టోక్యో ఒలింపిక్స్ 2020 (Tokyo Olympics) పురుషుల జూడోలో (Mens Judo) సయీద్ మొలాయి (Saeid Mollaei) రజత పతకం (Silver Medal) గెలిచాడు. మంగళవారం జరిగిన ఫైనల్ పోటీలో తృటిలో స్వర్ణ పతకం చేజార్చుకున్నాడు. సయీద్ మొలాయి సాధించిన పతకం మంగోలియా దేశం ఖాతాలో పడింది. అతడు మంగోలియా నుంచే అర్హత సాధించాడు. కానీ మొలాయి పుట్టింది మాత్రం మంగోలియా శతృదేశం అయిన ఇరాన్‌లో కావడం గమనార్హం. ఇప్పటికే శతృ దేశం తరపున ఆడి పతకం గెలిచాడని ఇరాన్ వాసులు ఆగ్రహంతో ఉండగా.. పుండు మీద కారం లాగా ఆ పతకాన్ని ఇరాన్‌తో ఎప్పటి నుంచో విభేదాలు ఉన్న ఇజ్రాయేల్‌కు అంకితం చేస్తున్నానని మొలాయి ప్రకటించాడు. ఇంతకు మొలాయి ఇలా ఎందుకు చేశాడు? అతడి ఒలింపిక్స్ పతకం వెనుక కథ ఏంటని అనుకుంటున్నారా?.. 2019లో టోక్యోలోనే వరల్డ్ జూడో చాంపియన్‌షిప్స్ జరిగాయి. ఆ పోటీల్లో ఇరాన్ తరపున పాల్గొన్న సయీద్ మొలాయి సెమీ ఫైనల్ వరకు చేరాడు. అంతకు ముందు ఏడాదే స్వర్ణం గెలిచిన అతడు ఈ సారి కూడా చాంపియన్‌గా నిలుస్తాడనే అనుకున్నారు. అయితే ఇరానియన్ అధికారులు మాత్రం మొలాయి దగ్గరకు వచ్చి సెమీఫైనల్ మ్యాచ్ ఓడిపోవాలని ఆదేశించారు. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే ఇజ్రాయేల్ ఆటగాడు సాగి ముకితో ఫైనల్ ఆడాల్సి ఉంటుంది. ఆ దేశ క్రీడాకారులతో ఆడవద్దు. అందుకే ఓడిపో అని బలవంత పెట్టారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఇరాన్ జూడో ఫెడరేషన్‌పై అంతర్జాతీయ జూడో ఫెడరేషన్ నాలుగేళ్ల నిషేధాన్ని విధించింది. ఆటకు సంబంధించిన నియమ నిబంధనలు తుంగలో తొక్కి ఆటగాడి భవిష్యత్‌ను ప్రమాదంలో పడేసిందని వారిపై ఆరోపణలు పెట్టింది.
ఇరాన్‌ను నాలుగేళ్ల పాటు జూడో నుంచి నిషేధించడంతో సయీద్ మొలాయి దేశం నుంచి పారిపోయాడు. 2019లో జర్మనీ శరణు వేడుకున్నాడు. అదే ఏడాది డిసెంబర్‌లో మంగోలియా అతడిని తమ పౌరుడిగా గుర్తింపును ఇచ్చింది. ఫైనల్‌లో ఏ ప్రత్యర్థితో అయితే ఆడొద్దని ఇరాన్ అధికారులు ఆదేశించారో.. అదే సాగి ముకితో స్నేహం పెంచుకున్నాడు. ఇద్దరూ కలసి రెండేళ్ల పాటు ఒలింపిక్స్ కోసం సాధన చేశారు. అంతే కాకుండా ఈ రెండేళ్లలో అనేక అంతర్జాతీయ వేదికల్లో పోటీ కూడా పడ్డారు. మంగోలియా తరపున ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సయీద్ మొలాయి.. రజత పతకం నెగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతే కాకుండా ఆ పతకాన్ని ఇజ్రాయేల్‌కు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు. టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్‌లో సాగి ముకి ఓడిపోయాడు. కానీ తన స్నేహితుడు సయీద్ రజతం గెలవడంతో ఆనందంలో మునిగి తేలాడు.
View this post on Instagram
'సయీద్ గెలుపుతో తాను చాలా ఆనందంగా ఉన్నాను. గత రెండేళ్లుగా అతడు పడిన బాధలు నాకు తెలుసు. ఈ పతకం అతడికి ఎంత అవసరమో కూడా నాకు తెలుసు. ఒక స్నేహితుడిగా అతడి విజయాన్ని చూడటానికి మించిన పతకం నాకు ఏదీ లేదు. అతను కచ్చితంగా ఈ పతకానికి అర్హుడు' అని సాగి ముకి టైమ్స్ ఆఫ్ ఇజ్రాయేల్‌తో వ్యాఖ్యానించాడు. 'ఇజ్రాయేల్‌కు ధన్యవాదాలు. మీరు ఇచ్చిన బలాన్ని నేను మర్చిపోలేను. ఈ పతకాన్ని మీకు కూడా అంకితం చేస్తున్నాను. ఈ విజయంతో ఇజ్రాయేలీయులు కూడా సంతోషంగా ఉన్నారని భావిస్తున్నాను' అని జెరుసలేం పోస్ట్‌తో మొలాయి చెప్పాడు. ఏదేమైనా సయీద్ మొలాయ్ పతకం ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక సినిమాలో ఉండాల్సినన్ని ట్విస్టులు ఉన్నాయని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Tokyo Olympics