T20 World Cup 2021 : ఓ వైపు దేశంలో కల్లోలం.. మరోవైపు కప్ కోసం పోరాటం..! అఫ్గాన్ బలబలాలు ఇవే..!

Afghanistan

T20 World Cup 2021 : అంతర్జాతీయ క్రికెట్లో.. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో అఫ్గానిస్థాన్‌ మెరుగైన ప్రదర్శనతో దూసుకెళ్తోంది. అందుకే ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో నిలిచి క్వాలిఫయర్స్‌తో అవసరం లేకుండా ఈ ప్రపంచకప్‌లో నేరుగా సూపర్‌-12 మ్యాచ్‌లు ఆడే అవకాశం కొట్టేసింది.

 • Share this:
  ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ధనాధన్ టోర్నీ టీ -20 వరల్డ్ కప్ (T-20 World Cup) మొదలైంది. రెండంచెల్లో పోటీలు జరగనుండగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా మొత్తం 16 జట్లు ఈసారి బరిలోకి దిగనున్నాయి. అసలు సిసలు సమరం సూపర్ -12 స్టేజీ అక్టోబర్ 23 న ప్రారంభం కానుంది. ర్యాంకింగ్‌ ప్రకారం భారత్ (India), వెస్టిండీస్ (West Indies), ఇంగ్లండ్ (England), ఆస్ట్రేలియా(Australia), దక్షిణాఫ్రికా(South Africa), పాకిస్తాన్ (Pakistan), న్యూజిలాండ్(New Zealand), అఫ్గానిస్తాన్‌(Afghanistan) (8 జట్లు) నేరుగా అర్హత సాధించాయి. ఇక, ఈ సారైనా బెస్ట్ ప్రదర్శన ఇద్దామనుకుంటున్న అఫ్గాన్ జట్టు బలబలాలుపై ఓ లుక్కేద్దాం.

  ఓ వైపు దేశంలో తాలిబన్ల పాలనతో కల్లోల పరిస్థితులు ఏర్పడ్డా.. అఫ్గానిస్థాన్‌ ఆటగాళ్లు మాత్రం టీ20 ప్రపంచకప్‌లో సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. భయాందోళనలో ఉన్న దేశ ప్రజలకు తమ ఆటతో రిలీఫ్ అందించేందుకు రంగంలోకి దిగుతున్నారు. పసికూన అనే ముద్రను చెరిపేసుకుని అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా ఎదుగుతున్న ఈ జట్టు.. అగ్రశ్రేణి జట్లకు షాకిచ్చేందుకు సన్నద్ధమవుతోంది.

  అంతర్జాతీయ క్రికెట్లో.. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో అఫ్గానిస్థాన్‌ మెరుగైన ప్రదర్శనతో దూసుకెళ్తోంది. అందుకే ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో నిలిచి క్వాలిఫయర్స్‌తో అవసరం లేకుండా ఈ ప్రపంచకప్‌లో నేరుగా సూపర్‌-12 మ్యాచ్‌లు ఆడే అవకాశం కొట్టేసింది. భారత్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌తో కలిసి గ్రూప్‌- 2లో ఉన్న ఆ జట్టు.. కనీసం ఒక్క విజయమైనా సాధించాలనే లక్ష్యంతో ఉంది. ఈ టాప్ జట్లను ఓడించి.. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లోపు నిలిచి అఫ్గాన్‌ సెమీస్‌ చేరడం కష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ జట్టు ఏమైనా సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాలి.

  ఇటీవల కాలంలో ఆ జట్టు పెద్దగా టీ20 మ్యాచ్‌లాడలేదు. కానీ ఆడిన గత మూడు సిరీస్‌ల్లోనూ (వెస్టిండీస్‌, ఐర్లాండ్‌, జింబాబ్వే) గెలిచింది. ముఖ్యంగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ విండీస్‌పై సిరీస్‌ విజయం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు. ఆ జట్టు ఆశలన్నీ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ మీదే ఉన్నాయి. తన ప్రమేయం లేకుండానే జట్టును ఎంపిక చేశారని ఒక్క మ్యాచ్‌కూ నాయకత్వం వహించకుండానే టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన రషీద్‌.. బంతితో జోరు కొనసాగించాల్సిన అవసరం ఉంది.

  ఇది కూడా చదవండి : సంపాదనలో భారత్, పాక్ క్రికెటర్ల మధ్య వ్యత్యాసం.. ఒక మ్యాచ్‌కి ఎంత ఇస్తారో తెలుసా!

  మరో స్పిన్నర్‌ ముజీబ్‌ కూడా ప్రమాదకారే. ఇక నంబర్‌వన్‌ టీ20 ఆల్‌రౌండర్‌ మహమ్మద్‌ నబి.. బ్యాట్‌, బంతితో సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బ్యాటింగ్‌ ఆర్డర్లోనే నిలకడగా రాణించే ఆటగాడు లేకపోవడం ఇబ్బందిగా మారింది. గుర్బాజ్‌, హజ్రతుల్లా, అస్గర్‌ లాంటి బ్యాటర్లపైనే ఆ జట్టు నమ్మకం పెట్టుకుంది.

  అఫ్గానిస్థాన్ షెడ్యూల్ :   మ్యాచ్ నెం డేట్ మ్యాచ్ టైం వెన్యూ స్టేజ్
  1 అక్టోబరు 25 అఫ్గనిస్తాన్‌ వర్సెస్‌ B1 07:30 షార్జా సూపర్‌ 12
  2 అక్టోబరు 29 అఫ్గనిస్తాన్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ 07:30 దుబాయ్‌ సూపర్‌ 12
  3 అక్టోబరు 31 అఫ్గనిస్తాన్‌ వర్సెస్‌ A2 03:30 అబుదాబి సూపర్‌ 12
  4 నవంబరు 3 ఇండియా వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌ 07:30 అబుదాబి సూపర్‌ 12
  5 నవంబరు 7 న్యూజిలాండ్‌ వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌ 03:30 అబుదాబి సూపర్‌ 12

  కీలక ఆటగాళ్లు: రషీద్‌, ముజీబ్‌, నబి, గుర్బాజ్‌

  అత్యుత్తమ ప్రదర్శన: సూపర్‌- 10 (2016)

  అఫ్గానిస్థాన్‌ జట్టు: నబి (కెప్టెన్‌), అస్గర్‌, ఫరీద్‌, గుల్బాదిన్‌, హమీద్‌, హష్మతుల్లా, హజ్రతుల్లా, కరీమ్‌, షాజాద్‌, ముజీబ్‌, జాద్రాన్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, గుర్బాజ్‌, రషీద్‌, ఉస్మాన్‌.
  Published by:Sridhar Reddy
  First published: