మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం రాత్రి వెస్టిండీస్, శ్రీలంక జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో విండీస్ 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే, ఈ మ్యాచ్ శ్రీలంక ఓపెనర్ దనుష్క గుణతిలక ఔట్ ఇప్పుడు వివాదస్పదంగా మారింది. హాఫ్ సెంచరీ చేసి ఊపు మీదున్న గుణతిలకను వివాదస్పద రీతిలో అంపైర్లు ఔట్ ఇచ్చారు. మూడో అంపైర్ నిర్ణయం కూడా అందర్నీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకెళితే.. విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ వేసిన 21 ఓవర్ మొదటి బంతిని గుణతిలక డిఫెన్స్ చేశాడు. ఆ బంతి అతడి కాళ్ల వద్దే ఆగిపోవడంతో సింగిల్ తీద్దామని ముందుకెళ్లాడు. దాంతో బౌలింగ్ చేస్తున్న పొలార్డ్ వెంటనే స్పందించి రనౌట్ చేయడానికి దూసుకొచ్చాడు.పొలార్డ్ బంతిని అందుకోవడం గమనించిన గుణతిలక మరో ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ నిసంకను పరుగు కోసం రావొద్దని చెప్పాడు. ఈ సమయంలో గుణతిలక క్రీజులోకి వెళుతూ అనుకోకుండా బంతిని కాలితో తన్నాడు. అప్పటికే పొలార్డ్ రనౌట్ చేయడానికి బంతి దగ్గరికి రాగా.. గుణతిలక క్రీజులోకి వెళ్లిపోయాడు. దాంతో గుణతిలక తమ ఫీల్డింగ్‌కు అడ్డుగా వచ్చాడని విండీస్ కెప్టెన్ అంపైర్‌కు అప్పీల్ చేశాడు. దీంతో ఆన్‌ఫీల్డ్ అంపైర్ జో విల్సన్ సాఫ్ట్ సిగ్నల్‌గా ఔట్ అని ప్రకటించి మూడో అంపైర్ నిగెల్ గుగైడ్ని అడిగాడు. వీడియోను వివిధ కోణాల్లో పరిశీలించిన మూడో అంపైర్.. గుణతిలకను ఔట్‌గా ప్రకటించాడు.
ఇప్పుడు ఈ ఔట్‌పై సోషల్ మీడియాలో నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. ట్విటర్ వేదికగా గుణతిలక ఔటైన వీడియోను పంచుకొని తన సందేహాన్ని వ్యక్తం చేశాడు. అదెలా ఔట్ అంటూ ఐసీసీని ప్రశ్నించాడు. అయితే ఆ వీడియోలో గుణతిలక కావాలని అడ్డువచ్చినట్లు లేదనే విషయం స్పష్టంగా కనిపించింది. దాంతో నెటిజెన్లు ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని అంపైర్ల తీరుపై మండిపడుతున్నారు.
Out or not?#WIvSLpic.twitter.com/zsFkfr5n69
— ESPNcricinfo (@ESPNcricinfo) March 11, 2021
How this is out ??? @ICC ? https://t.co/FUXB36r3RS
— Harbhajan Turbanator (@harbhajan_singh) March 11, 2021
ఈ క్రమంలోనే హర్భజన్ సింగ్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఐసీసీకి ఓ ట్వీట్ చేశాడు. ఓ క్రీడా ఛానెల్ పంచుకున్న వీడియోకు ఐసీసీని ట్యాగ్చేసి 'అలా ఎలా ఔట్ ఇస్తారు?' అని ప్రశ్నించాడు. హర్భజన్ మాత్రమే కాదు టామ్ మూడీ, మైఖేల్ వాన్, రస్సెల్ ఆర్నాల్డ్ కూడా ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టుకు ఓపెనర్లు ఎవిన్ లూయిస్ (65; 90 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), షై హోప్ (110; 133 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో విండీస్ 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Harbhajan singh, Viral Video, West Indies