దక్షిణాఫ్రికా క్రికెటర్ కగిసో రబాడా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య త్వరలో సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో రబాడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యలో క్రికెటర్ల కోస ఏర్పాటు చేసిన బయో సెక్యూర్ బబుల్‌ను లగ్జరీ జైలుతో పోల్చాడు. ఇంగ్లండ్, సౌతాఫ్రికా మధ్య మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ నవంబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం రెండు జట్లు కేప్ టౌన్‌లోని బయో బబుల్‌లో ఉన్నాయి. ఈ టూర్ కు ముందు దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడాడు. అక్కడ సుమారు మూడు నెలల పాటు బయో బబుల్‌లో ఉన్నాడు. ‘అది చాలా కష్టం. మనం వేరొకరితో కలవలేం. మాట్లాడలేం. మన స్వేచ్ఛను కోల్పోతాం. అది ఓ రకంగా లగ్జరీ జైలులో ఉన్నట్టుంది.’ అని రబాడా చెప్పినట్టు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో తెలిపింది.
ఈ సందర్భంగా కగిసో రబాడా మరికొన్ని ఆసక్తికర కామెంట్స్ కూడా చేశాడు. ‘ఓ రకంగా మనం అదృష్టవంతులం అనే చెప్పాలి. ఎందుకంటే కరోనా వైరస్ వల్ల చాలా మంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు. వారంతా చాలా కష్టాలు పడుతున్నారు. ఓ రకంగా మనకు దక్కిన అదృష్టం ఏంటంటే, మనం డబ్బు సంపాదించడానికి అవకాశం లభించింది. మనం ప్రేమించే (క్రికెట్) పని కూడా మనం చేయగలుగుతున్నాం. ఇంకా చెప్పాలంటే మనల్ని చాలా బ్యాడ్ గా ట్రీట్ చేయడం లేదు. చాలా పెద్ద పెద్ద హోటల్స్‌లో ఉంటున్నాం. మంచి పౌష్టికమైన ఆహారం లభిస్తోంది.’ అని అన్నాడు.
అయితే, నాలుగు గోడల మధ్య ఉండిపోవడం మానసికంగా ప్రభావం చూపుతోందని రబాడా అభిప్రాయపడ్డాడు. ‘కానీ నాలుగు గోడల మధ్య ఉండడం కష్టం. అది మనపై మానసికంగా ప్రభావం చూపుతుంది. కానీ, అవన్నీ మర్చిపోవాలి. మనకు ఎదురైన మంచి అనుభవాలను గుర్తు చేసుకుని వాటిని నెమరువేసుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే మనకు ఎదురైన చేదు అనుభవాలను మర్చిపోతాం.’ అని రబాడా అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ 2020లో అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాడిగా నిలిచాడు రబాడా. ఈ దక్షిణాఫ్రికా ప్లేయర్ ఢిల్లీ కేపిటల్స్ తరఫున ఆడాడు. ఆ జట్టు తొలిసారి ఫైనల్స్ చేరింది. కానీ, ఫైనల్లో రోహిత్ శర్మ సారధ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు చేతిలో ఓటమిపాలైంది. అయితే , ఐపీఎల్ ప్రారంభానికి ముందు సుమారు 6 నెలలపాటు రబాడా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ‘ ఆ బ్రేక్ నాకు కలిసొచ్చింది. ఓ రకంగా సాయం చేసిందనే చెప్పాలి. బాడీ, మైండ్ రిఫ్రెష్ అయింది. భవిష్యత్తులో ఇంతా లాంగ్ గ్యాప్స్ వస్తాయో రావో, ఎందుకంటే క్రికెట్ బాగా పెరిగిపోతుంది. ’ అని రబాడా వ్యాఖ్యానించాడు.
మరోవైపు గతవారం ఇద్దరు దక్షిణాఫ్రికా ప్లేయర్లు కరోనా వైరస్ పాజిటివ్ బారిన పడ్డారు. దీని కారణంగా ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ రద్దయింది. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా సిరీస్‌లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ నవంబర్ 27న కేప్‌టౌన్‌లో జరగనుంది.