పాకిస్థాన్ మాజీ క్రికెటర్లుకి ఏం పని ఉండేదేమో.. ఎప్పుడూ మన టీమిండియా క్రికెటర్లపై పడి చస్తుంటారు. ఎప్పటికప్పుడూ మనోళ్ల ఏ రికార్డులైనా సాధిస్తే చాలు.. వాటి మీద పడి ఏడుస్తుంటారు. ఎవరైనా మన క్రికెటర్లను కొంచెం పొగిడితే చాలు ఈర్షతో రగిలిపోతుంటారు.లేటెస్ట్ గా టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin).. అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. భారత జట్టు (Team India) తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అశ్విన్ రెండో స్థానంలో నిలిచాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 435వ వికెట్ సాధించాడు. తద్వారా టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ (Kapil Dev)(434 వికెట్లు)రికార్డును అధిగమించాడు. పర్యాటక లంక రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా అసలంకను ఔట్ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు.
ఇక రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన ఈ తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇన్నింగ్స్ మీద 222 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసింది. ఈ విజయంలో బౌలర్ల పాత్ర మరువలేనిది.
ఈ మ్యాచ్‌లో అశ్విన్ మొత్తంగా ఆరు వికెట్లు పడగొట్టి విజయంలో తన వంతు సహకారం అందించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ తర్వాత మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ అశ్విన్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘‘నా దృష్టిలో అతడు ఆల్ టైమ్ గ్రేట్. జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అందుకే నా అభిప్రాయం ప్రకారం తను ఎల్లప్పుడూ గొప్ప ఆటగాడే’’ అంటూ కొనియాడాడు.
ఐతే, ఈ విషయంలో తాను రోహిత్ శర్మ వ్యాఖ్యలతో ఏకీభవించలేనని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ అన్నాడు. భారత క్రికెట్‌లో యష్ దిగ్గజ బౌలర్ అంటే ఒప్పుకోనన్నాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. " అశ్విన్ గొప్ప బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన బౌలింగ్‌లో వైవిధ్యం ఉంటుంది.
ముఖ్యంగా స్వదేశంలో టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. కాబట్టి భారత్‌లో అతడు అత్యుత్తమ స్పిన్నర్ అని చెప్పవచ్చు. అయితే, విదేశాల్లో మాత్రం నా అభిప్రాయం ప్రకారం అనిల్ కుంబ్లే గొప్ప బౌలర్. బిషన్ సింగ్ బేడీ కూడా అద్భుత బౌలర్. కాబట్టి రోహిత్ శర్మ వ్యాఖ్యలతో నేను ఏకీభవించలేను. బహుశా రోహిత్ నోరు జారి ఉంటాడు. లేదంటే ఆటగాళ్లను ప్రోత్సహించే క్రమంలో అతన్ని ఆల్ టైమ్ గ్రేట్ అని ఉంటాడు" అని పేర్కొన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India vs srilanka, Pakistan, Ravichandran Ashwin, Rohit sharma