Cricket: టీమ్ ఇండియాలో అరంగేట్రం చేసిన సందీప్ వారియర్ ఎవరు? అతడి రికార్డులు తెలుసా?

నెట్ బౌలర్‌గా వెళ్లి.. జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సందీప్ వారియర్ (BCCI)

శ్రీలంక పర్యటనకు భారత జట్టుతో పాటు ఒక నెట్ బౌలర్‌గా వెళ్లి.. అనుకోని పరిస్థితుల్లో ఏకంగా జాతీయ జట్టులోకి సందీప్ వారియర్ అరంగేట్రం చేశాడు. అయితే నెట్ బౌలర్ అయినంత మాత్రాన అతడు ఆషామాషీ బౌలర్ ఏమీ కాదు. అతడి రికార్డులు ఒకసారి చెక్ చేయండి..

 • Share this:
  శ్రీలంక పర్యటనలో (Srilanka Tour) భారత జట్టు (Team India) మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ముగించుకొని ఇండియాకు తిరిగి వచ్చింది. వన్డే సిరీస్ గెలిచినా.. టీ20ని మాత్రం కోల్పోయింది. రెండో టీ20కి ముందు భారత జట్టులోని కృనాల్ పాండ్యా కరోనా బారిన పడటంతో పాటు అతడికి సన్నిహితంగా ఉన్న 8 మంది క్రికెటర్లు ఐసోలేషన్‌లోకి వెళ్లారు. దీంతో టీమ్ ఇండియా బెంచ్‌పై ఉన్న క్రికెటర్లు అరంగేట్రం చేయాల్సి వచ్చింది. గురువారం కీలకమైన డిసైడర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా తరపున సందీప్ వారియర్ (Sandeep Warrier) అరంగేట్రం (Debut) చేశాడు. బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే అతడికి టీమ్ క్యాప్ అందించి ఆహ్వానించాడు. దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కారణం ఏంటంటే.. శ్రీలంక పర్యటనకు సందీప్ వారియర్ కేవలం నెట్ బౌలర్‌గా మాత్రమే వెళ్లాడు. గతంలో కూడా స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో వారియర్ ఒక నెట్ బౌలర్‌గా మాత్రమే పని చేశాడు. కానీ శ్రీలంకలో అనుకోని పరిస్థితుల్లో అతడికి జాతీయ జట్టులోకి అవకాశం వచ్చింది. నెట్ బౌలరే అని అతడిని తీసి పారేస్తారేమో..! సందీప్ వారియర్‌కు దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉన్నది.

  సందీప్ వారియర్ కేరళ తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతుంటాడు. 2018-19 విజయ్ హజారే ట్రోఫీలో అతడు ఆరు మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు తీశాడు. గ్రూప్ దశలో అతడు 10 మ్యాచ్‌లలో 44 వికెట్లు తీయడం గమనార్హం. 2019 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఆంధ్రా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో హ్యాట్రిక్ తీసి సంచలనం సృష్టించాడు. వరుసగా కేవీ శశికాంత్. కరణ్ శర్మ, ఎస్‌కే ఇస్మాయేల్ వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. కేరళ తొలి సారిగా రంజీ ట్రోఫీ సెమీఫైనల్ చేరిన సమయంలో సందీప్ వారియర్ పాత్ర చాలా కీలకంగా ఉన్నది. ఆ సీజన్‌లో సందీప్ 18.33 సగటులో 39 వికెట్లు పడగొట్టాడు. బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 5/33 అద్బుతమైన స్పెల్ వేశాడు. అప్పటి కేరళ కోచ్ డేవ్ వాట్‌మోర్ ఆ ప్రదర్శనను అద్భుతమని అభివర్ణించాడు. ఒక టెస్టులో పాకిస్తాన్‌పై డేల్ స్టెయిన్, మోనీ మోర్కెల్ చేసిన ప్రదర్శనలా ఉందని కితాబిచ్చాడు.

  సందీప్ వారియర్ 57 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 186 వికెట్లు, 55 లిస్ట్ ఏ మ్యాచ్‌లలో 66 వికెట్లు తీశాడు. సందీప్ వారియర్ మొదట్లో స్వింగ్ ఎక్కువగా చేస్తూ బంతులు విసిరేవాడు. కానీ ఆ తర్వాత తన స్వింగ్ బంతులకు వేగాన్ని కూడా జతచేసి అద్భుతమైన ఫాస్ట్ బౌలర్‌గా ఎదిగాడు. 2019లో దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసినా.. అతడిని ఐపీఎల్‌లో ఏ ఫ్రాంచైజీ కొనుక్కోలేదు. అయితే ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మాత్రం కమలేష్ నాగర్‌కోటికి బ్యాకప్‌గా తీసుకున్నది.

  ఇప్పటి వరకు కేకేఆర్ తరపున కేవలం 4 మ్యాచ్‌లు ఆడిన వారియర్ 2 వికెట్లు తీశాడు. ఈ ఏడాది ఐపీఎల్ 2021 తొలి దశలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మ్యాచ్‌కు ముందు కరోనా బారిన పడింది సందీప్ వారియరే. ఆ జట్టు సహచరుడు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారిన పడిన తర్వాతే మ్యాచ్‌లు రద్దయ్యాయి. కాగా, వీరిద్దరూ ఒక మ్యాచ్ తేడాతో శ్రీలంకలో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయడం విశేషం.
  Published by:John Naveen Kora
  First published: