తొలి సన్నాహక మ్యాచ్‌లో ఇంగ్లండ్ (England)ను చిత్తు చేసి టీ20 ప్రపంచకప్(T-20 World Cup 2021) ప్రయాణాన్ని ఘనంగా ఆరంభించిన టీమిండియా (Team India) మరో ప్రాక్టీస్ సమరానికి సిద్ధమైంది. బుధవారం తన రెండో, చివరి సన్నాహక పోరులో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. చిరకాల శత్రువు పాకిస్థాన్‌ను ఎదుర్కోవడానికి ముందు భారత జట్టు తమ అస్త్రశస్త్రాలను సరిచూసుకునేందుకు ఇదే చివరి అవకాశం. ఈనెల 24న పాకిస్థాన్‌తో పోరుతో టీమిండియా (India Vs Pakistan) ఈ మెగా టోర్నీని ఆరంభించనుంది.దీంతో తమ బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండాలనే విషయంపై ఎక్కువగా దృష్టి సారించనుంది. ఎందుకంటే మెగా టోర్నీకి తుది జట్టును ఖరారు చేసే విషయంలో ఆస్ట్రేలియాతో జరిగే ప్రాక్టీస్ మ్యాచే కీలకం కానుంది. ఇక, ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక, టీమిండియా ఈ మ్యాచ్ లో మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. కెప్టెన్ గా రోహిత్ శర్మ (Rohit Sharma) ఈ మ్యాచ్ కు నాయకత్వం వహించనున్నాడు. విరాట్ కోహ్లీ, బుమ్రా, షమీలకు ఈ మ్యాచ్ లో విశ్రాంతి కల్పించారు.
సోమవారం జరిగిన తొలి వార్మప్‌లో ఇంగ్లండ్‌పై భారత బ్యాట్స్‌మెన్ అదరగొట్టడం సానుకూలాంశం. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. క్లాస్ బ్యాటింగ్‌తో కనువిందు చేశారు. ఐపీఎల్ ఫామ్‌ను ఇక్కడా కొనసాగించారు. సూర్యకుమార్ యాదవ్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఇంగ్లండ్‌తో వామప్ మ్యాచ్‌కు ముందు మెగా ఈవెంట్‌లో రోహిత్‌తో కలిసి రాహుల్ ఓపెనర్‌గా వస్తాడని చెప్పడం ద్వారా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే స్పష్టతనిచ్చాడు. మూడో స్థానంలో తానే వస్తున్నట్టుగా కూడా ప్రకటించాడు.
ఇక ఇంగ్లండ్‌పై ఇషాన్ కిషన్ 70 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో అతడిని కూడా తుది జట్టులో ఆడించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో సూర్య రిథమ్ అందుకోకుంటే మాత్రం.. అతను బెంచీకే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఇంగ్లాండ్‌పై బ్యాటింగ్ చేయని రోహిత్.. ఆస్ట్రేలియాపై ఆడే అవకాశముంది. కానీ ప్రధానంగా చర్చ జరుగుతున్నది మాత్రం ఆల్‌రౌండ్ హార్దిక్ పాండ్య గురించే. ఇంగ్లాండ్‌పై అతడు అంత సౌకర్యంగా కనపడలేదు.
ఆస్ట్రేలియా కూడా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. తమ తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై చివరి ఓవర్‌లో ఉత్కంఠ విజయం అందుకుంది. అయితే ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేలవ ఫామ్ ఇక్కడా కొనసాగింది. అతను ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే ఔటయ్యాడు. మెగా టోర్నీ ముందు అతను ఫామ్‌లోకి రావడం అటు జట్టుకు ఇటు వార్నర్‌కు ఎంతో కీలకం. మరోవైపు న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మిడిలార్డర్ కూడా విఫలమైంది.
ఇది కూడా చదవండి : మహాసంగ్రామంలో పాక్ తో తలపడే భారత తుది జట్టు ఇదే..! ఆ ఇద్దరు డౌటే..!
టెయిలెండర్లు అగర్, స్టార్క్, ఇంగ్లిస్ వేగం కారణంగానే చివర్లో గట్టెక్కింది. అయితే బౌలింగ్‌లో ఆడమ్ జంపా, రిచర్డ్‌సన్ ప్రమాదకరంగా కనిపిస్తున్నారు. న్యూజిలాండ్‌తో కష్టంగా గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్‌పైనైనా సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఆత్మవిశ్వాసంతో ప్రపంచకప్‌లో అడుగుపెట్టాలనుకుంటోంది.
బ్యాటింగ్, ఫీల్డింగ్ కు దిగే తుది జట్లు :
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తీ, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్(కెప్టెన్), మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, అష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్ సన్, ఆడమ్ జంపా, గ్లెన్ మ్యాక్స్ వెల్, ప్యాట్ కమిన్స్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, India vs australia, Rohit sharma, Sports, T20 World Cup 2021, Virat kohli