అదృష్టం కలిసిరాలేదు.. ! అద్భుతం జరగలేదు.. ! 130 కోట్ల ప్రజల ఆశలు మోస్తున్న విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమిండియా (Team India) కు నిరాశ తప్పలేదు. కీలక మ్యాచులో ఆల్ రౌండ్ షో తో అదరగొట్టిన న్యూజిలాండ్ దర్జాగా సెమీస్ లోకి అడుగుపెట్టింది. దీంతో, పసికూన ఆఫ్ఘాన్, పటిష్ట న్యూజిలాండ్‌ను ఓడించాలని, ఓడిస్తుందని ఆశలు పెట్టుకున్న భారత అభిమానుల ఆశ నెరవేరలేదు. దీంతో భారత జట్టు, సోమవారం, నమీబియాతో నామమాత్రపు ఆఖరి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో చెలరేగి.. ఫ్యాన్స్ కు ఉపశమనం అందించాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2021)ను విజయంతో ముగించాలని కోహ్లీసేన ప్రయత్నిస్తోంది. సెమీస్ చేరే అవకాశాలు లేకపోవడంతో ఈ మ్యాచ్ బరిలోకి దిగే టీమిండియాలో ఒకటి రెండు మార్పులు జరిగే అవకాశం ఉంది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి రిజర్వ్ బెంచ్‌కు అవకాశాలు ఇవ్వవచ్చు. దీంతో, నమీబియాతో బరిలోకి దిగే టీమిండియా తుది జట్టుపై ఓ లుక్కేద్దాం.
బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బరిలోకి దిగడం ఖాయం. ప్రస్తుతం ఈ ఇద్దరు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇతర బ్యాటర్లకు అవకాశం ఇవ్వకుండా పరుగులు చేస్తున్నారు. ఆ తర్వాత ఫస్ట్ డౌన్‌లో విరాట్ కోహ్లీ ఆడనున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విరాట్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. అనంతరం సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగుతాడు. ఆ తర్వాత హార్డ్ హిట్టర్స్ రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేయనున్నారు. అయితే, బౌలింగ్ లోనే టీమిండియా ప్రయోగాలు చేసే ఛాన్సుంది.
ఈ టోర్నీలో ఇంతవరకు ఒక వికెట్ కూడా తీయలేకపోయినా.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీపై వేటు పడే అవకాశం ఉంది. అతని స్థానంలో రాహుల్ చాహర్‌ను ఆడించే చాన్సుంది. ఇప్పటి వరకు రాహుల్ చాహర్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే అశ్విన్‌తో పాటు రాహుల్ చాహర్ ఆడే అవకాశం ఉంది. లేదంటే శార్దూల్ ఠాకూర్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వవచ్చు.
ఇక సీనియర్ పేసర్లు అయిన మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రాల్లో ఒకరికి విశ్రాంతినివ్వవచ్చు. ఈ టోర్నీలో బుమ్రా పర్వాలేదనిపించినా.. షమీ గత మ్యాచ్‌తో టచ్‌లోకి వచ్చాడు. పాక్‌తో మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన భువనేశ్వర్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం ఇవ్వవచ్చు. లేదంటే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే శార్దూల్‌ను తీసుకురావచ్చు. షమీ, బుమ్రాల్లో ఒకరు మాత్రం ఆడటం ఖాయం. స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా జట్టులో ఉంటారు.
ఇది కూడా చదవండి : గేల్ మామ.. నువ్వు నీ చిలిపి చేష్టలు..! ప్లేట్ ఫిరాయించిన యూనివర్శల్ బాస్..
భారత తుది జట్టు అంచనా :
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్/భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ/రాహుల్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jasprit Bumrah, Ravindra Jadeja, Rohit sharma, T20 World Cup 2021, Team India, Virat kohli