యూఏఈ వేదికగ జరుగనున్న టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) కోసం బీసీసీఐ (BCCI) సెలెక్టర్లు ఇప్పటికే జట్టును ప్రకటించారు. గత నెలలోనే ఐసీసీ (ICC) వరల్డ్ కప్ ఆడే ఆటగాళ్ల జాబితాతో పాటు కోచింగ్, సహాయక సిబ్బంది వివరాలను పంపాలని గడువు విధించడంతో ఆ మేరకు 15 మంది ఆటగాళ్లతో పాటు ముగ్గురు రిజర్వ్ ప్లేయర్ల జాబితాను ఐసీసీకి పంపింది. అప్పటికి ఐపీఎల్ 2021 రెండవ దశ ప్రారంభం కావకపోవడంతో అప్పటి వరకు ఉన్న ఫామ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆటగాళ్లను సెలెక్ట్ చేశారు. అయితే టీమ్ ఇండియాలో చోటు దక్కిన తర్వాత ఆయా ఆటగాళ్ల ప్రదర్శన చాలా పేలవంగా మారిపోయింది. యువ క్రికెటర్ల నుంచి ఆశించిన మేర ప్రదర్శన ఐపీఎల్లో రాలేదు. తొలి సారిగా జట్టులో స్థానం సంపాదించుకున్న ఆటగాళ్లు కూడా ఐపీఎల్లో దారుణంగా విఫలమయ్యారు. అసలు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ టోర్నీ తర్వాత కెప్టెన్ పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. దీంతో ఎలాగైనా టీ20 వరల్డ్ కప్ సాధించాలనే పట్టుదలతో ఆడాల్సి ఉన్నది.
కానీ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిన ఆటగాళ్లు ఐపీఎల్లో దారుణమైన ప్రదర్శన చేయడం ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ నుంచి ఎంపిక అయిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాల ఫామ్ ఇబ్బందికరంగా మారింది. వీరిలో హార్దిక్ పాండ్యా ఈ సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. ఆల్ రౌండర్ కోటాలో ఎంపికైన హార్దిక్ పాండ్యా గత కొంత కాలంగా కేవలం బ్యాటింగ్‌కే పరిమితం అవుతున్నాడు. కనీసం టీ20లో నాలుగు వోవర్లు కూడా వేయలేక సతమతం అవుతున్నాడు. 2021లో 11 మ్యాచ్‌లు ఆడిన పాండ్యా కేవలం 117 పరుగుల మాత్రమే చేశాడంటే అతడి ఫామ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
David Warner: ఈ రోజు డేవిడ్ వార్నర్ ఫేర్వెల్ మ్యాచ్ ఆడనున్నాడా? తుది జట్టులో అతడికి స్థానం ఉంటుందా?
ఇక ఇషాన్ కిషన్ గత సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ గత ఏడాది ట్రోఫీ గెలవడంలో కిషన్ పాత్ర కూడా కీలకంగా ఉన్నది. కానీ ఈ సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన కిషన్ మొత్తం 107 పరుగులు మాత్రమే చేశాడు. అయితే రాజస్థాన్ రాయల్స్ మీద 25 బంతుల్లో 50 పరుగులు చేసి తిరిగి గాడిలో పడినట్లు కనపడుతున్నాడు. ఇక సూర్య కుమార్ యాదవ్ కూడా అంచనాలను అందుకోలేక పోతున్నాడు. గతంతో పోలిస్తే అతడిలో దూకుడు తగ్గిపోయింది. టాపార్డర్‌లో కిషన్, సూర్యకుమార్ బ్యాటింగ్ లైనప్‌కు బలంగా మారతారు అనుకుంటే.. ఫామ్ లేమితో ఆందోళన కలిగిస్తున్నారు.
రాహుల్ చాహర్ కూడా తొలి సారి వరల్డ్ కప్ జట్టులో స్థానం సంపాదించాడు. కానీ ప్రస్తుతం ఐపీఎల్లో అతడు కూడా దారుణంగా విఫలమవుతున్నాడు. అనుభవజ్ఞడైన యజువేంద్ర చాహల్‌ను పక్కన పెట్టిమరీ చాహర్‌కు అవకాశం కల్పించారు. శనివారం బీసీసీఐ, చీఫ్ సెలెక్షన్ కమిటీ సంయుక్తంగా భేటీ కానున్నది. ఫామ్‌లో లేని వారిని తప్పించి కొత్త వారిని ఎంపిక చేయాలని భావిస్తున్నది. యజువేంద్ర చాహల్, శ్రేయస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్లకు జట్టులో చోటు దక్కే అవకాశం ఉన్నది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, IPL 2021, T20 World Cup 2021, Team India