టీ20 వరల్డ్‌కప్ 2021 (T20 World Cup 2021) మ్యాచ్‌లు రసవత్తరంగా జరుగుతున్నాయి. అన్ని జట్లు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్నాయి. పాకిస్థాన్ చేతిలో ఓటమి తర్వాత న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగే మ్యాచ్ కోసం భారత్ (India Vs New Zealand) సిద్ధమవుతోంది. ఆ టీమ్తోనూ ఓటమి ఎదురైతే టోర్నమెంట్ ఆశలపై నీలి మేఘాలు కమ్ముకున్నట్లే అవుతుంది. మరోవైపు, న్యూజిలాండ్ ది కూడా అదే పరిస్థితి. పాకిస్థాన్ చేతితో ఎదురైన పరాజయాన్ని మరిచి టోర్నీ ముందుకు సాగాలంటే తప్ప గెలవాల్సిన మ్యాచ్ కోసం సమాయత్తం అవుతోంది. టీమిండియాతో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే, ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ కు టీమిండియాపై ఘనమైన రికార్డు ఉంది. గత 18 ఏళ్లల్లో న్యూజిలాండ్ పై ఐసీసీ టోర్నీల్లో విజయాన్ని అందుకోలేకపోయింది టీమిండియా.
ఐసీసీ టోర్నీల్లో ఒక్కసారి మాత్రమే న్యూజిలాండ్ పై విజయాన్ని అందుకుంది టీమిండియా.
2003 వన్డే వరల్డ్ కప్‌లో మాత్రం భారత జట్టు కష్టపడి మ్యాచ్ గెలిచింది. కివీస్ జట్టును టీమ్ ఇండియా బౌలర్లు 146 పరుగులకే కట్టడి చేశారు. కానీ భారత జట్టు ఛేదనలో తడబడింది. సెహ్వాగ్, సచిన్, గంగూలీ పూర్తిగా విఫలమయ్యారు. అయితే మహ్మద్ కైఫ్ 68, రాహుల్ ద్రవిడ్ 53 కలిసి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ టీమ్ ను నడిపించింది ఎవరో తెలుసుగా.. బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ.
ఇక, టీమిండియా 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో పాకిస్తాన్‌ను భారత్ రెండు సార్లు ఓడించింది. కానీ, న్యూజీలాండ్ జట్టుపై మాత్రం ఓడిపోయింది. కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 190 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్ష్య ఛేదనలో భారత జట్టు ధాటిగానే మొదలు పెట్టినా.. మిడిల్ ఆర్డర్ విఫలం కావడంతో భారత జట్టు 180 పరుగులకే పరిమితం కావల్సి వచ్చింది. దీంతో కివీస్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇది కూడా చదవండి : కింగ్ కోహ్లీ వర్సెస్ కేన్ మామ.. టోర్నీలో తొలి విజయం కోసం ఆరాటం.. తుది జట్లు ఇవే..!
టీ20 వరల్డ్ కప్ 2016 ఇండియాలో జరిగినప్పుడు గ్రూప్ 2లో ఉన్న ఇండియా - న్యూజీలాండ్ జట్ల నాగ్‌పూర్‌లో తలపడ్డాయి. కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 126/7 స్వల్ప స్కోరునే సాధించింది. కానీ భారత జట్టు మరింత దారుణంగా ఆడి ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. కేవలం 18.1 ఓవర్లలో 79 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఇది కూడా చదవండి : "అలాంటి వెధవల్ని ఎంటర్టైన్ చేయడానికి కాదు మేముంది" .. షమీకి అండగా విరాట్ కోహ్లీ..
ఇక తాజాగా జరిగిన ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో కూడా భారత జట్టు ఓడిపోయింది. టీమ్ ఇండియాతో జరిగిన ఫైనల్లో కివీస్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించి తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ గెలుచుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ind vs Nz, India vs newzealand, Kane Williamson, Sourav Ganguly, T20 World Cup 2021, Virat kohli