క్రికెట్ (Cricket).. ఒక జెంటిల్మెన్ గేమ్ అని ప్రతి క్రికెటర్, అభిమాని గొప్పగా ఫీలవుతుంటారు. ఇందుకు తగ్గట్లే విభిన్న దేశాల క్రికెటర్లు.. రంగు, మతం, జాతి అనే తేడా లేకుండా ఈ క్రీడలో మమేకమై పోటీపడుతుంటారు. ఇక ఐపీఎల్ (IPL) లాంటి లీగ్‌ల్లో అయితే ఒకే డ్రెస్సింగ్‌రూమ్‌ను పంచుకుంటారు. అయితే ఇలాంటి ఆటలోనూ జాత్యాంహంకార ధోరణి ఉందని ఎన్నో ఘటనలు నిరూపించాయ్. ఇక, దక్షిణాఫ్రికా(South Africa) క్రికెట్ లో జాతి వివక్ష కొత్తేమీ కాదు. ఇప్పటికే జాత్యాహంకారం కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధానికి గురైంది సౌతాఫ్రికా టీమ్. ఇక, లేటెస్ట్ గా మరోసారి జాతి వివక్ష వ్యాఖ్యలు ఆ దేశ క్రికెట్ లో సంచలనం రేపుతున్నాయ్. ఆ ఆరోపణలు ప్రస్తుత సౌతాఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ (Mark Boucher పై రావడం గమనర్హం. బౌచర్ ఆటగాడిగా ఉన్న సమయంలో తనపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని ఆ జట్టు మాజీ స్పిన్నర్ పాల్ ఆడమ్స్ (Paul Adams) ఆరోపించాడు. ఇప్పుడీ ఆరోపణలు ఆ దేశ క్రికెట్ బోర్డును మరోసారి షేక్ చేస్తున్నాయ్. అయితే, తాను క్రికెట్ ఆడే రోజుల్లో జాతివివక్షకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మార్క్ బౌచర్ స్పందించాడు.తన ప్రవర్తనపై బౌచర్ క్షమాపణలు చెప్పాడు. విషయంలోకి వెళితే.. దక్షిణాఫ్రికాకు క్రికెట్ ఆడుతున్న సమయంలో బౌచర్ నల్లజాతీయ సహచరులను ఉద్దేశించి పాటలు పాడి, వారిని నిక్ నేమ్ లతో పిలిచి అవమానించేవాడని తెలుస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికా క్రికెటర్ పాల్ అడమ్స్.. తాను జాతి వివక్షకు గురయ్యానంటూ ఆరోపణలు చేశాడు. ఈ అంశానికి సంబంధించి బౌచర్ 14 పేజీలతో కూడిన ప్రమాణ పత్రాన్ని దక్షిణాఫ్రికా సోషల్ జస్టిస్ అండ్ నేషన్ బిల్డింగ్ కమిటీకి సమర్పించాడు.
''ఆరోజుల్లో నేను నల్లజాతీయులపై ప్రవర్తించిన తీరుకు సిగ్గుపడుతున్నా.. ఆరోజు నేను ఆరోపణలు చేసినవారిలో పాల్ అడమ్స్ కూడా ఉన్నాడు. అడమ్స్‌ను మారుపేరుతో పిలుస్తూ పాటలు పాడాను.. ఇది బాధాకరం. ఈ విషయంలో మరింత సున్నితంగా వ్యవహరించాల్సింది. ఏది ఏమైనా నా అమర్యాద ప్రవర్తనకు క్షమాపణలు చెబుతున్నా. ఆ కాలంలో జట్టు, సహాయ సిబ్బంది, సెలక్టర్లు, సీఎస్ఏ మరింత సున్నితంగా వ్యవహరించాల్సింది. జట్టు సభ్యులందరూ స్వేచ్చగా మాట్లాడే వాతావరణం కల్పించాల్సింది'' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక మార్క్ బౌచర్ దక్షిణాఫ్రికా తరపున 147 టెస్టుల్లో 5515 పరుగులు, 295 వన్డేల్లో 4686 పరుగులు, 25 టీ20ల్లో 268 పరుగులు చేశాడు. వికెట్ కీపర్‌గా 532 క్యాచ్‌లు.. 555 స్టంపింగ్స్ చేశాడు. 2012లో సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ బెయిల్ కంటికి తగలడంతో దురదృష్టవశాత్తూ ఆటకు దూరమవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం బౌచర్ సౌతాఫ్రికా క్రికెట్ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఇక సఫారీ జట్టులో గ్రేట్ లెజెండరీ క్రికెటర్లుగా గుర్తింపు దక్కించుకున్న ఏబీ డివిల్లియర్స్, గ్రేమ్ స్మిత్‌లపై కూడా జాతివివక్ష ఆరోపణలు రావడం విశేషం. సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్లో సూపర్ గా ఆడిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ తమి సోలెకిలే, 2011 నుంచి 15 వరకూ నేషనల్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. అయితే ఈ ఐదేళ్ల కాలంలో కేవలం బ్యాకప్ ప్లేయర్‌గానే ఉన్న తమి సోలెకిలే ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.160 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన తమి సోలెకిలే, మూడంటే మూడే అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. అయితే అప్పుడు సౌతాఫ్రికా జట్టు కెప్టెన్‌గా గ్రేమ్ స్మిత్ లేకపోయి ఉంటే, తాను మరిన్ని మ్యాచులు ఆడేవాడినని కామెంట్ చేశాడు తమి సోలెకిలే. వారిద్దరూ తనని క్రికెట్ ఆడకుండా చేశారని అతను కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IPL, South Africa, Sports