ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న డేవిడ్ వార్నర్.. ఆ జట్టుకు ప్రధాన బలమనే చెప్పాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టును నడిపించగలిగే సత్తా వార్నర్ సొంతం. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు వార్నర్ దూరం కానున్నడానే వార్తలు వినిపిస్తున్నాయి. భారత్‌తో జరిగిన రెండో వన్డేలో వార్నర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ఆసీస్ జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో.. ధావన్ కొట్టిన షాట్‌ను ఆపబోయిన వార్నర్ కిందపడి పోయాడు. తొడకండరాలు పట్టేసి నడవలేని స్థితికి చేరాడు. నొప్పి ఎక్కువగా ఉండటంతో మైదానాన్ని వీడాడు. ఈ క్రమంలో ఆ తర్వాత జరిగిన టీ20 సిరీస్‌కు వార్నర్ దూరమయ్యాడు. అయితే భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు వార్నర్ అందుబాటులోకి వచ్చాడు. అయితే గాయం మళ్లీ తిరగబెట్టడంతో వైద్యుల సూచన మేరకు రెస్ట్ తీసుకుంటున్నాడు. దీంతో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్‌ను ఎంపిక చేయలేదు.
అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్-14 సీజన్లో వార్నర్ ఆడతాడా లేదా ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న వార్నర్‌ను ఐపీఎల్లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతించకపోవచ్చనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే వార్నర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయి. "వచ్చే వారం నుంచి త్రో వేయడం ప్రారంభిస్తాను. గత కొన్ని వారాల నుంచి త్రో వేయడానికి ప్రయత్నించినా అది చాలా కష్టంగా మారింది. . ప్రస్తుతం వికెట్ల మధ్య పరిగెత్తడమే ప్రధాన సమస్య. కోలుకోవడానికి మరో ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పట్టే అవకాశం ఉంది. వైద్యుల సాయంతో ఈ గాయం నుంచి త్వరగా కోలుకోంటానని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నారు.
అయితే ఇప్పుడు పరిస్థితుల్లో కోలుకోవడానికి మరో 6 నుంచి 9 నెలల సమయం పడుతుందని వార్నర్ చెప్పడంతో.. ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరం కానున్నాడనే ప్రచారం జోరందుకుంది. ఒకవేళ వార్నర్ ఐపీఎల్‌కు దూరమైతే సన్‌రైజర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలనట్టవుతుంది.