Dale Steyn Retires: క్రికెట్‌కు డేల్ స్టెయిన్ గుడ్‌బై.. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన

క్రికెట్ నుంచి వైదొలుగున్నట్లు ప్రకటించిన దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ (PC: Cricket South Africa)

దక్షిణాఫ్రికాకు చెందిన ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు మంగళవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

  • Share this:
    సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ డేల్ స్టెయిన్ (Dale Steyn) క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ (Retirement) ప్రకటించాడు. 'స్టెయిన్ గన్'గా పేరుగాంచిన ఈ దక్షిణాఫ్రికా క్రికెటర్ మంగళవారం ట్విట్టర్ వేదికగా తాను క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నట్లు సందేశాన్ని పంపాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా డేల్ స్టెయిన్‌కు పేరున్నది. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన డేల్ స్టెయన్ 2019 ఫిబ్రవరిలో అతడు చివరి టెస్టు ఆడాడు. అదే ఏడాది అగస్టులో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇక 2019 మార్చిలో చివరి వన్డే, గత ఏడాది ఫిబ్రవరిలో చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. గత ఏడాది ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడి ఒక వికెట్ తీశాడు. చివరిగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2021లో పాల్గొన్న డేల్ స్టెయిన్ మంగళవారం క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

    అంతర్జాతీయ కెరీర్..

    డేల్ స్టెయిన్ దక్షిణాఫ్రికా తరపున 93 టెస్టుల్లో 22.95 సగటుతో 432 వికెట్లు తీశాడు. 125 వన్డేలు ఆడి 196 వికెట్లు తీశాడు. 47 టీ20 మ్యాచ్‌లలో 64 వికెట్లు పడగొట్టాడు. కెరీర్ చివరి దశలో అనేక సార్లు గాయాలపాలయ్యాడు. 2018-19 సీజన్‌లో గాయం నుంచి కోలుకొని తిరిగి టెస్టు మ్యాచ్ ఆడాడు. కానీ భుజానికి గాయం కారణంగా 2019 ఐపీఎల్‌కు దూరమ్యాడు. ఐపీఎల్‌లో డేల్ స్టెయిన్ డెక్కన్ చార్జర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.



    ట్విట్టర్‌లో ఇలా రాశాడు..

    'గత ఇరవయ్యేళ్లుగా శిక్షణ, మ్యాచ్‌లు, ప్రయాణాలు, విజయాలు, అపజయాలు, కట్టేసిన కాళ్లు, జెట్ ల్యాగ్‌లు, ఆనందం, సంతోషం, సోదరప్రేమ ఇలా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఎన్నో చెప్పాలని ఉంది.. ఎందరికో కృతజ్ఞతలు తెలియజేయాల్సి ఉన్నది. నేను ఈ రోజు నేను ఎంతగానో ప్రేమించే క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాను. చేదైన నిజమే.. కానీ చాలా గర్వంగా ఉన్నది' అని డేల్ స్టెయిన్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. డేల్ స్టెయిన్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన సందర్భంగా చాలా మంది సహచర క్రికెటర్లు స్పందిస్తున్నారు. ఏబీ డివిలియర్స్ కూడా నువ్వు ఎప్పటికీ దిగ్గజానివే అంటూ వీడ్కోలు పలికాడు.
    Published by:John Naveen Kora
    First published: