Sachin : కెరీర్‌లో సగం టెన్షన్‌తోనే గడిపాను.. మ్యాచ్‌ ముందు రోజు నిద్రపట్టేది కాదు.. హైపర్‌టెన్షర్ రోజు సచిన్ సందేశం

సచిన్12 ఏళ్లు టెన్షన్‌తో నిద్రలేని రాత్రులు గడిపాడట..!

ప్రపంచ హైపర్ టెన్షన్ డే సందర్భంగా సచిన్ పలు విషయాలు పంచుకున్నాడు. యువ క్రికెటర్ల మ్యాచ్ టెన్షన్ నుంచి ఎలా బయటపడాలో చెబుతున్నాడు.

  • Share this:
    క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tengulkar) అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. దాదాపు పాతికేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ (Cricket) ఆడిన సచిన్.. ఎన్నో రికార్డులు సృష్టించాడు. అత్యధిక సెంచరీలు, అత్యధిక పరుగులతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న సచిన్.. తన జీవితంలో చీకటి రోజుల గురించి చెప్పాడు. తన కెరీర్‌లో సగం రోజులు టెన్షన్‌తోనే గడిపినట్లు తెలిపాడు. ప్రపంచ హైపర్ టెన్షన్ దినోత్సవం (Hypertension Day) సందర్భంగా ఆయన తన మానసిక ఆరోగ్యం గురించి పలు విషయాలు వివరించారు. 'ప్రతీ మ్యాచ్‌కు నెట్స్‌లో భౌతికంగా, శారీరికంగా సన్నద్దం అయినట్లే.. మానసికంగా కూడా సన్నద్దం కావాల్సి ఉంటుంది. నా కెరీర్‌లో తెలుసుకున్న మొదటి విషయం ఇదే. నేను మైదానంలోకి అడుగు పెట్టడానికి ముందే మానసికంగా మ్యాచ్ కోసం సిద్దపడతాను. నా మైండ్‌లో పూర్తిగా మ్యాచ్ గురించే నిండిపోతుంది. దీంతో నాలో టెన్షన్ మొదలవుతుంది. మ్యాచ్ ఒత్తిడి పెరిగిపోవడంతో చాలా టెన్షన్ పడేవాడిని. కెరీర్‌లో దాదాపు 12 ఏళ్ల పాటు ఇలాంటి టెన్షన్‌తో నిద్రలేని రాత్రులు గడిపాను. కానీ ఇది మ్యాచ్‌లో సన్నాహకమని నాలో నేను సముదాయించుకునే వాడిని' అని సచిన్ చెప్పాడు.

    ఇక మ్యాచ్‌లకు ముందు ఇలా టెన్షన్ పడటం సన్నాహకాల్లో భాగం అని చెప్పిన సచిన్.. దీని నుంచి దూరం వెళ్లి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి టీవీ చూడటం, వీడియో గేమ్స్ ఆడటం, షాడో బ్యాటింగ్ చేయడం వంటివి చేసేవాడని చెప్పాడు. ఒక్కోసారి ఉదయాన్నే లేచి తన కోసం టీ చేసుకొని తాగేవాడినని.. బట్టులు ఇస్ట్రీ చేసుకునే వాడినని సచిన్ చెప్పాడు. మ్యాచ్‌కు ముందు రోజు నా కిట్ బ్యాగ్ సర్దుకునేవాడిని.. దీంతో కొంచెం టెన్షన్ తగ్గేది. తన తండ్రి అలా నేర్పించాడని సచిన్ పేర్కొన్నాడు. సచిన్ టెండుల్కర్ 25 ఏళ్ల పాటు క్రికెట్ ఆడినా.. చివరి మ్యాచ్ వరకు ఇలాగే టెన్షన్ పడుతూ ఉండే వాడు. ఇదే విషయాన్ని తాను రిటైర్ అయిన రోజు కూడా చెప్పడం గమనార్హం.

    ప్రస్తుతం కోవిడ్ కారణంగా క్రికెటర్లు అందరూ వారాల తరబడి బయోబబుల్ వాతావరణంలో గడుపుతున్నారు. కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఒక చిన్న ప్రదేశంలో గడుపుతూ క్రికెట్ ఆడుతుండటంతో విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. దీని వల్ల వారి ఆటపై కూడా ప్రభావం పడుతున్నది. ఇటీవల లియామ్ లివింగ్ స్టన్, ఆండ్రూ టై వంటి క్రికెటర్లు ఐపీఎల్ బబుల్‌లో ఉండలేక ఇంటికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. కుర్రాళ్లపై పడుతున్న ఈ భారాన్ని దిగ్గజ క్రికెటర్ సచిన్ కూడా అర్దం చేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బబుల్ నుంచి వేరుగా ఉండటం సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి.. క్రికెటర్లు టెన్షన్ నుంచి బయటపడటానికి ఇతర హాబీలపై దృష్టి పెట్టాలని సూచించాడు.
    Published by:John Naveen Kora
    First published: