SHAH RUKH KHAN OF TAMILNADU FINISHED SMAT FINAL IN DHONI STYLE IS CSK WANT TO PURCHASE IN NEXT SEASON JNK
SMAT: ధోనీ చూస్తుండగా.. అతడి స్టైల్లోనే ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టును గెలిపించాడు.. వచ్చే ఏడాది సీఎస్కేలోకి వస్తాడా?
ధోనీ చూస్తుండగా.. ధోనీ స్టైల్లో మ్యాచ్ ఫినిష్ చేశాడు (PC: CSK)
SMAT: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో తమిళనాడు బ్యాటర్ షారుక్ ఖాన్ అచ్చం ధోనీలాగే చివరి బంతికి సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించాడు. వచ్చ ఏడాది అతడిని కొనుగోలు చేయడానికి సీఎస్కే యాజమాన్యం ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తున్నది.
ఐపీఎల్ 2022 (IPL 2022) కోసం బీసీసీఐ (BCCI) త్వరలో మెగా వేలం నిర్వహించనున్నది. గత సీజన్లో ఉన్న 8 జట్లకు తోడు ఈ సారి మరో రెండు కొత్త జట్లు లీగ్‌లో చేరాయి. బీసీసీఐ కూడా రిటెన్షన్ పాలసీని ప్రకటించింది. దీని ప్రకారం నలుగురు ఆటగాళ్లను మాత్రమే ఆయా జట్లు అట్టిపెట్టుకోవల్సి ఉంటుంది. ఇందులో విదేశీ ఆటగాళ్లు ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఉండాలి. మిగిలిన వాళ్లు స్వదేశీ ఆటగాళ్లై ఉండవచ్చు. ఇక గత సీజన్లోరాణించిన ఆటగాళ్లు.. ప్రస్తుతం ఇతర టోర్నీలలో రాణిస్తున్న ఆటగాళ్లకు మంచి డిమాండ్ ఉండవచ్చు. ఈ సారి అన్ని జట్లు స్వదేశీ ఆటగాళ్లపైనే ఎక్కువగా దృష్టి పెట్టాయి. ఎక్కువ మంది విదేశీ ఆటగాళ్లను తీసుకున్నా.. తుది జట్టులో వారిని ఎంపిక చేయడంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని స్వదేశీ ఆటగాళ్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. దీంతో యువ క్రికెటర్లకు మంచి అవకాశం లభిస్తున్నది. ఈ సారి వేలంలో దేశవాళీలో రాణించిన ఆటగాళ్లకు భారీ ధర పలికే అవకాశం ఉన్నది.
చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) దృష్టి ఇప్పుడు తమిళనాడు బ్యాటర్ షారుక్ ఖాన్‌పై (Shah Rukh Khan) పడింది. సోమవారం జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mustaq Ali Trophy) ఫైనల్లో అతడి ఆటతీరు అందరినీ ఆకట్టుకున్నది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలోజరిగిన మ్యాచ్‌లో కర్ణాటక నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన తమిళనాడు 19 ఓవర్లలో 136/6 స్కోర్ చేసింది. విజయానికి ఆఖరి వోవర్లో 16 పరుగులు అవసరం అయ్యాయి. తొలి బంతిని సాయి కిషోర్ బౌండరీ బాదాడు. ఆ తర్వాత బాల్ సింగిల్ వచ్చింది. మూడో బాల్ వైడ్ వచ్చింది. ఇక ఆ తర్వాత బాల్ సింగిల్ వచ్చింది. తర్వాత బంతికి మళ్లీ సింగిల్ వచ్చింది. ఆఖరి రెండు బంతుల్లో 8 పరుగులు అవసరం అయ్యాయి. అయితే ఐదో బాల్ వైడ్ పడింది. ఆ తర్వాతి బంతికి షారుక్ రెండు పరుగులు తీశాడు. చివరి బంతికి 5 పరుగులు కావల్సి ఉండగా.. అతడు భారీ సిక్స్ కొట్టి తమిళనాడును గెలిపించాడు. తమిళనాడు జట్టు గత సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని కూడా గెలుచుకున్నది. దీంతో రెండు సార్లు వరుసగా తమిళనాడు జట్టే చాంపియన్‌గా నిలిచింది.
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) November 22, 2021
అయితే గత సీజన్లో తమిళనాడు విజయంలో కూడా షారుక్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. దీంతో వేలంలో అతడి కోసం భారీగా పోటీ నెలకొన్నది. చివరకు పంజాబ్ కింగ్స్ అతడిని కొనుగోలు చేసింది. ఈ సారి పంజాబ్ కనుక అతడిని రిటైన్ చేసుకోకపోతే సెంట్రల్ పూల్‌లోకి వచ్చే అవకాశం ఉన్నది. అతడిని కొనుగోలు చేయాలని సీఎస్కే భావిస్తున్నట్లు తెలుస్తున్నది. తమిళనాడు లోకప్ ప్లేయర్ కాబట్టి అతడిని కొనుగోలు చేయడానికి సీఎస్కే యాజమాన్యం ఆసక్తిగా ఉన్నది. సోమవారం నాడు షారుక్ చివరి వోవర్ ఆడుతుండగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆ మ్యాచ్‌ను చూశాడు. దీనికి సంబంధించిన ఫొటోను సీఎస్కే పంచుకున్నది. 'ధోనీ స్టైల్లో మ్యాచ్‌ను ముగించాడు' అని కూడా అందులో రాసుకొచ్చింది. అంటే సీఎస్కే ఒక మ్యాచ్ ఫినిషర్ కోసం ఎదురు చూస్తుందని.. అందుకే అలా క్యాప్షన్ పెట్టిందని పలువురు అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో వేలం వరకు వేచి చూడాలి.
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.