ఐపీఎల్ 2021లో ముంబై కథ ముగిసింది. ఇప్పటికే ఈసారి టోర్నీ ఫ్లే ఆఫ్‌లో నిలిచే ఆశలను దాదాపుగా వదులుకున్న ముంబై ఇండియన్స్.. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్ టీమ్‌పై రాణించి ఏమైనా అద్భుతం చేస్తుందేమో అని ఫ్యాన్స్ ఎదురుచూశారు. కానీ SRH టీమ్ ముంబైకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ప్లే ఆఫ్ చేరాలంటే.. SRH టీమ్‌ను 65 పరుగులకే కట్టడి చేయాల్సి ఉండగా.. హైదరాబాద్ మాత్రం ముంబైకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. 236 పరుగుల లక్ష్య చేధన కోసం బరిలోకి దిగిన హైదరాబాద్ టీమ్ ఓపెనర్లు రాయ్, అభిషేక్ అద్భుతంగా రాణించారు. దీంతో 5.2 ఓవర్లలోనే ఎస్ఆర్‌హెచ్ 65 పరుగులు చేసింది. ముంబై ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో 5 సార్లు ఐపీఎల్ టైటిల్ సాధించిన ముంబై ఇండియన్స్.. ఈసారి టైటిల్ వేటలో ప్లే ఆఫ్ చేరకముందే వెనుదిరగాల్సి వచ్చింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ జట్టు హైదరాబాద్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 18 పరుగులకే ఔటైనా.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 84(11 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో రాణించాడు. హార్థిక్ పాండ్యా (10), పొలార్డ్ (13) వంటి వాళ్లు తొందరగా ఔటైనా.. సూర్యకుమార్ యాదవ్ తన సత్తా చాటాడు కేవలం 40 బంతుల్లో 13 ఫోర్లు, మూడు సిక్సర్లతో 82 పరుగులు సాధించి ముంబై 235 పరుగులు సాధించడంతో కీలక పాత్ర పోషించాడు. ఇషాన్ కిషన్ ఔటైన తరువాత ముంబై బ్యాటింగ్ భారాన్ని మోశాడు.
అయితే ఆ తరువాత భారీ లక్ష్యచేధనతో బరిలోకి దిగిన హైదరాబాద్ బ్యాట్స్‌మెన్.. ఆదిలోనే ముంబై ప్లే ఆఫ్ కలలు కల్లలు చేశారు. ఓపెనర్లు బాగా రాణించారు. అయితే ఓపెనర్లు రాయ్, అభిషేక్ ఔటైన తరువా మిగతా బ్యాట్స్‌మెన్ క్రీజ్‌లో కుదురుకోవడానికి ఇబ్బందిపడ్డారు. మహ్మద్ నబీ, అబ్దుల్ సమాద్ వెంట వెంటనే ఔటయ్యారు. ప్రియమ్ గార్గ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కబెట్టే బాధ్యతను తీసుకున్న మనీష్ పాండే.. ముంబైను ఓడించే స్థాయికి హైదరాబాద్ టీమ్‌ను తీసుకెళతాడా ? అన్నది మరికాసేపట్లో తేలిపోనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL 2021, Mumbai Indians, SRH