర్‌‌ బాదాడు. కానీ హసన్ అలీ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ ఔటవ్వడంతో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బతగిలింది. దీంతో, పవర్ ప్లేలో భారత్ మూడు వికెట్ల నష్టానికి 36 పరుగులు మాత్రమే చేసింది.

  ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్‌తో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో ఈ జోడీ ఆచితూచి ఆడింది. వీలు చిక్కిన బంతినే బౌండరీకి తరలించింది. అయితే ఇన్నింగ్స్ లో జోరు చూపించిన పంత్.. భారీ షాట్‌కు ప్రయత్నించిన క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. షాదాబ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అయితే, మరో ఎండ్ లో కోహ్లీ మాత్రం తనదైన క్లాస్ బ్యాటింగ్‌ను కొనసాగించాడు. జడేజా సైతం అతనికి సహకరించడంతో స్కోర్ బోర్డు ముందుకు పరుగెత్తింది. ఈ క్రమంలోనే 45 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫోర్ బాది టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన జడేజా.. అదే జోరులో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక షాహిన్ షా అఫ్రిది వేసిన 18వ ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన కోహ్లీ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఆఖరి ఓవర్‌లో హార్దిక్ ఔటవ్వగా.. భువనేశ్వర్ కుమార్ రెండు క్విక్ డబుల్స్‌తో పాటు ఓ సింగిల్ తీయడంతో భారత్ 151 పరుగుల మెరుగైన స్కోర్ చేయగలిగింది.
  Published by:Sridhar Reddy
  First published: