Cricket : రూమర్లపై ఫైర్ అయిన సానియా మీర్జా భర్త.. ఇప్పట్లో అలా జరగదంటున్న షోయబ్ మాలిక్

రూమర్లపై గుస్సా అయిన సానియా భర్త షోయబ్ మాలిక్ [PC: Twitter]

  • Share this:
    భారత టెన్నిస్ (Tennis Star) స్టార్ సానియా మీర్జా (Sania Mirza) భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) తనపై వస్తున్న రూమర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఇంకా 39 ఏళ్లే అని.. ఇప్పట్లో తాను రిటైర్ (Retirement) అయ్యే ప్రసక్తి లేదని మాలిక్ స్పష్టం చేశాడు. షోయబ్ మాలిక్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఈ మధ్య పాకిస్తాన్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మాలిక్ తన రిటైర్మెంట్ వార్తలను కొట్టి పారేశాడు. 'నేను ఈ రోజు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నాకు రిటైర్ కావాలనే ఆలోచన లేదు. నేను ఇంకా ఫిట్‌గా ఉన్నాను. నేను బ్యాటింగ్, బౌలింగ్ చేయగలను' అని మాలిక్ ట్వీట్ చేశాడు. కాగా, ఇటీవల కాలంలో పాకిస్తాన్ టీమ్ మేనేజ్‌మెంట్‌పై మాలిక్ వరుస ట్వీట్లతో విరుచుకపడ్డాడు. కెప్టెన్ బాబర్ అజమ్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోనివ్వడం లేదని పేర్కొన్నాడు. ప్రధాన కోచ్ మనసుకు నచ్చిన వాళ్లను ఎంపిక చేస్తున్నారని.. సోషల్ మీడియాలో ఎక్కువ లైక్స్ ఉన్న వారికి ఛాన్స్ ఇస్తున్నట్లు ఉన్నదని మాలిక్ తీవ్ర ఆరోపణలు చేశాడు.

    మరోవైపు తనకు జాతీయ జట్టుకు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోచ్‌గా ఉండమని పిలుపు వచ్చినా తాను వెళ్లలేదని మాలిక్ పేర్కొన్నాడు. తాను రాబోయే రెండేళ్ల కాలానికి పలు లీగ్స్‌తో కాంట్రాక్టులు కుదుర్చుకున్నానని.. ఇక టీ20 వరల్డ్ కప్ తర్వాత తాను రిటైర్ అవ్వాల్సిన అవసరం ఏమున్నదని మాలిక్ ప్రశ్నించాడు. ఒక క్రికెటర్ పూర్తి ఫిట్‌గా ఉన్నప్పుడు ఇక ఆటను వీడాల్సిన అవసరం ఏమున్నదని మాలిక్ అంటున్నాడు. కాగా, మాలిక్ ఇప్పటికే వన్డే, టెస్టు మ్యాచ్‌ల ఫార్మాట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం టీ20 క్రికెట్ పైనే పూర్తిగా దృష్టి పెట్టాడు. అయితే మిస్బా ఉల్ హక్ జాతీయ జట్టు కోచ్ అయ్యాక యువ క్రికెటర్లకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. దీంతో షోయబ్ మాలిక్‌కు తగినన్న అవకాశాలు రావడం లేదు.

    మిస్బా ఉల్ హక్ కోచ్ అయిన తర్వాతే తనకు అవకాశాలు రావడం లేదని మాలిక్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. మిస్బా కోచ్‌గా ఉన్న సమయంలోనే తనకు టీ20 జట్టులో తిరిగి చోటు దక్కితే తాను ఎప్పటి లాగానే 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తానని.. వేరే స్థానంలో బ్యాటింగ్ చేయడం ఇప్పుడు తనకు కష్టమని మాలిక్ చెప్పాడు. తాను ఎప్పుడు క్రికెట్ ఆడినా జట్టు విజయానికే ఆడతానని అన్నాడు. మాలిక్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ వంటి లీగ్స్‌లో ఆడుతున్నాడు. చాన్నాళ్లుగా పాకిస్తాన్ టీ20 జట్టులో తిరిగి స్థానం సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాడు.
    Published by:John Naveen Kora
    First published: