Ind Vs Pak : చరిత్ర రిపీట్ అయ్యేనా..? బ్లాక్ బస్టర్ ధమాకాలో భారత్, పాక్ తుదిజట్లు ఇవే..!

Ind Vs Pak

Ind Vs Pak : ఒకే గ్రూప్‌లో ఉన్న దాయాదీ దేశాలు ఆదివారం అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. రెండేళ్ల తర్వాత భారత్-పాకిస్థాన్ లు మళ్లీ గ్రౌండ్ లో హోరాహోరిగా తలపడబోతున్న సందర్భంలో ఇరు జట్ల ఆటగాళ్లలో ఒత్తిడి సహజంగానే ఎక్కువగా ఉంటుంది.

 • Share this:
  నరాలు తెగే ఉత్కంఠ, బంతి బంతికి మారే ఆధిపత్యం.. విజయం కోసం ఆఖరి వరకు పోరాటం.. మైదానంలో యుద్ధం లాంటి వాతావరణం.. కేవలం ఇది ఇండియా వర్సెస్ పాకిస్థాన్ (India Vs Pakistan) పోరులోనే చూస్తాం. అలాంటి బ్లాక్ బస్టర్ పోరు కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ (T-20 World Cup 2021).. ఈ మరి కొద్ది గంటల్లో ఈ బ్లాక్ బస్టర్ పోరుకు వేదికకానుంది. ఒకే గ్రూప్‌లో ఉన్న దాయాదీ దేశాలు ఆదివారం అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. రెండేళ్ల తర్వాత భారత్-పాకిస్థాన్ లు మళ్లీ గ్రౌండ్ లో హోరాహోరిగా తలపడబోతున్న సందర్భంలో ఇరు జట్ల ఆటగాళ్లలో ఒత్తిడి సహజంగానే ఎక్కువగా ఉంటుంది. ఈ హై టెన్షన్ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్స్, హెడ్ టు హెడ్ రికార్డులపై ఓ లుక్కేద్దాం.

  టీమిండియా లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ (Rohit Sharma), లోకేష్ రాహుల్ (Kl Rahul) బరిలోకి దిగనున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో వీరిద్దరూ అదరగొట్టిన సంగతి తెలిసిందే. విరాట్‌ కోహ్లీ మూడు, సూర్యకుమార్ యాదవ్‌ నాలుగు, రిషబ్ పంత్‌ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతారు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ చేయకున్నా.. ఫినిషర్‌ అవసరం ఉంది కాబట్టి ఆరో స్థానంలో అతన్ని దించే అవకాశం ఉంది.

  రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ గా జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. ఇక, టీమిండియా బౌలర్లుగా మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా స్ధానాలు ఖాయం. ఇక, మూడో పేసర్ గా శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర కుమార్ ల్లో ఒకరికి చోటు దక్కవచ్చు. ఫామ్ ప్రకారం చూస్తే శార్దూల్ ఠాకూర్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయ్. ఇక, రెండో స్పిన్నర్ స్ధానం కోసం రవిచంద్రన్ అశ్విన్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ లు పోటీపడుతున్నారు. సీనియర్ స్పిన్నర్ గా రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులో చోటు దక్కించుకోవచ్చు.

  ఇది కూడా చదవండి : సూపర్ -12 స్టేజ్ ముందు శ్రీలంకకు భారీ షాక్.. కొంపముంచిన బయోబబుల్ ..!

  ఇక, దాయాది టీమ్ లో మహ్మద్ రిజ్వాన్ (Mohammed Rizwan), బాబర్ అజమ్‌ (Babar Azam) లు పాక్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఈ ఏడాది టీ20ల్లో ఇద్దరు ఆటగాళ్లు గొప్ప ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరూ రాణిస్తే టీమిండియాకు కష్టమే. ఇక, వన్‌డౌన్‌లో ఫఖర్ జమాన్‌ బరిలోకి దిగనున్నాడు. భారీ హిట్టింగ్ తో విరుచుకుపడే ఫఖర్ జమాన్ క్షణాల్లో ఆటను మార్చగలడు.

  ఇది కూడా చదవండి : గత టీ-20 వరల్డ్ కప్ ల్లో పాక్ ను భారత్ ఎలా మట్టికరిపించిందో గుర్తుందా..?

  నాలుగు, ఐదు స్థానాల్లో సీనియర్లు షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్‌లు కరెక్ట్. వీరిద్దరి అనుభవం పాకిస్తాన్ జట్టుకు ఉపయోగపడనుంది. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో మొహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం చోటు దక్కించుకున్నారు. షాదాబ్, ఇమాద్ స్పిన్నర్లుగా రాణించగలరు. ఇక పేస్‌ బౌలింగ్‌ విభాగంలో షహీన్ షా అఫ్రిది, హసన్ అలీ, హారిస్ రౌఫ్‌లు కీ రోల్ ప్లే చేయనున్నారు.

  హెడ్ టు హెడ్ రికార్డులు :

  ప్రపంచకప్‌ల్లో, ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో దాయాదీపై భారత్‌దే పూర్తి ఆధిపత్యం. టీ20ల్లో 8 మ్యాచుల్లో 6 టీమిండియా, ఒకే ఒక్క మ్యాచ్‌లో పాక్ గెలిచింది. మరొక మ్యాచ్‌ టైగా ముగిసినా.. బౌలౌట్‌లో విజయం భారత్‌నే వరించింది. టీ20 ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లకు ఐదు భారతే గెలిచింది.

  తుది జట్లు అంచనా :

  టీమిండియా : రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్‌, రిషబ్ పంత్‌ (కీపర్), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్/ వరుణ్ చక్రవర్తి, మహమ్మద్‌ షమీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌/శార్దూల్ ఠాకూర్‌.

  పాకిస్థాన్ : బాబర్ అజమ్ (కెప్టెన్‌), మొహమ్మద్ రిజ్వాన్ (వికెట్‌ కీపర్‌), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఇమాద్‌ వసీం, హసన్ అలీ, హారిస్ రౌఫ్, షహీన్ షా అఫ్రిది.
  Published by:Sridhar Reddy
  First published: