టీ-20 వరల్డ్ కప్ 2021 ( T20 World Cup 2021) భాగంగా టీమిండియా (Team India) వరుస పరాజయాలతో ఘోర విమర్శలు ఎదుర్కొంటోంది. వరుసగా తొలి రెండు మ్యాచ్‌లను పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లపై ఓడిపోవడంతో సెమీఫైనల్స్ ఆశలు ఇండియాకు దాదాపుగా లేనట్టే. ఇప్పుడిక ఇండియాకు మిగిలిన మూడు మ్యాచ్‌లలో తప్పనిసరిగా గెలవడమే కాకుండా, ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉండటం మిగిలింది. ఇతర జట్ల జయాపజయాల సంగతెలా ఉన్నా.. కనీస పరువు దక్కించుకోవాలంటే టీమిండియా మాత్రం అఫ్గానిస్థాన్ (Afghanistan) తో జరుగుతున్న కీలక పోరులో గెలవాల్సిందే. భారత్ టోర్నీలో ఇంకా బోణీ చేయకపోగా... అఫ్గాన్ టీమ్ తమకంటే బలహీనమైన నమీబియా, స్కాట్లాండ్‌లపై ఘన విజయాలు సాధించి గ్రూప్ టాపర్ పాకిస్తాన్‌ను దాదాపు ఓడించినంత పని చేసింది. దీంతో మరోసారి టీమిండియాకు టఫ్ ఫైట్ తప్పదనిపిస్తోంది. పేలవ ప్రదర్శనతో తొలి రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతుల్లో పరాజయంపాలైన భారత్.. అన్ని విభాగాల్లోనూ రాణించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో అఫ్గాన్‌ను ఓడిస్తుందా? అనేది కూడా అభిమానుల్లో డౌట్ ను కలిగిస్తోంది.
ఈ కీలక మ్యాచులో మరోసారి రోహిత్ శర్మ(Rohit Sharma), కేఎల్ రాహుల్ (KL Rahul) ఓపెనింగ్ దిగే అవకాశాలున్నాయి. ఫిట్నెస్ సమస్యలున్న సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో వస్తాడా లేదా అనేది ఇంకా తెలియదు. పెద్దగా రాణించని హార్దిక్ పాండ్యాను పక్కనబెట్టే అవకాశాలున్నాయి. మిస్టరీ స్పిన్నర్‌గా ఉన్న వరుణ్ చక్రవర్తిని తప్పించి అశ్విన్ ను తీసుకునే ఛాన్స్ ఉంది.
పదే పదే రవిచంద్రన్ అశ్విన్‌ను విస్మరిస్తుండడంపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో అతడు ఎలాంటి తుది జట్టును ఎంచుకుంటారన్నది ఆసక్తికరం. ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌లోనూ అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. అప్పటి నుంచి కోహ్లీ, అశ్విన్ మధ్య బేధాభిప్రాయాలున్నాయనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాకుండా అశ్విన్‌ను టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయడం కోహ్లీ ఇష్టం లేదనే చర్చ కూడా జరుగుతుంది.
కానీ ప్రస్తుతం టీమిండియా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. అఫ్గాన్ బ్యాటర్లకు అశ్విన్‌ను ఎదుర్కొన్న అనుభవం లేని నేపథ్యంలో.. అతణ్ని ఆడించే అవకాశాన్ని జట్టు పరిశీలించనుంది. అయితే కోహ్లి మరోసారి అశ్విన్‌ను పక్కన పెడితే.. అతడి పట్ల కోహ్లి వైఖరిపై చర్చ తీవ్రమయ్యే అవకాశముంది. కోహ్లీతో పాటు భారత బ్యాట్స్‌మెనంతా ఫామ్‌లోకి రావడం భారత్‌కు చాలా అవసరం. ప్రధాన బౌలర్లు బుమ్రా, షమీ ఈ మ్యాచ్‌లోనైనా ప్రభావం చూపించాలని జట్టు ఆశిస్తోంది. రవీంద్ర జడేజా బౌలింగ్ లో ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అఫ్గానిస్థాన్‌పై టి20 ప్రపంచకప్‌లో రెండు సార్లు తలపడిన భారత్ రెండుసార్లూ గెలుపొందింది. అయితే గత కొన్నేళ్లుగా ఈ ఫార్మాట్‌లో ఆ జట్టు ఎంతో మెరుగు పడింది. ఒక ఓవర్ ఫలితాన్ని మార్చేసే అవకాశం ఉన్న టీ20ల్లో అఫ్గాన్ ఎన్నో సార్లు సంచలనాలకు చేరువగా వచ్చింది. ఈ టోర్నీలో కూడా ఆసిఫ్ అలీ అనూహ్యంగా చెలరేగి ఉండకపోతే పాక్‌పై కూడా అఫ్గాన్ గెలిచేదేమో! దీంతో, అఫ్గాన్ ను తక్కువ అంచనా వేస్తే ఇక అంతే సంగతులు.
ఓపెనర్లు హజ్రతుల్లా, షహజాద్ ప్రతీసారి శుభారంభాలు అందించారు. కెప్టెన్ నబీకి భారీ షాట్లు ఆడగల నైపుణ్యం ఉంది. అఫ్గాన్ టీమ్‌కు కూడా యూఏఈ వేదికలపై మంచి అనుభవం ఉంది. అన్నింటికి మించి టీమ్‌లో స్పిన్నర్ల 12 ఓవర్లు మ్యాచ్‌ను శాసిస్తాయి. రషీద్ ఖాన్, నబీ, ముజీబ్‌లు సత్తా చాటితే భారత బ్యాటర్లకు అంత సులువు కాదు. మొత్తంగా ఈ టీమ్ అంటే తేలికభావం చూపించకుండా భారత్ ఆడాల్సి ఉంది.
తుది జట్లు అంచనా :
టీమిండియా : విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్/సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి/ రవిచంద్రన్ అశ్విన్.
అఫ్గానిస్థాన్ : మహమ్మద్ నబీ (కెప్టెన్), హజ్రతుల్లా, షహజాద్, రహ్మానుల్లా, హష్మతుల్లా/ఉస్మాన్, నజీబుల్లా, గుల్బదిన్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్, హసన్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Cricket, Rohit sharma, T20 World Cup 2021, Team India, Virat kohli