ఇటీవలి కాలంలో క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్లను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసి తన డ్రీమ్ జట్టును ప్రకటిస్తున్నారు. ప్రపంచకప్, ఐసీసీ టోర్నీలు, ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీల సమయాల్లో దిగ్గజాలు ఫేవరేట్ జట్లను ప్రకటిస్తారు. ఇప్పుడు కరోనా కారణంగా ఖాళీగా ఉండడంతో పలువురు తమతమ డ్రీమ్ జట్లను ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే చేరాడు. మరో మూడు నెలల్లో టీ-20 ప్రపంచకప్ మొదలవ్వనుంది. ఈ మెగా టోర్నీ కోసం హర్షా భోగ్లే 15 మంది సభ్యులతో కూడిన ప్రపంచకప్ టీమ్‌ను అంచనా వేశాడు. ఇక తాను అంచనా వేసిన జట్టులో ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌ను ఎంపిక చేసిన భోగ్లే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌లు కచ్చితంగా ఉంటారని, ఐదో బ్యాట్స్‌మన్‌గా ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొందన్నాడు. ఈ ఇద్దరిలో ఎవరూ మెరుగ్గా రాణిస్తే వారికే చాన్స్ ఉంటుందన్నాడు. ఆశ్చర్యకరంగా ఈ వెటరన్ కామెంటేటర్ తన జట్టులో శిఖర్ ధావన్‌కు అవకాశం ఇవ్వలేదు.
హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలతో ముగ్గురు ఆల్‌రౌండర్లను ఎంపిక చేశాడు. వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌కు చోటిచ్చాడు. ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లను ఎంపిక చేసిన భోగ్లే.. నలుగురు పేసర్లను తీసుకున్నాడు. స్పిన్నర్ల కోటాలో వరుణ్ చక్రవర్తీ, యుజ్వేంద్ర చాహల్‌కు అవకాశం ఇవ్వగా.. ముగ్గురు పేసర్లు భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రాలకు కచ్చితంగా చోటు దక్కుతుందన్నాడు. అయితే నాలుగో పేసర్‌గా మాత్రం మహమ్మద్ షమీ, టీ నటరాజన్‌లో ఒకరికే అవకాశం ఉంటుందన్నాడు. ఇక టీ20లో భారత్ తరఫున 6వ హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా ఉన్న కుల్దీప్ యాదవ్‌ను భోగ్లే విస్మరించాడు. శ్రీలంక పర్యటనలో కుల్దీప్ రెండు మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ విఫలమయ్యాడు.
మరో మూడు నెలల్లో టీ20 ప్రపంచకప్ మొదలవ్వనుంది. భారత్ వేదికగా జరగాల్సిన ఈ మెగా టోర్నీ కరోనా కారణంగా యూఏఈకి తరలిన విషయం తెలిసిందే. అయితే దేశం ధాటినా ఈ మెగాటోర్నీ ఆతిథ్య హక్కులు మాత్రం బీసీసీఐ దగ్గరే ఉన్నాయ్. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ మెగా టోర్నీ నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్దం చేస్తుంది. తేదీలు ఖరారు చేసినా.. షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంది. ఐపీఎల్ 2021 సెకండాఫ్ ముగిసిన వెంటనే ఈ మెగాటోర్నీకి తెరలేవనుంది. రెండు దశల్లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. తొలి దశ ఓమన్ వేదికగా క్వాలిఫికేషన్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత యూఏఈ వేదికగా ప్రధాన లీగ్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి.
హర్షా భోగ్లే ప్రకటించిన జట్టు : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్/ఇషాన్ కిషన్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ/టీ నటరాజన్, యుజ్వేంద్ర చాహల్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.