హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2021 Rules: అక్కడ మ్యాచ్‌లు చూడాలంటే కఠిన నిబంధనలు... ప్రతీ స్టేడియానికి ప్రత్యేక కండిషన్లు

IPL 2021 Rules: అక్కడ మ్యాచ్‌లు చూడాలంటే కఠిన నిబంధనలు... ప్రతీ స్టేడియానికి ప్రత్యేక కండిషన్లు

IPL 2021

IPL 2021

IPL 2021: ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచ్‌లు యూఏఈ వేదికగా జరుగుతున్నాయి. ఈ సారి స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కానీ మ్యాచ్ చూడటానికి వచ్చే ప్రేక్షకులకు కఠినమైన ఆంక్షలు విధించింది.

ఐపీఎల్ 2021 (IPL 2021) రెండో దశ యూఏఈలో (UAE) మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానున్నది. గత ఏడాది మాదిరిగానే దుబాయ్, షార్జా, అబుదాబిలోని స్టేడియంలలో మిగిలిన 31 మ్యాచ్‌లు జరుగనున్నాయి. గత సీజన్‌తో పాటు ఇండియాలో జరిగిన తొలి దశ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించలేదు. కోవిడ్ కారణంగానే ఖాళీ స్టేడియంలలో ఐపీఎల్ నిర్వహించారు. అయితే రెండో దశ మ్యాచ్‌లకు మాత్రం ప్రేక్షకులను అనుమతించాలని బీసీసీఐ (BCCI) నిర్ణయించింది. అయితే యూఏఈ ప్రభుత్వం అనేకమైన కఠిన ఆంక్షలను విధించింది. ఆ నిబంధనలు పాటిస్తేనే ప్రేక్షకులను అనుమతించాలని స్పష్టం చేసింది. ప్రతీ వేదికకు ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తున్నట్లు స్థానిక ప్రభుత్వాలు తెలిపాయి. ప్రతీ స్టేడియంలో 50 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించనున్నారు. ప్రేక్షకులు తప్పకుండా భౌతిక దూరం పాటించాలని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. అయితే 48 గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవడం తప్పనిసరి కాదని తెలిపింది.

మ్యాచ్ టికెట్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా డౌన్ లోడ్ చేసిన టికెట్లను స్టేడియం వెలుపల స్కాన్ చేసి లోపలకు వెళ్లాలి. అబుదాబి స్టేడియంలోకి ఎంట్రీ కోసం తప్పనిసరిగా రెండో డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు దృవీకరణ పత్రాన్ని చూపించాలి. 12 నుంచి 15 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ లేకపోయినా అనుమతి ఇస్తారు. అయితే షార్జా స్డేడియంలోకి మాత్రం పిల్లలను అనుమతించబోమని ప్రకటించారు. అక్కడ కేవలం 16 ఏళ్లు పైబడిన వారిని మాత్రమే అనుమతించనున్నారు. అంతే కాకుండా ఈ స్టేడియంలోకి ఎంట్రీ కోసం ఆర్టీపీసీఆర్ రిపోర్టు చూపించాలి. మొబైల్‌లో అల్ హొస్న్ అనే యాప్ డౌన్ లోడ్ చేసుకొని ఉండాలి. స్టేడియంలోని కుర్చీల్లో వరుసగా కూర్చోవద్దని నిర్వాహకులు తెలిపారు. మధ్యలో ఒక కుర్చీ ఖాళీ వదలాల్సి ఉంటుంది.


ప్రేక్షకులందరూ తప్పకుండా మాస్కులు ధరించాలని నిర్వాహకులు తెలిపారు. స్టేడియం వెలుపల తప్పనిసరిగా టెంపరేచర్ టెస్టు చేయనున్నారు. సాధారణం కంటే ఎక్కువ శరీర ఉష్ణోగ్రత ఉంటే వారిని లోపలకు అనుమతించరు. మ్యాచ్ మధ్యలో స్టేడియంలో నుంచి బయటకు వస్తే తిరిగి లోపలకు వెళ్లడానికి వీలుండదు. ఆటగాళ్ల దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఈసీబీ, బీసీసీఐ తెలిపింది. తొలి దశలో ఆటగాళ్లకు కరోనా సోకడం వల్లే ఇలాంటి కఠిన నిబంధనలు అనుమతిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.

First published:

Tags: Bcci, IPL 2021

ఉత్తమ కథలు