SRH vs RR Live Scores : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023)లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో పరుగుల వరద పారుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)తో జరుగుతోన్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ సామ్సన్ (32 బంతుల్లో 55; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), జాస్ బట్లర్ (22 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (37 బంతుల్లో 54; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలతో మెరిశారు. సన్ రైజర్స్ బౌలర్లలో నటరాజన్, ఫరూఖీలు చెరో రెండు వికెట్లు సాధించారు. ఉమ్రాన్ మాలిక్ ఖాతాలో ఒక వికెట్ చేరింది.
టాస్ నెగ్గిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన రాజస్తాన్ జట్టుకు బట్లర్, జైస్వాల్ ధనాధన్ శుభారంభం చేశారు. ముఖ్యంగా బట్లర్ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో ఉన్న జైస్వాల్ కూడా బట్లర్ తో పోటీ పడి మరీ పరుగులు సాధించారు. దాంతో పవర్ ప్లేలోనే రాజస్తాన్ రాయల్స్ ఏకంగా 85 పరుగులు సాధించింది. అయితే 6వ ఓవర్లో ఫరూఖీ సూపర్ బాల్ తో బట్లర్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ సంజూ సామ్సన్ కూడా రెచ్చిపోయి ఆడాడు. దాంతో రాజస్తాన్ 10 ఓవర్లలో ఒక వికెట్ కు 122 పరుగులకు చేరుకుంది. ఈ దశలో రాజస్తాన్ 250కు పైగా పరుగులు చేస్తుందేమో అనిపించింది.
సూపర్ కమ్ బ్యాక్
అయితే చివర్లో సన్ రైజర్స్ బౌలర్లు సూపర్ కమ్ బ్యాక్ చేశారు. చివర్లో నటరాజన్, ఆదిల్ రషీద్, ఫరూఖీలు మంచి బౌలింగ్ ప్రదర్శన చేశారు. ముఖ్యంగా నటరాజన్ సూపర్ అనిపించుకున్నాడు. తొలి ఓవర్లో 17 పరుగులు సమర్పించుకున్న నటరాజన్.. తన చివరి 2 ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు. కీలక సమయంలో అభిషేక్ శర్మ పట్టిన సూపర్ క్యాచ్ కు సంజూ సామ్సన్ వెనుదిరిగాడు. తొలి 10 ఓవర్లలో 122 పరుగులు సమర్పించుకున్న సన్ రైజర్స్.. చివరి 10 ఓవర్లలో కేవలం 81 పరుగులు మాత్రమే ఇచ్చుకుంది.
తుది జట్లు
రాజస్తాన్ రాయల్స్
సంజూ సామ్సన్ (కెప్టెన్), బట్లర్, యశస్వి జైస్వాల్, పడిక్కల్, హెట్ మైర్, పరాగ్, హోల్డర్, అశ్విన్, బౌల్ట్, చహల్, ఆసిఫ్
ఇంపాక్ట్ ప్లేయర్స్ : జురైల్, సందీప్, మురుగన్ అశ్విన్, సైని, డోవోన్ ఫెరీరా
సన్ రైజర్స్ హైదరాబాద్
భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, హ్యారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, ఆదిల్ రషీద్, ఉమ్రాన్ మాలిక్, ఫరూఖి, నటరాజన్
ఇంపాక్ట్ ప్లేయర్స్ : సమద్, వివ్రాంత్, దగర్, ఉపేంద్ర
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL, IPL 2023, Rajasthan Royals, Sanju Samson, Sunrisers Hyderabad