Impact Player Rule : ఇంపాక్ట్ ప్లేయర్ (Impact Player) రూల్ ను అస్త్రంగా వాడుకున్న ఢిల్లీ (Delhi) జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ (Syed Mushtaq Ali Trophy) టి20 టోర్నమెంట్ లో విజయం సాధించింది. మణిపూర్ (Manipur)తో జరిగిన ఈ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ ను సద్వినియోగం చేసుకున్న ఢిల్లీ విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. హితెన్ దలాల్ 27 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉంది. అనంతరం మణిపూర్ ఛేదనలో 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 96 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఈ మ్యాచ్ లో కొత్తగా ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను ఢిల్లీ చక్కగా వాడుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్ అంటే తుది జట్టులో లేని ప్లేయర్ ను ఆట మధ్యలో బరిలోకి దింపడం.
మణిపూర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో దలాల్ స్థానంలో హృతిక్ షోకీన్ ను ఢిల్లీ ఇంపాక్ట్ ప్లేయర్ గా తుది జట్టులోకి తీసుకుంది. అతడు రెండు వికెట్లతో మణిపూర్ ను దెబ్బ తీశాడు. అంతేాకాకుండా తొలి ఇంపాక్ట్ ప్లేయర్ గా కూడా ఘనత వహించాడు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు 61 పరుగుల తేడాతో నెగ్గడం విశేషం.
ఇంతకీ ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అంటే ఏమిటి?
సింపుల్ గా చెప్పాలంటే సబ్ స్టిట్యూట్ ప్లేయర్ నే ఇంపాక్ట్ ప్లేయర్ గా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే ఫుట్ బాల్, రగ్బీ ఆటలను చూసే వారికి ఇంపాక్ట్ ప్లేయర్ ఎంటో ఇట్టే అర్థం అవుతుంది. ప్రస్తుతానికి టాస్ వేశాక ప్రకటించిన తుది జట్టు (11 మంది) ప్లేయర్లకు మాత్రమే బ్యాటింగ్, బౌలింగ్ చేసే వీలు ఉంది. మధ్యలో ఎవరైనా గాయపడితే వారి స్థానంలో సబ్ స్టిట్యూట్ గా వచ్చే ప్లేయర్ కేవలం ఫీల్డింగ్ వరకే పరిమితం అవుతాడు. అతడికి బౌలింగ్, బ్యాటింగ్ చేసే వెసులు బాటు ఉండదు. అయితే కంకషన్ సబ్ స్టిట్యూట్ కు మాత్రం బ్యాటింగ్, బౌలింగ్ చేసే వీలుంటుంది. తలకు గాయమైతే కంకషన్ సబ్ స్టిట్యూట్ కు వెసులుబాటు ఉంది. కానీ, ఇంపాక్ట్ ప్లేయర్ అలా ఉండదు. టాస్ సమయంలో ఇరు జట్లు 11 మందితో తమ తుది జట్లను ప్రకటించడంతో పాటు మరో నలుగురితో ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాను అంపైర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇరు జట్లు కూడా తమ ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితా నుంచి ఒక ప్లేయర్ ను తుది జట్టులోకి తీసుకునే వెసులు బాటు ఉంటుంది. అలా వచ్చిన ప్లేయర్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేసే వీలు ఉంటుంది.
ఇది కూడా చదవండి : ఇదేందిరా అయ్యా.! ప్రపంచకప్ కోసం సెలెక్ట్ చేసిన టీం ఒకటి.. పంపుతున్న టీం మరొకటి
రూల్స్ ఇవే
1.ఇరు జట్లు కూడా టాస్ సమయంలో తుది జట్టుతో పాటు మరో నలుగురితో ఇంపాక్ట్ ప్లేయర్ జాబితాను ఇవ్వాలి.
2.ఇరు జట్లు కూడా ఒక్క ప్లేయర్ ను మాత్రమే మార్చేందుకు వీలు ఉంటుంది.
3. అది కూడా ఇన్నింగ్స్ 14వ ఓవర్ లోపు మార్చాలి. ఇది రెండు ఇన్నింగ్స్ లకు వర్తిస్తుంది. 15 నుంచి 20 ఓవర్ల మధ్య ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ను తీసుకోవడం జరగదు.
4. ఇంపాక్ట్ ప్లేయర్ ను ఉపయోగించేటప్పుడు ఆ విషయాన్ని కెప్టెన్ ఫీల్డ్ అంపైర్ తో గానీ లేక ఫోర్త్ అంపైర్ తో గానీ చెప్పాల్సి ఉంటుంది.
5.ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల వెళ్లిపోయిన ప్లేయర్ మళ్లీ బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం ఉండదు.
6. ఇంపాక్ట్ ప్లేయర్ కు పూర్తి కోటా బౌలింగ్ చేసే అవకాశంతో పాటు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Delhi, Manipur, Mumbai Indians, Team India