SRH vs RR: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచిందోచ్.. రాజస్థాన్‌కు మరో ఓటమి

రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం (PC: IPL)

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

  • Share this:
    హమ్మయ్యా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) అభిమానులు చాన్నాళ్ల తర్వాత విజయోత్సాహాన్ని జరుపుకుంటున్నారు. ఓటములతో విసిగిపోయి ఉన్న హైదరాబాద్ ఫ్యాన్స్‌కు కేన్ మామ టీమ్ మంచి ట్రీట్ ఇచ్చింది. జట్టులో కీలక మార్పులు చేసి బరిలోకి దిగిన కేన్ సేన.. మొత్తానికి పరాజయాల పరంపరకు తెరదించింది. ఐపీఎల్ 2021లో (IPL 2021) భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో (Rajasthan Royals) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. జేసన్ రాయ్ (Jason Roy) (60), వృద్దిమాన్ సాహ (18) పరుగులు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించగా.. ఆ తర్వాత జేసన్ రాయ్, కేన్ విలియమ్‌సన్ (51) (Kane Williamson) కలిసి రెండో వికెట్‌కు మరో 57 పరుగులు జోడించారు.

    పటిష్ట స్థితిలో ఉన్న సమయంలో దూకుడు మీద ఉన్న జేసన్ రాయ్ అవుట్ కాగా. ఆ వెంటనే ప్రియమ్ గార్గ్ (0) డకౌట్ అయ్యాడు. గతంలో 14 పరుగులు కొట్టలేక ఏకంగా 7 వికెట్లు పోగొట్టుకున్న రికార్డు ఉన్న సన్‌రైజర్స్.. మళ్లీ అలా క్యూ కడతారేమో అని అభిమానులు భయపడ్డారు. కానీ కేన్ విలియమ్‌సన్, అభిషేక్ శర్మ (21) కలసి టార్గెట్‌ను 18.3 ఓవర్లలోనే ఫినిష్ చేశారు. ఈ మ్యాచ్‌లో ఎక్కడా తడబడకుండా సన్‌రైజర్స్ బ్యాటర్లు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడారు. జట్టులో కీలక మార్పులే తమకు విజయాన్ని తెచ్చిపెట్టాయని కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ వ్యాఖ్యానించాడు. ఇక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన జేసన్‌రాక్‌కు అరంగేట్రం మ్యాచ్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.









    సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చివరి సారిగా తొలి దశలో ఏప్రిల్ 24న పంజాబ్‌ కింగ్స్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అప్పటి నుంచి వరుసగా ఓటములు కొని తెచ్చుకున్న హైదరాబాద్ జట్టు ఎట్టకేలకు సోమవారం విజయాన్ని రుచి చూసింది. పాయింట్స్ టేబుల్ ప్రకారం చూస్తే అట్టడుగు స్థానంలో ఉన్నా.. ఇతర జట్ల జయాపజయాల ఆధారంగా సన్‌రైజర్స్‌కు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. మరోవైపు రాజస్థాన్ జట్టు ఈ ఓటమితో తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను క్లిష్టతరం చేసుకున్నది. మిగిలిన నాలుగు మ్యాచ్‌లు గెలవడమే కాకుండా నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకోవల్సి ఉన్నది.
    Published by:John Naveen Kora
    First published: