మీరు క్రికెట్ లో మెళుకువలు నేర్చుకోవాలనుకుంటున్నారా..? ఆ మెళుకువలు కూడా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రికెట్ నేర్పిస్తానంటే.. అంతకన్నా ఏముంది. తాజాగా అలాంటి అవకాశం మీకోసం ఎదురుచూస్తుంది. సచిన్ ఉచితంగా క్రికెట్ పాఠాలు, చిట్కాలు బోధించనున్నాడు. ఆన్లైన్ వేదికగా లైవ్ ఇంటరాక్టివ్ సెషన్ తరగతులు నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు.ఏ మాత్రం ఖర్చు లేకుండా మీరు ఉచితంగా క్రికెట్ చిట్కాలు, పాఠాలు నేర్చుకోబోతున్నారు. వివరాల్లోకెళితే..క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కొత్త అవతారమెత్తాడు. ఎడ్యుకేషన్ టెక్ స్టార్టప్ అయిన అన్అకాడమీలో పెట్టుబడి పెట్టాడు. దానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన సచిన్.. ఇక నుంచి ఫ్రీగా పాఠాలు కూడా చెప్పనున్నాడు. అన్అకాడమీలోకి వెళ్లి సచిన్ చెప్పే క్రికెట్ పాఠాలను ఎవరైనా ఉచితంగా చూడవచ్చు. సచిన్ తన జీవిత పాఠాలను పంచుకుంటాడని, లెర్నర్స్కు కోచింగ్ ఇస్తాడని అన్అకాడమీ కోఫౌండర్ గౌరవ్ ముంజాల్ చెప్పారు. స్పోర్ట్స్ లెర్నింగ్ కేటగిరీలో సచిన్ ద్వారా మరింత లోతుగా పాఠాలు చెప్పించడానికి ఈ స్టార్టప్ ప్లాన్ చేస్తోంది.
తన జీవిత పాఠాలను విద్యార్థులతో పంచుకోవాలని తాను ఎప్పటి నుంచో భావిస్తున్నట్లు ఈ సందర్భంగా సచిన్ చెప్పాడు. తన విజన్ అన్అకాడమీ మిషన్ ఒకేలా ఉండటంతో ఇద్దరం కలిసి ఈ ఆలోచన చేసినట్లు మాస్టర్ తెలిపాడు. దేశంలోని మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్లు కూడా నేర్చుకునేందుకు అన్అకాడమీ ఓ వారధిలాగా మారిందని సచిన్ అభిప్రాయపడ్డాడు. ఇందులో ఇప్పటికే 49 వేల మందికిపైగా టీచర్లు ఉన్నారు. నెలకు 100 కోట్ల నిమిషాల వాచ్టైమ్తో అన్అకాడమీ దూసుకెళ్తోంది. ఇకే ముంది.. మీరు కూడా ఈ అవకాశాన్ని వదలకుండా సచిన్ శిష్యుడుగా మారండి.
Published by:Sridhar Reddy
First published:February 23, 2021, 14:49 IST