Ind Vs Pak : గత టీ-20 వరల్డ్ కప్ ల్లో పాక్ ను భారత్ ఎలా మట్టికరిపించిందో గుర్తుందా..?

India Vs Pakistan

Ind Vs Pak : ఒకే గ్రూప్‌లో ఉన్న దాయాదీ దేశాలు అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. ప్రపంచకప్‌ల్లో, ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో దాయాదీపై భారత్‌దే పూర్తి ఆధిపత్యం.

 • Share this:
  నరాలు తెగే ఉత్కంఠ, బంతి బంతికి మారే ఆధిపత్యం.. విజయం కోసం ఆఖరి వరకు పోరాటం.. మైదానంలో యుద్ధం లాంటి వాతావరణం.. కేవలం ఇది ఇండియా వర్సెస్ పాకిస్థాన్ (India Vs Pakistan) పోరులోనే చూస్తాం. అలాంటి బ్లాక్ బస్టర్ పోరు కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ (T-20 World Cup 2021).. ఈ బ్లాక్ బస్టర్ పోరుకు వేదికకానుంది. ఒకే గ్రూప్‌లో ఉన్న దాయాదీ దేశాలు అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. ప్రపంచకప్‌ల్లో, ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో దాయాదీపై భారత్‌దే పూర్తి ఆధిపత్యం. టీ20ల్లో 8 మ్యాచుల్లో 6 టీమిండియా, ఒకే ఒక్క మ్యాచ్‌లో పాక్ గెలిచింది. మరొక మ్యాచ్‌ టైగా ముగిసినా.. బౌలౌట్‌లో విజయం భారత్‌నే వరించింది. టీ20 ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లకు ఐదు భారతే గెలిచింది.2007 వరల్డ్ కప్ బౌలౌట్‌తో మొదలైన భారత్ విజయ ప్రస్థానం గత 2016 టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగింది.

  2007 వరల్డ్ కప్ :
  సౌతాఫ్రికా వేదికగా జరిగిన అరంగేట్ర టీ20 ప్రపంచకప్‌లో ధోనీ కెప్టెన్సీలోని టీమిండియా తన ఫస్ట్ మ్యాచ్ దాయాదీతోనే ఆడింది. షెడ్యూల్ ప్రకారం స్కాట్లాండ్‌‌తో ఆడాల్సి ఉన్నా.. వర్షంతో ఆ మ్యాచ్ బంతిపడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. దీంతో భారత్.. పాక్ తోనే ఫస్ట్ మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ధోనీసేన.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 141 రన్స్ చేసింది. రాబిన్ ఉతప్ప (50), ధోనీ (33), ఇర్ఫాన్‌ పఠాన్‌ (20) రాణించారు. ఆ తర్వాత దిగిన పాక్.. మిస్బాఉల్‌హక్ (53), షోయబ్ మాలిక్ (20) పోరాటంతో ఏడు వికెట్ల నష్టానికి సరిగ్గా 141 పరుగులే చేయగలిగింది.

  దీంతో, ఫలితాన్ని బౌలౌట్ పద్దతి ద్వారా తేల్చారు. ఈ పద్దతిని ముందే గ్రహించి ప్రాక్టీస్ చేసిన భారత్ బౌలౌట్‌లో ఇరగదీసింది. స్పిన్ బౌలర్లు అయిన వీరేంద్ర సెహ్వాగ్‌, హర్భజన్‌ సింగ్‌, రాబిన్ ఉతప్ప వికెట్లను గురి చూసి కొట్టగా.. పాక్‌ బౌలర్లు విఫలమయ్యారు. దీంతో 3-0 తేడాతో బౌలౌట్‌లో టీమిండియా విజయం సాధించింది.

  2007 వరల్డ్ కప్ ఫైనల్ :

  ఆ టోర్నీ ఫైనల్లో కూడా భారత్-పాక్ మరోసారి తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. గౌతమ్ గంభీర్ (75), రోహిత్ శర్మ (30) రాణించారు. ఆ తర్వాత 158 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్‌ 152 పరుగులకే ఆలౌటైంది. ఆర్పీ సింగ్‌ (3/26), ఇర్ఫాన్‌ పఠాన్ (3/16), జోగిందర్ శర్మ (2/20) అద్భుత బౌలింగ్‌తో భారత్‌ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది.

  2012 వరల్డ్ కప్ :
  రెండు ఎడిషన్ల(2009, 2010) తర్వాత భారత్-పాక్ జట్లు 2012లో తలపడ్డాయి. సూపర్-8 లీగ్ దశలో ఫస్ట్ పాక్‌ను 128 పరుగులకే ఆలౌట్‌ చేసిన భారత్‌.. కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ (78) ఒంటి చేత్తో విజయాన్నందించాడు.

  2014 వరల్డ్ కప్ :
  ఇరు జట్లు ఒకే గ్రూప్‌లో ఉండగా.. భారత బౌలర్లు సమష్టిగా రాణించి పాక్‌ను 131/7 స్కోరుకే పరిమితం చేశారు. ఆ తర్వాత బ్యాటర్లు సమయోచిత ఇన్నింగ్స్‌లతో టీమిండియా అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది.

  ఇది కూడా చదవండి : పొట్టి ప్రపంచకప్ లో సెంచరీలు చేసిన హీరోలు వీళ్లే..! రోహిత్, కోహ్లీ ఈ సారైనా కొట్టేనా...?

  2016 వరల్డ్ కప్ :
  భారత్ వేదికగా జరిగిన 2016 టీ20 ప్రపంచకప్‌లోనూ ఇరు దేశాలు ఒకే గ్రూప్‌లో ఉండటంతో మరోసారి తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ చేతిలో భారత్ 79 పరుగులకే ఆలౌటై చిత్తుగా ఓడటంతో పాక్ విజయం సులువనుకున్నారంతా. కానీ భారత్ దుమ్మురేపింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఔట్‌ఫీల్డ్‌ తడిగా ఉండటంతో మ్యాచ్‌ను 18 ఓవర్లకే కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ను 118/5 స్కోరుకే భారత్‌ కట్టడి చేసింది. ఆ తర్వాత టీమిండియా నాలుగు వికెట్లు నష్టపోయి 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఇక, ఈ ఏడాది టీ-20 వరల్డ్ కప్ లోనూ టీమిండియా అదే జోరు, సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. దాయాదిని చిత్తు చేయాలని భారత క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
  Published by:Sridhar Reddy
  First published: