BCCI : రేపు బీసీసీఐ ప్రత్యేక సమావేశం.. అజెండాలో చర్చించనున్న ప్రధాన అంశాలు ఇవే.. ఐసీసీ ఓకే చెప్తుందా?

బీసీసీఐ కీలక సమావేశంలో చర్చించనున్న ముఖ్యాంశాలు ఇవే (PC: BCCI)

బీసీసీఐ ప్రత్యేక జనరల్ మీటింగ్ 29న వర్చువల్ పద్దతిలో జరుగనున్నది. ఐపీఎల్ 2021 నిర్వహణ, టీ20 వరల్డ్ కప్ వేదిక వంటి కీలక అంశాలను ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి.

 • Share this:
  కరోనా మహమ్మారి (COrona) కారణంగా ఐపీఎల్ 2021 (IPL 2021) అర్దాంతరంగా వాయిదా పడటం, ఇండియాలో టీ20 వరల్డ్ కప్ (T20 WC) నిర్వహణపై సందిగ్దత నెలకొన్న నేపథ్యంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) (BCCI) మే 29న స్పెషల్ జనరల్ మీటింగ్ (ఎస్జీఎం)(SGM)ను నిర్వహించనున్నది. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ల ప్రతినిధులు ఈ సమావేశంలో వర్చువల్ పద్దతిలో పాల్గొననున్నారు. ఈ సమావేశం అజెండాలో ముఖ్యమైనది ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించిన విషయమే. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్యలో డేట్లను ఫిక్స్ చేయనున్నారు. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీల యాజమాన్యాల అభిప్రాయాలను కూడా బీసీసీఐ సేకరించింది. వేదికలు, షెడ్యూల్‌ను ఎస్జీఎంలో ప్రవేశపెట్టి సభ్యుల ఆమోదం తీసుకోనున్నారు. కాగా, ఐపీఎల్ 2021లో మిగిలిన 31 మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ)తో చర్చించారు. గత ఏడాది ఐపీఎల్ నిర్వహించిన అనుభవంతో రాబోయే మూడు నెలల్లో లీగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసే అవకాశం ఉంది.

  మరోవైపు ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ అక్టోబర్ 18 నుంచి ఇండియా వేదికగా నిర్వహించాల్సి ఉన్నది. ఇండియాలో కరోనా సెకెండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తున్న సమయంలో ఆ మెగా ఈవెంట్ సాధ్యమేనా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఇండియా వేదికగా ఐపీఎల్ కూడా వాయిదా వేసి యూఏఈకి తరలిస్తున్నారు. దీంతో ఐసీసీ కూడా ఇండియా వేదికగా టీ20 వరల్డ్ కప్ సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నది. జూన్ 1న ఐసీసీ ఎగ్జిక్యూటీవ్ కమిటీ సమావేశం జరుగనున్నది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకొని దానిని ఐసీసీ తెలియజేయాల్సి ఉన్నది. బీసీసీఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇండియాలో మెగా ఈవెంట్ నిర్వహణకే బీసీసీఐ మొగ్గు చూపుతున్నదని.. శనివారం జరిగే ఎస్జీఎంలో అన్ని రాష్ట్రాల అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడి వాళ్లు మ్యాచ్‌ల నిర్వహణకు సిద్దంగా ఉన్నారో లేదో సమాచారం సేకరించనున్నారు.

  ఇక గత ఏడాది కరోనా కారణంగా దేశవాళీ క్రికెట్ పూర్తిగా రద్దయ్యింది. ముఖ్యంగా రంజీ ట్రోఫీ నిర్వహించకపోవడంతో పలువురు క్రికెటర్లకు వేతనాలు అందలేదు. దేశ వ్యాప్తంగా క్రికెట్ మ్యాచ్‌లు నిలిచిపోవడంతో పాటు లాక్ డౌన్ కూడా అమలు జరుగుతుండటంతో క్రికెట్‌నే ఉపాధిగా చేసుకున్న పలువురు ఆటగాళ్లు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో రంజీ క్రికెటర్లు అందరికీ పూర్తి స్థాయి వేతనాలు కాకపోయినా.. పరిహారం అందించాలని బీసీసీఐ భావిస్తున్నది. దీనిపై శనివారం నాటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే కాకుండా మహిళా క్రికెట్ పూర్తి షెడ్యూల్, జట్టులో ఇటీవల సంభవించిన పరిణామాలపై చర్చ జరుగనున్నది. ఏదేమైనా రేపు సాయంత్రలోగా ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్‌పై బీసీసీఐ తమ నిర్ణయాన్ని స్పష్టం చేయనున్నది.
  Published by:John Naveen Kora
  First published: