Ind Vs Pak : ఓయ్ అంపైర్ నిద్రపోతున్నావా..? నీ నిర్లక్ష్యం టీమిండియాకు శాపమైంది..!

Photo Credit : Twitter

Ind Vs Pak : అంపైరింగ్ తప్పిదం టీమిండియా కొంపముంచిందా..? అసలు ఇలాంటి కీలకపోరులో థర్డ్ అంపైర్ నిద్రపోతున్నాడా..? కేఎల్ రాహుల్ ఔట్ ఇప్పుడు వివాదం సృష్టిస్తోంది.

  • Share this:
    హై ఓల్టేజ్ పోరు కాస్తా ఏకపక్షం అయింది. టీ-20 వరల్డ్ కప్ (T-20 World Cup 2021) ల్లో భారత్ మీద తమకున్న చెత్త రికార్డును చెరిపేస్తూ చరిత్ర సృష్టించింది పాకిస్థాన్. 152 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పాక్ ఓపెనర్లు వికెట్ కోల్పకుండా 18.5 ఓవర్లలో టార్గెట్ ఊదేశారు. ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో ఇప్పటిదాకా పాకిస్తాన్ చేతుల్లో ఓడిపోయి, టీమిండియా ఆధిపత్యానికి తెర పడింది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో ఐదు విజయాల తర్వాత పాక్ చేతుల్లో తొలి ఓటమి ఎదుర్కొంది భారత జట్టు. అది కూడా కనీస పోరాటం కూడా లేకుండా, ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయకుండా 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది భారత జట్టు. పాకిస్థాన్ ఓపెనర్లు ఇద్దరూ వికెట్ కోల్పోకుండా మరో 13 బంతులు మిగిలుండగానే టార్గెట్ ని ఫినిష్ చేశారు.

    బాబర్ అజామ్ (52 బంతుల్లో 68 పరుగులు), మహ్మద్ రిజ్వాన్ (55 బంతుల్లో 79 పరుగులు ) చేశారు ఈ ఇద్దరూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీ బాదుతూ.. సింగిల్ తీస్తూ.. టీమిండియా బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. ఈ క్రమంలో పది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేశారు .ఆ తర్వాత కూడా బాబర్, రిజ్వాన్ ల వికెట్లు తీయలేక నానా తంటాలు పడ్డారు భారత బౌలర్లు. ఈ క్రమంలో మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ లు ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ విజయంతో పాకిస్థాన్ 2 పాయింట్లతో ధనాధన్ టోర్నీలో బోణి చేసింది.


    అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్(3) ఔట్‌ ఇప్పుడు వివాదాన్ని సృష్టించింది. మరోసారి అంపైరింగ్ తప్పిదాన్ని ఎత్తి చూపింది. షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ క్లీన్ బోల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అయితే రీప్లే‌లో బౌలర్ షాహీన్ అఫ్రిది నో బాల్ వేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.




    అయితే దీన్ని అంపైర్ నో బాల్‌గా ప్రకటించకపోవడం పట్ల భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ట్విట్టర్ వేదికగా అంపైర్ తప్పుడు నిర్ణయంపై మండిపడుతున్నారు. అంపైర్ నిద్రపోతున్నాడా? అంటూ నో బాల్‌కు సంబంధించిన ఫోటోను కూడా జతచేర్చుతో ట్వీట్స్ చేస్తున్నారు. ఫీల్డ్ అంపైర్ అంటే తప్పు చేసి వుండొచ్చు. థర్డ్ అంపైర్ ఏం చేస్తున్నట్లు అని ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.






    అంతకుముందు, హై ఓల్టేజ్ టెన్షన్ మ్యాచులో భారత బ్యాటర్లు నిరాశపర్చారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడే మెరవడంతో టీమిండియా కనీసం 151 పరుగులైనా చేయగలిగింది. లేకపోతే, పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(49 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్‌తో 57) హాఫ్ సెంచరీతో ఆదుకోవడంతో దాయాదీ పాకిస్థాన్ ముందు భారత్ 152 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

    కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్‌కు.. రిషభ్ పంత్(30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) మెరుపులు తోడవడంతో భారత్ పోరాడే స్కోర్ చేయగలిగింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు చేసింది. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది మూడు వికెట్లు తీయగా.. హసన్ అలీ, షాదాబ్ ఖాన్, హ్యారిస్ రౌఫ్ చెరొక వికెట్ తీశారు.
    Published by:Sridhar Reddy
    First published: