Shane Warne : అతడు బౌలింగ్ కు వచ్చాడంటే ప్రత్యర్థి బ్యాటర్లు వణికిపోవాల్సిందే. పిచ్ తో సంబంధం లేకుండా తనకే సాధ్యమయ్యే బంతులతో బ్యాటర్స్ ను పెవిలియన్ కు చేర్చడం కేవలం అతడికి మాత్రమే సాధ్యం. 1993లో ఆస్ట్రేలియా (Australia) తరఫున అరంగేట్రం చేసిన షేన్ వార్న్(Shane Warne)... ఆ తర్వాత ఆ జట్టుకు ప్రధాన బౌలర్ గా మారాడు. ఫార్మాట్ (Format)తో సంబంధం లేకుండా తన మణికట్టు మాయాజాలంతో ప్రత్యర్థిని గడగడ లాడించాడు. ప్రతి జట్టు పైనా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన వార్న్... ఒక టీంపై మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఆ జట్టుపై వికెట్లు తీయడంలో పూర్తిగా ఇబ్బంది కూడా పడ్డాడు. ఆ జట్టు ఏదంటే...
స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ తన టెస్టు కెరీర్ లో 145 మ్యాచ్ లు ఆడి 708 వికెట్లు తీశాడు. ఇందులో 5 వికెట్ల ప్రదర్శనను ఏకంగా 37 సార్లు ప్రదర్శించాడు. టెస్టుల్లో వార్న్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ 71 పరుగులకు 8 వికెట్లు. ప్రతి 25 పరుగులకు ఓ వికెట్ తీశాడు. ఇంతటి సూపర్ బౌలర్ సైతం ఓ జట్టంటే భయపడేవాడు. ఆ టీంలోని కొందరి బ్యాటర్స్ ను తలుచుకుంటే నిద్ర కూడా వచ్చేది కాదంటూ బహిరంగంగానే ప్రకటించాడు. తన స్పిన్ ఉచ్చుతో ఇతర జట్లను పడేసినా... భారత్ (India) ముందు మాత్రం తేలిపోయేవాడు. భారత్ ప్రత్యర్థిగా 14 మ్యాచ్ లు ఆడిన షేన్ వార్న్ కేవలం 43 వికెట్లను మాత్రమే తీశాడు. కేవలం ఒక్కసారి మాత్రమే ఇన్నింగ్స్ లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లను తీయగలిగాడు. భారత్ పై అతడి బెస్ట్ ఫిగర్స్ 125 పరుగులకు 6 వికెట్లు. ఇది కూడా స్పిన్ కు అనకూలించే భారత పిచ్ పై 2004లో నమోదు చేశాడు. ఇతర దేశాలపై ప్రతి 25 పరుగులకు ఓ వికెట్ తీసిన వార్న్... భారత్ పై మాత్రం ప్రతి 47 పరుగులకు ఓ వికెట్ తీశాడు.
అంతేకాకుండా వార్న్ కు సచిన్ టెండూల్కర్ (Sachin tendulkar) అంటే చాలా భయం. అతడికి బౌలింగ్ చేయాలంటే భయపడేవాడు. ఎంతటి గొప్ప బంతి వేసినా... సచిన్ దాన్ని బౌండరీకి తరలించేవాడు. దాంతో సచిన్ కు ఎలా బౌలింగ్ చేయాలో ఆలోచిస్తూ వార్న్ నిద్రలేని రాత్రులను కూడా గడిపాడు. అయితే శుక్రవారం షేన్ వార్న్ హఠాన్మరణం చెందారు. థాయ్ లాండ్ (Thailand)లోని అతడి విల్లాలో మరణించిన సంగతి తెలిసిందే. 52 ఏళ్ల వయసులో షేన్ వార్న్ హార్ట్ అటాక్ (Heart attack)తో మరణించినట్లు అక్కడి పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. వార్న్ మరణంతో క్రీడా లోకం షాక్ కు గురైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, Heart Attack, India, Sachin Tendulkar, Thailand