శ్రీలంక జట్టు కరోనా కలవరం ఆగడం లేదు. ఆ జట్టును మహమ్మరి వెంటాడుతునే ఉంది. ఇంగ్లండ్ పర్యటన నుంచి వెంటనే ఫస్ట్ బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ కు వైరస్ నిర్ధారణ అవ్వగా.. ఆ తర్వాత డేటా అనలిస్ట్ జీటీ నిరోషన్ కు మహమ్మారి సోకింది. లేటెస్ట్ గా క్రికెటర్ వైరస్ బారిన పడటంతో శ్రీలంక ప్లేయర్స్ తో పాటు భారత జట్టులోనూ టెన్షన్ వాతావరణం మొదలైంది. సందున్ వీరక్కోడి అనే క్రికెటర్ కు వైరస్ నిర్థారణ అయింది. ప్రస్తుతం వీరక్కోడిని లంక క్రికెట్ బోర్డు ఐసోలేషన్‌కు తరలించింది. అతడితో కలిసున్న వారినీ కూడా ప్రత్యేక ఐసోలేషన్ సెంటర్‌కు పంపింది. అయితే, అంతకుముందు వీరక్కోడి.. మరో 15 మంది సీనియర్ క్రికెటర్లతో కలిసి సిన్నామన్ గ్రాండ్ హోటల్లో బస చేశాడు. టీమిండియాతో సిరీస్‌కు ముందు సాధన మ్యాచులు ఆడించేందుకు కొందరు క్రికెటర్లను లంక క్రికెట్ బోర్డు శుక్రవారం రాత్రి దంబుల్లాకు పంపింది. అందులో వీరక్కోడి సహా 26 మంది క్రికెటర్లు ఉన్నారు. దీంతో వీరంతా ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. అయితే, ఇంగ్లండ్ నుంచి తిరిగొచ్చిన లంక జట్టులో వీరక్కోడి సభ్యుడు లేకపోవడం ఊరటనిచ్చే అంశం.
ఇదిలా ఉంటే, కరోనా దెబ్బకు శ్రీలంకతో వన్డే సిరీస్ ఐదు రోజులు ఆలస్యంగా మొదలుకానుంది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 13న ప్రారంభంకావాల్సిన వన్డే సిరీస్.. జులై 18 నుంచి మొదలవుతుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. లంక క్రికెట్ జట్టులో వరుసగా కరోనా కేసులు వెలుగు చూడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు 18, 20, 23 తేదీల్లో జరుగుతాయని పేర్కొన్నారు. అనంతరం జులై 25 నుంచి టీ20 సిరీస్ ప్రారంభమవుతోందని సూచన ప్రాయంగా ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona effect, Cricket, India vs srilanka, Shikhar Dhawan, Sri Lanka