ఆమె పేరు సిమోన బైల్స్ (Simone Biles).. అమెరికాకు చెందిన ఆర్టిస్టిక్ జిమ్నాస్ట్ (Gymnast). గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ వేదికలపై ఆమె అడుగు పెడితే స్వర్ణం (Gold Medal) దక్కాల్సిందే. కనీసం ఒక పతకం అయినా కొట్టకుండా ఆ పోటీల నుంచి వెళ్లేది కాదు. 2016 రియో ఒలింపిక్స్‌లో ఐదు పతకాలు కొల్లగొట్టింది. ఇందులో నాలుగు స్వర్ణ పతకాలే ఉన్నాయి. 2013 నుంచి జిమ్నాస్టిక్స్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొన్న బైల్స్ ఇప్పటి వరకు 19 స్వర్ణ పతకాలు తన ఖాతాలో వేసుకుంది. ఇక టోక్యో ఒలింపిక్స్ 2020కి అర్హత సాధించిన ఆమె ఏకంగా ఆరు స్వర్ణాలపై గురి పెట్టింది. ఇప్పటికే టీమ్ ఈవెంట్‌లో రజత పతకం సాధించింది. మిగతా పోటీల్లో కూడా పాల్గొంటే కనీసం నాలుగైదు స్వర్ణాలు కొల్లగొట్టే ఛాన్స్ ఉంది. కానీ అర్దాంతరంగా పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అందుకు కారణం తన మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడమే. 'నా మానసిక స్థితి సరిగా లేదు. మిగతా ఈవెంట్లలో పాల్గొంటానో లేదో' అని బుధవారం ప్రకటించిన ఆమె.. గురువారం టీమ్ ఈవెంట్ పోటీల నుంచి పూర్తిగా తప్పుకున్నది.
ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సందర్భంగా మహిళా క్రీడాకారిణి నయోమీ ఒసాకా కూడా తన మానసిక స్థితి సరిగా లేదని పేర్కొంటూ పోటీల నుంచి తప్పుకున్నది. తొలి రౌండ్ మ్యాచ్ గెలిచినా.. తాను ఇక టోర్నీలో కొనసాగలేనంటూ వెళ్లిపోయింది. అదే కారణంతో వింబుల్డన్ 2021లో అసలు పాల్గొనలేదు. అప్పట్లో ఆమెకు అనుకూలంగా, ప్రతికూలంగా చాలా మంది కామెంట్లు చేశారు. ఇప్పుడు ఏకంగా నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఒలింపిక్స్ నుంచే ప్రముఖ జిమ్నాస్ట్ తప్పుకోవడంతో అథ్లెట్లు మానసిక ఆందోళనపై చర్చ మొదలైంది. మహిళల జిమ్నాస్టిక్స్‌లో 9 స్వర్ణ పతకాలు గెలిచి ఆల్ టైం రికార్డు సృష్టించే అవకాశం ఉన్నా.. సిమోన బైల్స్ పోటీల్లో కొనసాగడానికి అంగీకరించడం లేదు.
జిమ్నాస్టిక్స్ అనేది కేవలం ఫిట్‌నెస్‌కు సంబంధించిన అంశం మాత్రమే కాదని.. మానసికంగా ఎలాంటి ఆందోళన ఉన్నా.. అది చివరకు తీవ్రమైన గాయాల పాలు చేస్తుందని యూఎస్ జిమ్నాస్టిక్ ఆటగాళ్లు అంటున్నారు. తాను నిష్క్రమించడం చాలా బాధకరమైన విషయమే అయినా.. ఆమె పరిస్థితిని అర్దం చేసుకోగలమని చెబుతున్నారు.
Take your time @Simone_Biles. You have earned the right to owe it to yourself at this tender age. 48 hours or 48 days it might take. Just do it Champion. You owe no explanation to no one. @naomiosaka, you too. God bless you girls #Olympics pic.twitter.com/wMS7eV1UlX
— Ravi Shastri (@RaviShastriOfc) July 29, 2021
గత ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన ఆల్ రౌండ్ ఈవెంట్లో క్వాలిఫయింగ్ రౌండ్‌లోనే బౌల్స్ అగ్రస్థానంలో నిలిచి తుది పోరుకు అర్హత సాధించింది. కానీ ఆ రౌండ్‌లో తాను పాల్గొనబోవడం లేదని చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మరోవైపు బైల్స్ మానసిక ఆరోగ్యంపై జాగ్రత్తగా సమీక్షిస్తామని యూఎస్ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఆమె ఆడను అని నిర్ణయించుకున్న తర్వాత బలవంతం చేయబోమని కూడా తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Tokyo Olympics