Home /News /sports /

Ind Vs Afg : ఇదే కదా టీమిండియా అంటే..! అఫ్గాన్ పై భారీ తేడాతో గెలిచిన కోహ్లీసేన..

Ind Vs Afg : ఇదే కదా టీమిండియా అంటే..! అఫ్గాన్ పై భారీ తేడాతో గెలిచిన కోహ్లీసేన..

Team India (PC : ICC)

Team India (PC : ICC)

Ind Vs Afg : ఇక, ఈ మెగా టోర్నీలో టీమిండియాకు ఇదే తొలి విక్టరీ. ఈ విజయంతో తన ఆశల్ని సజీవంగా ఉంచుకుంది భారత్. ఒక వేళ అఫ్గానిస్థాన్.. న్యూజిలాండ్ ను ఓడిస్తే టీమిండియాకు ఛాన్స్ ఉంటుంది. అలాగే, టీమిండియా మిగతా రెండు మ్యాచుల్లో భారీ రన్ రేట్ తో గెలవాలి.

ఇంకా చదవండి ...
    వరుస ఓటముల నుంచి భారత జట్టు కోలుకుంది. దెబ్బ తిన్న పులిలా అఫ్గానిస్థాన్ పై విరుచుకుపడింది కోహ్లీ సేన. వరుస పరాజయాలతో ఘోర విమర్శలు ఎదుర్కొన్న కోహ్లీసేన అఫ్గానిస్థాన్ కు చుక్కలు చూపించింది. కీలక పోరులో 66 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్ ను చిత్తు చేసింది టీమిండియా. అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు, అశ్విన్ రెండు వికెట్లతో సత్తా చాటారు. అఫ్గానిస్థాన్ బ్యాటర్లలో మహ్మద్ నబీ ( 32 బంతుల్లో 35 పరుగులు), కరీమ్ జన్నత్ ( 22 బంతుల్లో 42 పరుగులు) రాణించారు. ఇక, ఈ మెగా టోర్నీలో టీమిండియాకు ఇదే తొలి విక్టరీ. ఈ విజయంతో తన ఆశల్ని సజీవంగా ఉంచుకుంది భారత్. ఒక వేళ అఫ్గానిస్థాన్.. న్యూజిలాండ్ ను ఓడిస్తే టీమిండియాకు ఛాన్స్ ఉంటుంది. అలాగే, టీమిండియా మిగతా రెండు మ్యాచుల్లో భారీ రన్ రేట్ తో గెలవాలి.

    211 పరుగుల భారీ టార్గెట్ తో దిగిన అఫ్గానిస్థాన్ కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్లు 13 పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. మహ్మద్ షెహజాద్ మహ్మద్ షమీ బౌలింగ్ లో డకౌట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఓవర్ లోనే మరో వికెట్ కోల్పోయింది అఫ్గాన్. 13 పరుగులు చేసిన మరో ఓపెనర్ జాజయ్ బుమ్రా బౌలింగ్ శార్దూల్ ఠాకూర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత గుర్బాజ్, గుల్బదిన్ కాసేపు పోరాటారు. గుర్బాజ్ అయితే షమీ ఓవర్ లో రెండు భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని రవీంద్ర జడేజా విడదీశాడు. 10 బంతుల్లో 19 పరుగులు చేసిన గుర్బాజ్.. భారీ షాట్ కు ప్రయత్నించి హార్దిక్ పాండ్యా కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

    ఆ తర్వాత అశ్విన్ వరుస విరామాల్లో గుల్బాద్దీన్, నజీబుల్లాలను పెవిలియన్ కు పంపాడు. అశ్విన్ తన నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి రెండు వికెట్లు తీయడం విశేషం. ఆ తర్వాత కెప్టెన్ నబీతో కలిసిన కరీమ్ జన్నత్ మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్ ని ముందుకు తీసుకువెళ్లాడు. వీరిద్దరూ ఆరో వికెట్ కు 50 పరుగులకు పైగా పార్టనర్ షిప్ నెలకొల్పారు. అయితే, ఆఖర్లో షమీ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించిన నబీ జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. అదే ఓవర్ లో రషీద్ ఖాన్ కూడా హార్దిక్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి డకౌట్ గా వెనుదిరిగాడు.


    అంతకుముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా బ్యాటర్లు.. పసికూన అఫ్ఘనిస్థాన్‌పై రెచ్చిపోయారు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (74; 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులు), కేఎల్ రాహుల్‌ (69; 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు) ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ (27; 13 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులు), ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా (35; 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) కూడా ఆకాశమే హద్దుగా చెలరేగారు. మొత్తానికి భారత్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 210 రన్స్ చేసి.. ఆఫ్ఘనిస్థాన్‌ ముందు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆప్ఘన్ బౌలర్లలో కరీమ్ జనత్, గుల్బాదిన్ నైబ్ చెరో వికెట్ కూల్చారు.

    ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే పోటీపడి మరి బౌండరీలు బాదారు. షరాఫుద్దీన్‌ వేసిన రెండో ఓవర్‌లో కేఎల్ రాహుల్‌ ఫోర్‌, సిక్స్ బాదగా.. నవీన్‌ ఉల్ హక్‌ వేసిన నాలుగో ఓవర్‌లో రోహిత్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. దీంతో ఆ ఓవర్‌లో 17 పరుగులు వచ్చాయి. తర్వాతి మూడు ఓవర్లో భారత స్కోరు బోర్డు కాస్త నెమ్మదించింది. తర్వాత ఓపెనర్లు ఇద్దరూ మళ్లీ ధాటిగా ఆడారు. దీంతో 10 ఓవర్లకు భారత్‌ స్కోరు 85/0 వద్ద నిలిచింది. ఈ క్రమంలోనే రోహిత్, రాహుల్ ఇద్దరూ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. పొట్టి ప్రపంచకప్‌లలో టీమిండియాకు ఇదే అత్యధిక భాగస్వామ్యం.

    అయితే రషీద్‌ ఖాన్‌ వేసిన 14వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదిన రోహిత్ శర్మ.. తర్వాతి ఓవర్‌లోనే మొహ్మద్ నబీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ కొద్దిసేపటికే కేఎల్ రాహుల్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. దీంతో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్‌, హార్దిక్‌ పాండ్యా దూకుడుగా ఆడారు. వచ్చిరావడంతోనే బౌండరీల మోతమోగించారు. గుల్బాదీన్‌ వేసిన 17వ ఓవర్‌లో పంత్‌ రెండు సిక్సర్లు కొట్టాడు. 18వ ఓవర్‌లో మూడు ఫోర్లు బాదిన హార్ది్క్‌.. 19వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదాడు. దాంతో భారత్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఇక 20వ ఓవర్‌లో పంత్‌ రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. దీంతో ఆ ఓవర్‌లో మొత్తం 20 పరుగులు వచ్చాయి.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Afghanistan, Ravichandran Ashwin, Rohit sharma, T20 World Cup 2021, Team india, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు