శ్రీలంక (Sri Lanka Crisis)లో ఆర్థిక, రాజకీయ సంక్షోభం ముదిరింది. లంకలో నెలకొన్న ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభం ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. శ్రీలంక ఆర్థిక సంక్షోభం రోజుల తరబడి కొనసాగుతూనే వస్తోంది. కాలం గడుస్తున్నా దీనికి పుల్‌స్టాప్ పడట్లేదు. నిత్యావసర సరుకుల ధరల ఆకాశాన్ని అంటాయి. అసాధారణ ధరకు చేరుకున్నాయి. ప్రత్యేకించి ఇంధన కొరత (Fuel Crisis) వెంటాడుతోంది. పెట్రోల్, డీజిల్ దొరకట్లేదు. దీనికోసం గంటల కొద్దీ పెట్రోల్ (Petrol) బంక్‌ల వద్ద లంకేయులు బారులు తీరి నిల్చోవాల్సి వస్తోంది. ఇంధన అమ్మకాలను ఆయిల్ కంపెనీలు క్రమబద్దీకరించాయి. కారు, బైక్‌లకు పరిమితిని విధించాయి. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ బాధితులుగానే మిగిలిపోతున్నారు.
ఆ ప్రభావం సామాన్యుల మీదే కాదు.. ఇప్పుడు పరోక్షంగా లంక క్రికెటర్ల (Sri Lankan Cricketers)పై కూడా పడుతోంది. ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ దొరకక.. ఎందరో ఆటగాళ్లు ప్రాక్టీస్ కు దూరంగా ఉంటున్నారు. గ్రౌండ్ వరకు వెళ్లాలంటే ట్రాన్స్‌పోర్టేషన్ లేక అనేక తంటాలు పడుతున్నారు. అలాంటి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు శ్రీలంక ఆటగాడు.. కేకేఆర్ జట్టు సభ్యుడు చమిక కారుణరత్నే. రెండు రోజుల పాటు క్యూలో నిల్చోని పెట్రోల్ సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దొరికిన పది వేల రూపాయల పెట్రోల్ తో రెండు మూడు రోజుల వరకు మాత్రమే ప్రాక్టీస్ వెళ్లగలనని తెలిపాడు.
తాజాగా క్రికెటర్ చమిక కరుణరత్నె ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించిన అంశాలు అక్కడి దుస్థితికి అద్దం పట్టాయి. ఇంటర్నేషనల్ సిరీస్, ఆసియాకప్, లంక ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లల్లో పాల్గొనడానికి అవసరమైన ప్రాక్టీస్ సెషన్స్ కోసం కొలంబోలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, పెట్రోల్ సంక్షోభ పరిస్థితుల్లో ప్రయాణం సాగించడం కష్టతరమౌతోందని చెప్పాడు. ఇంధన సంక్షోభాన్ని నివారించడానికి భారత్ సహకరించిందని చమిక కరుణరత్నె పేర్కొన్నాడు. ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషించిందని, అందుకు కృతజ్ఞతలు తెలిపాడు.
#WATCH | Sri Lankan cricketer Chamika Karunaratne speaks to ANI; says, "We've to go for practices in Colombo&to different other places as club cricket season is on but I've been standing in queue for fuel for past 2 days. I got it filled for Rs 10,000 which will last 2-3 days..." pic.twitter.com/MkLyPQSNbZ
— ANI (@ANI) July 16, 2022
ఆసియా కప్ 2022కు శ్రీలంకనే ఆతిధ్యం ఇవ్వనుంది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను లంక క్రికెటర్లను కలవరపెడుతోంది. ఆసియా కప్ లో రాణించాలంటే కనీస ప్రాక్టీస్ ఎంతో అవసరం. అయితే లంక క్రికెటర్లు చాలా మంది కూడా పెట్రోల్, డీజిల్ కొరతతో గ్రౌండ్ లకు వెళ్లి ప్రాక్టీస్ కూడా చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆసియా కప్ వేదికను ఐసీసీ మారుస్తుందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.
ఎందుకంటే మ్యాచ్ లు జరిగే సమయంలో ఆటగాళ్లను మైదానాలకు తీసుకెళ్లడం.. హోటల్ కు తీసుకురావడం కోసం ఎంతగానో చమురు అవసరం పడుతుంది. అటు గొటబాయ రాజపక్స రాజీనామాపై కూడా కరుణరత్నే స్పందించాడు. గొటబాయ రాజీనామా తర్వాతైనా మంచి వ్యక్తులు వస్తారని ఆశిస్తున్నట్టు చెప్పాడు. శ్రీలంక ప్రజలకు కచ్చితంగా మంచి జరుగుతుందన్నాడు.
శ్రీలంకలో సంక్షోభం జరుగుతున్నప్పటికీ ఆస్ట్రేలియా జట్టు మాత్రం తన పర్యటనను కొనసాగించింది. ఇప్పుడు దాయాది పాకిస్థాన్ కూడా లంకలో పర్యటిస్తోంది. ఇక కరుణరత్నే 2019లో అంతర్జాతీయ క్రికెట్ లో కి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు ఒక టెస్టు మ్యాచ్ తో పాటు 18 వన్డే, 25 టీట్వంటీ మ్యాచ్ లు ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్ జట్టును ఎంపికయ్యాడు. ఈ సీజన్‌లో అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Sri Lanka, Sri Lanka Crisis