IPL 2021: సన్‌రైజర్స్ జట్టులో కరోనా కలకలం.. నటరాజన్‌కు కోవిడ్ పాజిటివ్.. ఐసోలేషన్‌లో ఆరుగురు జట్టు సభ్యులు

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కరోనా కలకలం (PC: IPL)

కోవిడ్ కారణంగా ఐపీఎల్ వేదికను ఇండియా నుంచి యూఏఈ తరలించినా ప్రమాదం తప్పలేదు. రెండో దశ ప్రారంభమై రెండు రోజులు గడవక ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కరోనా కలకలం సృష్టించింది. ఆ జట్టు పేసర్ నటరాజన్ కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యాడు.

  • Share this:
    కోవిడ్ (Covid) కారణంగా అర్దాంతరంగా రద్దైన ఐపీఎల్ 2021ని (IPL 2021) యూఏఈ వేదికగా తిరిగి ప్రారంభించారు. రెండో దశ ప్రారంభమై రెండు రోజులు గడవక ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టులో కోవిడ్ కలకలం రేగింది. బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) తో  మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. కొన్ని గంటల ముందు కోవిడ్ కేసు బయటపడటం ఆందోళనకు గురి చేస్తున్నది. ఎస్ఆర్‌హెచ్ ఫాస్ట్ బౌలర్ టి. నటరాజన్ కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు ఫ్రాంచైజీతో పాటు ఐపీఎల్ యాజమాన్యం ప్రకటించింది. నటరాజన్‌లో ప్రస్తుతం కోవిడ్ లక్షణాలు ఏవీ లేవని.. అతడిని జట్టు నుంచి వేరు చేసి ఐసోలేషన్ చేసినట్లు ఫ్రాంచైజీ పేర్కొన్నది. ఇక ఐపీఎల్ మెడికల్ టీమ్ నటరాజన్‌తో క్లోజ్ కాంటాక్ట్ అయిన ఆరుగురుని గుర్తించింది. జట్టు సభ్యుడు విజయ్ శంకర్, టీమ్ మేనేజర్ విజయ్ కుమార్, ఫిజియోథెరపిస్ట్ శ్యామ్ సుందర్, టీమ్ డాక్టర్ అంజనా వన్నన్, లాజిస్టిక్ మేనేజర్ తుషార్ ఖేడ్కర్, నెట్ బౌలర్ పెరియసామి గణేషన్‌లను ఐసోలేట్ చేసినట్లు పేర్కొన్నారు.

    ఫ్రాంచైజీలోని ఇతర సభ్యులతో పాటు క్లోజ్ కాంటాక్ట్ అయిన వారిని బుధవారం ఉదయం ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించారు. అయితే వారందరి రిజల్ట్ నెగెటివ్ గానే తేలింది. దీంతో ఆరుగురుని మాత్రం ఐసోలేషన్‌లో ఉంచారు. ఈ రోజు సాయంత్రం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడాల్సి ఉన్నది. ఆ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఐపీఎల్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

    Kartik Tyagi: ‘రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడుతున్న నీరజ్ చోప్రా’.. కార్తిక్ త్యాగిని ఒలింపిక్ వీరుడు నీరజ్‌తో పోలుస్తున్న ఫ్యాన్స్


     ఐపీఎల్ మొదటి దశలో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన వృద్దిమాన్ సాహ కరోనా పాజిటివ్‌గా తేలాడు. తొలుత కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో కరోనా కలకలం రేగింది. ఆ తర్వాత సన్‌రైజర్స్ జట్టు సభ్యుడికి కరోనా వచ్చిన తర్వాతే ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ రెండో దశకు బీసీసీఐ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. కఠినమైన కోవిడ్ ఆంక్షలతో బయోబబుల్ ఏర్పాటు చేసింది. గత కొన్ని రోజులుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దుబాయ్‌లోనే ప్రాక్టీస్ చేస్తున్నది. జట్టు సభ్యులు కలసి ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు కూడా ఆడారు. తీరా ఢిల్లీ మ్యాచ్‌కు ముందు కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం ఇతర క్రికెటర్లను కూడా ఆందోళనకు గురి చేస్తున్నది.








    సన్‌రైజర్స్ జట్టులో నటరాజన్ కీలకమైన బౌలర్. గత సీజన్‌లో కూడా హైదాబాద్ జట్టు ప్లేఆఫ్స్ చేరడంలో నటరాజన్ పాత్ర కూడా ఉన్నది. అలాగే నటరాజన్‌తో క్లోజ్ కాంటాక్ట్ అయిన విజయ్ శంకర్ ఆల్‌రౌండర్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరూ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌కు దూరం కావడం పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు.
    Published by:John Naveen Kora
    First published: