SHREYAS IYER TEAM INDIA PLAYER SHREYAS IYER TURN AROUND JOURNEY FROM SHOULDER DISLOCATION TO SEALING SPOT IN TEAM INDIA SJN
Shreyas iyer: ఫీనిక్స్ పక్షి బూడిద నుంచి పుట్టినట్లు... గాయం నుంచి రివ్వున ఎగిరిన శ్రేయస్ అయ్యర్...
శ్రేయస్ అయ్యర్
Shreyas iyer : మార్చి 23న ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగ్గా... ఫీల్డింగ్ చేస్తూ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. బంతిని ఆపే ప్రయత్నంలో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) డైవ్ చేయగా అతడి ఎడం భుజం డిస్ లొకేట్ అయ్యింది. అంతే శ్రేయస్ అయ్యర్ క్రికెట్ జీవితం ఒక్కసారిగా స్థంభించిపోయింది.
Shreyas iyer: సరిగ్గా ఏడాది క్రితం ఫిబ్రవరి మార్చి నెలల్లో భారత్ (India) లో పర్యటించేందుకు ఇంగ్లండ్ (England) క్రికెట్ జట్టు వచ్చింది. అందులో భాగంగా మార్చి 23న ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగ్గా... ఫీల్డింగ్ చేస్తూ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. బంతిని ఆపే ప్రయత్నంలో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) డైవ్ చేయగా అతడి ఎడం భుజం డిస్ లొకేట్ అయ్యింది. అంతే శ్రేయస్ అయ్యర్ క్రికెట్ జీవితం ఒక్కసారిగా స్థంభించిపోయింది. టీమిండియా తరఫున అప్పటికే వన్డే, టి20 జట్లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే గాయం కారణంగా అతడు ఆరు నెలల పాటు ఆటకు దూరం కావల్సి వచ్చింది. కోలుకుని తిరిగి వచ్చినా మళ్లీ సున్నా నుంచి మొదలు పెట్టాలి. అదే సమయంలో భారత్ లో స్థానం కోసం సూర్యకుమార్ యాదవ్, సంజూ సామ్సన్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్స్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.
భుజం గాయానికి శస్త్ర చికిత్స చేయించుకోవడానికి ఇంగ్లండ్ వెళ్లిన శ్రేయస్ అయ్యర్... దాదాపు ఆరు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) సారథ్య బాధ్యతలను కూడా కోల్పోయాడు. ఇక టి20 ప్రపంచకప్ కు రెడీ అయ్యేది కూడా అనుమానంగానే కనిపించింది. అయితే శ్రేయస్ అయ్యర్ మాత్రం అందరినీ ఆశ్యర్యపరుస్తూ ఐదు నెలల్లోనే భుజం గాయం నుంచి కోలుకున్నాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకుని ఫిట్ నెస్ కూడా నిరూపించుకున్నాడు. అదే సమయంలో కరోనాతో ఐపీఎల్ వాయిదా పడటంతో యూఏఈ వేదికగా జరిగిన రెండో అంచెలో పాల్గొన్నాడు. అయితే గత రెండు సీజన్లలో జట్టుకు నాయకుడిగా ఉన్న శ్రేయస్... ఈసారి మాత్రం కేవలం ఆటగాడిగానే బరిలోకి దిగాడు. గాయం వల్ల ఆటకు ఎక్కువ కాలం దూరం కావడం, ప్రాక్టీస్ లేకపోవడం వంటి కారణాలతో ఢిల్లీ తరఫున పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అదే సమయంలో టి20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన ప్రధాన జట్టులో శ్రేయస్ చోటు దక్కించుకోలేకపోయాడు. కేవలం రిజర్వ్ టీంకే ఎంపికయ్యాడు. ఎవరైనా బ్యాటర్ ప్రపంచకప్ జరిగే సమయంలో గాయపడటమో లేక కరోనా బారిన పడటమో జరిగితే అప్పుడు శ్రేయస్ ను ప్రధాన జట్టులోకి చేర్చే అవకాశం ఉంటుంది. దాంతో అతడికి మరోసారి నిరాశే ఎదురైంది.
మార్చేసిన న్యూజిలాండ్ పర్యటన
గ్రీకు పురాణాల్లో ఫీనిక్స్ పక్షి గురించి కొన్ని కథలు ఉంటాయి. అవేంటంటే.. వాటికి మరణం ఉండదని... వయసు మళ్లిన తర్వాత వాటంతట అవే మండిపోయి మరణించి చితిగా మారుతుందని చెబుతారు. ఆ చితాభస్మం నుంచి మళ్లీ జన్మిస్తుందని చెబుతారు. శ్రేయస్ అయ్యర్ కూడా అచ్చం ఫీనిక్స్ పక్షిలానే చేశాడు. గాయంతో కెరీర్ ఓవర్ అనుకున్న సమయంలో తనకు దక్కిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుని అంతెత్తున లేచాడు. కాన్పూర్ వేదికగా కివీస్ తో తొలి టెస్టు జరగ్గా... ఆ మ్యాచ్ కు కోహ్లీ కి విశ్రాంతినిచ్చారు. దాంతో శ్రేయస్ అయ్యర్ కు తుది జట్టులో అవకాశం దక్కింది. అరంగేట్ర మ్యాచ్ లోనే తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ కొట్టిన అతడు... రెండో ఇన్నింగ్స్ లో 65 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. అనంతరం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో పెద్దగా పరుగులు సాధించలేకపోయాడు. అనంతరం సౌతాఫ్రికా పర్యటనకు సెలెక్ట్ అయినా మూడు టెస్టులకు కూడా బెంచ్ కే పరిమితం అయ్యాడు. అనంతరం సౌతాఫ్రికాతో, వెస్టిండీస్ తో జరిగిన వన్డే, టి20 సిరీస్ ల్లో అడపాదడపా అవకాశం వచ్చినా మునుపటి శ్రేయస్ అయ్యర్ ను అయితే చూపించుకోలేకపోయాడు.
ఇక శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ చెలరేగిపోయాడు. మూడు టి20ల్లోనూ వరుసగా 57 నాటౌట్, 74 నాటౌట్, 73 నాటౌట్ స్కోర్లతో 204 పరుగులు చేస ’ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‘ అవార్డును గెల్చుకున్నాడు. ఇక అనంతరం జరిగిన టెస్టు సిరీస్ లోనూ అదరగొట్టాడు. బెంగళూరు వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వాళ్లు పెవిలియన్ కు చేరితే తొలి ఇన్నింగ్స్ లో ఒంటిరి పోరాటం చేసిన అతడు 92 పరుగులతో అదరగొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లోనూ 67 పరుగులు చేసి... ఒక పింక్ బాల్ టెస్టు రెండు ఇన్నింగ్స్ లలో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి టీమిండియా బ్యాటర్ గా నిలిచాడు. అంతేకాకుండా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా కూడా నిలిచాడు. శ్రేయస్ తాను ఆడిన నాలుగు టెస్టుల్లో రెండు మ్యాచ్ ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలువడం విశేషం. త్వరలో ఆరంభమయ్యే ఐపీఎల్ 15వ సీజన్ లో కేకేఆర్ జట్టుకు సారథిగా ఉండనున్నాడు. ఇలా గాయం అతడి కెరీర్ ను నాశనం చేేసేలా కనిపించినా... పట్టుదలతో దాన్ని అధిగమించిన అతడు మునుపటి కంటే ప్రత్యర్థి బౌలర్ల పాలిట ప్రమాదకారిగా తయారయ్యాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.