యూఏఈ వేదికగా జరుగుతున్న టీ-20 వరల్డ్ కప్ (T-20 World Cup 2021) ఫ్యాన్స్ అంచనాలకు అందకుండా సాగుతోంది. ఈ మెగాటోర్నీలో హాట్ ఫేవరేట్లు బొక్క బొర్లాపడుతుంటే.. మరి కొన్ని జట్లు అద్భుత విజయాలతో దూసుకుపోతున్నాయ్. ఇక, టైటిల్ కొట్టే జట్టుగా బరిలోకి దిగిన టీమిండియా (Team India)కి ఫస్ట్ మ్యాచ్ లోనే ఘోర పరాభవం ఎదురైంది. దాయాది పాకిస్థాన్ (Pakistan) చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక, సెమీస్ రేస్ లో నిలవాలంటే టీమిండియాకు ప్రతి మ్యాచ్ అగ్ని పరీక్షే. ఈ నెల 31 న తమ తదుపరి మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఢీకొనబోతోంది కోహ్లీసేన. అయితే పాకిస్థాన్ చేతిలో ఓడిన న్యూజిలాండ్‌ది కూడా ఇదే పరిస్థితి. దీంతో, ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుండటంతో ఈ ఫైట్ ఇంట్రెస్టింగ్ సాగడం ఖాయం. అయితే మెగా టోర్నీల్లో గత 18 ఏళ్లుగా న్యూజిలాండ్‌పై టీమిండియా గెలిచింది లేదు. 2003 వన్డే ప్రపంచకప్ తర్వాతి నుంచి మొన్నటి డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు అన్నింటిలోనూ భారత్ కంగుతుంది. దీంతో, ఈ రికార్డును తిరగరాయాలనే పట్టుదలతో కోహ్లీసేన ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియాలో కొన్ని మార్పులు చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇక, డూ ఆర్ డై మ్యాచ్ లో బరిలోకి దిగే టీమిండియా తుది జట్టుపై ఓ లుక్కేద్దాం.
ఈ బిగ్ ఫైట్‌కు ఓపెనర్లుగా కేఎల్ రాహుల్ (KL Rahul), రోహిత్ శర్మ (Rohit Sharma) బరిలోకి దిగడంలో ఎటువంటి అనుమానం లేదు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఈ జోడీ దారుణంగా విఫలమైనా.. వీరే ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. వార్మప్ మ్యాచ్‌ల్లో ఇరగదీసిన ఈ జోడీ.. కీలక మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది. రోహిత్ శర్మ అయితే గోల్డెన్ డక్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో ఈ మ్యాచ్‌లోనైనా సత్తా చాటాలని ఈ ఇద్దరు భావిస్తున్నారు. భారత్ భారీ స్కోర్ చేయాలంటే ఈ ఇద్దరు మంచి శుభారంభం అందించడం చాలా కీలకం.
న్యూజిలాండ్ పై ఈ ఇద్దరు మంచి శుభారంభం అందిస్తే భారత్‌కు తిరుగుండదు. ఇక ఫస్ట్ డౌన్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రావడం ఖాయం. పాక్‌పై మ్యాచ్‌లో టాప్-3 విఫలమైనా కోహ్లీ సూపర్ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. చూడ ముచ్చటైన షాట్లతో పాత కోహ్లీని తలపించాడు. అతను అదే జోరును కొనసాగిస్తే కివీస్‌కు కష్టాలు తప్పవు.
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) బరిలోకి దిగడంపై అనుమానాలు నెలకొన్నాయి. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో దారుణంగా విఫమైన పాండ్యా.. భుజ గాయానికి గురయ్యాడు. దీంతో, న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో అతన్ని ఆడిస్తారా? లేక బెంచ్‌కే పరిమితం చేస్తారా? అనేది చూడాలి. అయితే బౌలింగ్ చేయని పాండ్యా జట్టులో ఉండటం ఎందుకని ఇప్పటికే అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అతన్ని పక్కనపెడితే మాత్రం ఇషాన్ కిషన్‌ను చోటు దక్కుతుంది.
అప్పుడు పరిస్థితులను బట్టి అతన్ని బ్యాటింగ్‌కు పంపించవచ్చు. ఓపెనర్‌గా లేదా మిడిలార్డర్లో అవకాశం ఇవ్వచ్చు. ఇషాన్ కిషన్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ మిడిలార్డర్ బాధ్యతలు మోయనున్నారు. సూర్య బాధ్యతాయుతంగా ఆడాల్సిన అవసరం ఉండగా.. పాక్‌తో పంత్ అద్భుతంగా రాణించాడు.ఇక, మెయిన్ ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజా జట్టులో ఉండటం ఖాయం. అయితే పాక్‌తో మ్యాచ్‌లో జడేజా దారుణంగా విఫలమయ్యాడు. అటు బ్యాటింగ్, ఇటు బ్యాటింగ్‌లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. కనీసం న్యూజిలాండ్‌తోనైనా అతను తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలి. లేదంటే టీమిండియాకు కష్టాలు తప్పవు.
ఇక పాకిస్థాన్ చేతిలో దారుణంగా విఫలమైన భువనేశ్వర్ కుమార్ ప్లేస్‌లో శార్దూల్ ఠాకూర్‌ను తీసుకోవాలనే డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. దీంతో, భువీ ప్లేస్‌లో శార్దూల్ బరిలోకి దిగడం దాదాపు ఖాయం. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన శార్దూల్.. కీలక సమయాల్లో వికెట్లు కూడా తీయగలడు. శార్దూల్ రాకతో టీమిండియా బ్యాటింగ్ బలంగా మారనుంది. మ్యాచ్ మళ్లీ సాయంత్రం 7.30కు జరగనుంది. దీంతో, మంచు కీలక పాత్ర పోషించనుంది. ఈ ఎఫెక్ట్ తో భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి : టీమిండియాపై మరోసారి పాక్ అక్కసు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ టీమ్ కోచ్..
ప్రధాన పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలకు అవకాశం దక్కనుంది. అయితే పాక్‌తో మ్యాచ్‌లో భారత్ బౌలింగ్ విభాగం దారుణంగా విపలమైంది. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. దీంతో కీలక మ్యాచ్‌లో బుమ్రా, షమీలు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సిన అవసరం ఉంది. ఈ ఇద్దరు చెలరేగితే కివీస్‌కు కష్టాలు తప్పవు. ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ లేదా రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకోవచ్చు. ఐపీఎల్లో దుమ్మురేపిన వరుణ్.. పాక్‌తో మ్యాచ్‌లో మాత్రం తడబడ్డాడు. ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. ఈ క్రమంలో అతని ప్లేస్‌లో అశ్విన్‌ను తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
టీమిండియా తుది జట్టు అంచనా :
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా/ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి/రవిచంద్రన్ అశ్విన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, India vs newzealand, Rohit sharma, T20 World Cup 2021, Virat kohli