ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్ ప్లేయర్ రిటెన్షన్ (Player Retention) గడువు దగ్గర పడుతున్న కొద్దీ అన్ని ఫ్రాంచైజీల్లో ఆందోళన నెలకొన్నది. ఏయే ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలని నిర్ణయించుకోవడం ఒక ఎత్తైతే.. రిటైన్ చేసుకున్న ఆటగాళ్లతో ఒప్పందాలు కుదుర్చుకోవడం మరో ఎత్తు. పాపులర్ ఆటగాళ్లు భారీ ధర కావాలని డిమాండ్ చేయడం లేదా జట్టుతో కొనసాగడానికి సానుకూలత వ్యక్తం చేయకపోవడం ఫ్రాంచైజీలకు తలనొప్పిగా మారింది. ఐపీఎల్ 2021 (IPL 2021) సీజలో అత్యంత పేలవ ప్రదర్శన చేసి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఇప్పుడు ఎవరిని రిటైన్ చేసుకోవాలో తేల్చుకోలేక పోతున్నది. కెప్టెన్ కేన్ విలియమ్‌సన్‌ను (Kane Williamson) రిటైన్ చేసుకోవడం ఖాయం అయ్యింది. ఇప్పటికే కేన్‌తో చర్చలు సానుకూలంగా ముగిశాయి. కానీ అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rasheed Khan) విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా అనేక లీగ్‌లలో కీలక ప్లేయర్ గా మారిన రషీద్ ఖాన్.. గత కొన్ని సీజన్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున కీలక ఆటగాడిగా మారిపోయాడు. అతడికి చెల్లించిన ధరకు న్యాయం చేసేలా రషీద్ ప్రదర్శన కూడా ఉంటుంది. దీంతో ఈ అఫ్గానిస్తాన్ మిస్టరీ స్పిన్నర్‌ను రిటైన్ చేసుకోవాలని సన్‌రైజర్స్ నిర్ణయించింది. ఈ మేరకు రషీద్‌ను యాజమాన్యం సంప్రదించినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం రూ. 9 కోట్ల జీతం ఇస్తుండగా.. రిటైన్ చేసుకొని రూ. 12 కోట్లు చెల్లిస్తామని ఆఫర్ ఇచ్చింది. అయితే ఈ విషయంలో రషీద్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది.
తనకు రూ. 12 కోట్లు సరిపోవని రషీద్ ఖాన్ తేల్చి చెప్పినట్లు సమాచారం. లేకపోతే తనను విడుదల చేయాలని.. వేలంలో ఇంకా భారీ ధర పలుకుతానని అతడు తేల్చి చెప్పాడట. వాస్తవానికి నలుగురిని రిటైన్ చేసుకుంటే మొదటి ఆటగాడికి రూ. 16 కోట్లు.. ఆ తర్వాత ఆటగాడికి రూ. 12 కోట్లు చెల్లించాలి. అయితే కేన్ విలియమ్‌సన్‌ను మొదటి ఆటగాడిగా రూ. 16 కోట్లు చెల్లించిన తర్వాత రషీద్‌కు రూ. 12 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అయితే రషీద్ మాత్రం తనను మొదటి ఆటగాడిగా తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తున్నది. రెండో రిటెన్షన్‌గా అయితే జట్టులో ఉండనని స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదే విషయంపై ఫ్రాంచైజీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
మరోవైపు అన్ క్యాప్డ్ ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకునే విషయంపై కూడా ఫ్రాంచైజీలో సందిగ్దత నెలకొన్నది. గత సీజన్‌లో అనుకోకుండా జట్టులోకి వచ్చిన ఉమ్రాన్.. నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి అందరినీ ఆకర్షించాడు. అయితే సదరు క్రికెటర్‌ను రూ. 8 కోట్లు పెట్టి తీసుకోవడం అవసరమా అని కూడా సన్‌రైజర్స్ భావిస్తున్నది. అతడిని పూల్‌లోకి తిరిగి కొనుగోలు చేయడం మంచిదని కూడా అనుకుంటున్నది. ఒక వేళ సన్‌రైజర్స్ ఇద్దరినే తీసుకుంటే కేన్, రషీద్ జీతభత్యాల్లో కూడా తేడా వస్తుంది. ఏదేమైనా మరో మూడు రోజుల్లో ఈ ఉత్కంఠతకు తెరపడనున్నది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, IPL 2022, Kane Williamson, Rashid Khan, Sunrisers Hyderabad