news18-telugu
Updated: August 20, 2019, 6:35 PM IST
శ్రీశాంత్ (Image: cricket next)
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న క్రికెటర్ శ్రీశాంత్ ఎట్టకేలకు ఊరట కలిగింది. అతడిపై విధించిన జీవితకాల నిషేధాన్ని 7 సంవత్సరాలకు తగ్గిస్తూ బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటికే 6 సంవత్సరాలుగా నిషేధం ఎదుర్కొన్న శ్రీశాంత్, మరో సంవత్సరం మాత్రమే నిషేధం మిగిలి ఉంది. 2020 సెప్టెంబర్ నుంచి శ్రీశాంత్ మరోసారి మైదానంలో దిగే అవకాశం ఉంది. జీవిత కాల నిషేధాన్ని సవాలు చేస్తూ సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్న శ్రీశాంత్‌కు ఇది భారీ ఊరట అనే చెప్పవచ్చు. గడిచిన 6 సంవత్సరాల్లో శ్రీశాంత్ నడవడికలో మార్పు వచ్చిందని అందుకే నిషేధంపై పునరాలోచన చేసినట్లు బీసీసీఐ ప్రతినిధులు తెలిపారు. ఇదిలా ఉంటే 2013లో ఐపీఎల్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్ జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొవాల్సి వచ్చింది. శ్రీశాంత్‌తో పాటు అజిత్ చండీలా, అంకిత్ చవాన్ సైతం లైఫ్ బ్యాన్ ఎదుర్కొన్నారు.
కాగా తనపై విధించిన బ్యాన్ పై శ్రీశాంత్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు ఈ సంవత్సరం మార్చి నెలలో జీవితకాల నిశేధం ఎత్తివేయాలని ఆదేశించింది. దీంతో సమావేశమైన బీసీసీఐ అంబుడ్స్‌మన్ శ్రీశాంత్ నిషేధం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం శ్రీశాంత్‌కి 36 ఏళ్లు. కేరళ తరఫున, విదేశీ లీగుల్లో ఆడాలని శ్రీశాంత్ కోరుకుంటున్నాడు.
Published by:
Krishna Adithya
First published:
August 20, 2019, 6:35 PM IST