• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • SUNRISER HYDERABAD ANOTHER DEFEAT RAJASTHAN ROYAL WON BY HUGE MARGIN JNK

IPL 2021 : రాత మారని సన్‌రైజర్స్.. భారీ టార్గెట్ ఛేదించడంలో విఫలం.. రాజస్థాన్ ఘనవిజయం..

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం

  • Share this:
    ఐపీఎల్ 2021లో (IPL 2021) భాగంగా నేటి మధ్యాహ్నం ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో రాజస్థాన్ రాయల్స్‌తో (Rajasthan Royals) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఘోర ఓటమి పాలయ్యింది. రాజస్థాన్ నిర్దేశించిన 221 పరుగుల టార్గెట్‌ను ఛేదించడానికి బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో, మనీష్ పాండే మంచి ఆరంభమే అందిచారు. వీరిద్దరూ కలసి తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించారు. అయితే దూకుడు మీద ఉన్న మనీష్ పాండే (31, 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు) ముస్తఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే జానీ బెయిర్ స్టో (30, 21 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్) రాహుల్ తెవాతియా బౌలింగ్‌లో అనుజ్ రావత్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత ఎవరూ సరైన భాగస్వామ్యాన్ని అందించలేదు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ (20) మొదటి నుంచి ఒత్తిడిలో కనపడ్డాడు. పరుగులు రాబట్టడానికి తీవ్రంగా శ్రమించాడు. కానీ అతడికి సరైన తోడు లభించలేదు.

    విజయ్ శంకర్ (8) మరోసారి విఫలమయ్యాడు. కేన్ కూడా ఆ తర్వాత కార్తీక త్యాగీ బౌలింగ్‌లో క్రిస్ మోరిస్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మహ్మద్ నబీ (17) రెండు సిక్సులు, ఒక బౌండరీతో ధాటిగా మొదలు పెట్టినా.. ముస్తఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో అనుజ్ రావత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అబ్దుల్ సమద్ (10), కేదార్ జాదవ్ (19), రషీద్ ఖాన్ (0) అందరూ తక్కువ స్కోర్లకే పెవీలియన్ చేరారు. చివర్లో భువీ (14) ఆడినా టార్గెట్ భారీగా ఉండటంతో ఎవరూ ఏమీ చేయలేకపోయారు. దీంతో నిర్థీత 20 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులకే పరిమితం అయ్యింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముస్తఫిజుర్ 3 , క్రిస్ మోరిస్ 3 వికెట్లు తీయగా కార్తీక్ త్యాగి, రాహుల్ తెవాతియాకు చెరో వికెట్ లభించింది. జాస్ బట్లర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

    'అంతకు ముందు రాజస్థాన్ రాయల్స్ టాస్ ఓడి 220 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జాస్ బట్లర్ చెలరేగి 126 పరుగులు చేయగా.. సంజూ శాంసన్ 48 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ కలసి 2వ వికెట్‌కు 150 పరుగుల భాగస్వామ్యం అందించడంతో రాజస్థాన్ సునాయాసంగా 200 పరుగులు దాటేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల వైఫల్యంతో పాటు ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించేకోవల్సి వచ్చింది. ఈ ఓటమితో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఇకపై ప్రతీ మ్యాచ్ గెల్చినా మెరుగైన రన్ రేట్ ఉంటేనే టాప్ 4కి వెళ్లే అవకాశం ఉంటుంది.
    Published by:John Naveen Kora
    First published: