Hockey Sticks: హాకీ స్టిక్‌ల తయారీలో కండోమ్‌ల వాడకం.. వీటినే ఎందుకంటే..

ప్రతీకాత్మక చిత్రం

స్మూత్ & సాఫ్ట్ హుక్ తయారు చేసేందుకు సంజయ్ రకరకాల పద్ధతులను ప్రయత్నించారు. చివరికి ఒక కండోమ్ బాక్స్ కొనుగోలు చేశారు. వాటిని హాకీ స్టిక్స్ హుక్ తయారీలో వాడారు. తర్వాత అద్భుతమైన ఫలితాలను గమనించి ఆశ్చర్యపోయారు

  • Share this:
గతంలో హాకీ క్రీడలో ఉపయోగించే స్టిక్‌లను చెక్కతో తయారు చేసేవారు. అప్పట్లో వీటి తయారీ ప్రక్రియ చాలా కష్టతరంగా ఉండేది. హాకీ స్టిక్‌ కింది భాగంలోని హుక్‌ను తయారు చేయడానికే ఎక్కువ సమయం పట్టేది. ఆటలో బంతిని కొట్టేది ఈ హుక్‌తోనే. అందువల్ల ఈ భాగాన్ని చాలా శ్రద్ధగా తయారు చేసేవారు. ఈ స్టిక్‌కు హ్యాండిల్ జత చేసే ముందుగా ఏడు చెక్క ముక్కలను కలిపి, ఉడకబెట్టి, ఎండబెట్టి, గట్టిగా అతుక్కునేలా చేస్తారు. తర్వాత ఓ యంత్రంపై బెండ్ చేస్తారు. ఆ తర్వాత పాలిషింగ్ చేస్తారు. ఈ తతంగమంతా పూర్తయ్యే సరికి చాలా సమయం పడుతుంది.

అయితే జలంధర్‌లోని కపుర్తలా రోడ్‌లోని ఆర్‌కే స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మాత్రం.. హాకీ స్టిక్‌ల తయారీకి కొత్త విధానాన్ని రూపొందించింది. వీటి హుక్‌ల తయారీలో కండోమ్‌లను ఉపయోగిస్తూ, హాకీ స్టిక్‌లను రూపొందించారు సంస్థ యజమాని సంజయ్ కోహ్లీ. ఈ కంపెనీ రక్షక్ బ్రాండ్ పేరిట హాకీ స్టిక్‌లు తయారు చేస్తుంది. ఇవి దృఢంగా, మృదువుగా ఉంటాయి. దీర్ఘకాలం మన్నికగల ఈ హాకీ స్టిక్‌లనే రాణి రాంపాల్, షర్మిలా దేవి, నిక్కి ప్రధాన్ లాంటి చాలామంది భారత హాకీ క్రీడాకారులు ఉపయోగిస్తున్నారు. హాకీ స్టిక్స్ హుక్స్‌ ఫినిషింగ్ కోసం సంజయ్ కోహ్లీ కండోమ్‌లను ఉపయోగించేవారు. ఇప్పుడు మాత్రం చాలా హాకీ స్టిక్స్ గ్రాఫైట్‌తో తయారు చేస్తున్నారు.

కండోమ్‌లను హాకీ స్టిక్స్ హుక్ తయారీలో ఎందుకు ఉపయోగించాల్సిన అవసరం వచ్చిందో సంజయ్ కోహ్లీ వెల్లడించారు. హాకీ స్టిక్స్ భారీ ఎత్తున పాడువుతుండడంతో హుక్ తయారీలో కండోమ్‌లను ఉపయోగించాలనే ఆలోచన తనకు వచ్చిందన్నారు. హుక్ పాడవకుండా దాని ముందు భాగంలో ఒక నెట్ అతికించినా.. దానిపై పగుళ్లు ఏర్పడతాయి. చిన్న పగుళ్లు కనిపించినా, స్టిక్ నిరుపయోగంగా మారుతుంది. వీటిని రిపేర్ చేయడం కూడా కుదరదు. హుక్ మృదువుగా ఉంటేనే ఆట బాగా ఆడగలరు. అందువల్ల సాఫ్ట్ టచ్ కోసం వీటి తయారీలో కండోమ్‌లను ఉపయోగించినట్లు చెప్పారు.

స్మూత్ & సాఫ్ట్ హుక్ తయారు చేసేందుకు సంజయ్ రకరకాల పద్ధతులను ప్రయత్నించారు. చివరికి ఒక కండోమ్ బాక్స్ కొనుగోలు చేశారు. వాటిని హాకీ స్టిక్స్ హుక్ తయారీలో వాడారు. తర్వాత అద్భుతమైన ఫలితాలను గమనించి ఆశ్చర్యపోయారు. ఇక అప్పట్నుంచి ప్రతిరోజు కండోమ్ కొనుగోలు చేయడం ప్రారంభించారు. తన కింది స్థాయి ఉద్యోగితో కండోమ్‌లను తెప్పించుకునేవారు. అయితే సదరు షాపు యజమాని మాత్రం మాత్రం.. 'ఈ రేంజ్ లో కండోమ్‌లు తీసుకెళ్తున్నారేంటి'ని అనుమానపడేవాడట. చివరికి ఒకరోజు కండోమ్‌లను హాకీ స్టిక్స్ తయారీలో వాడుతున్నారని తెలుసుకొని షాప్ యజమాని షాకయ్యాడని సంజయ్ చెప్పుకొచ్చారు. అప్పట్లో కండోమ్‌లతో పెద్ద ఎత్తున స్టిక్స్ ఉత్పత్తి చేయడానికి ఇబ్బందిగా అనిపించిందని సంజయ్ వెల్లడించారు.
Published by:Shiva Kumar Addula
First published: