హోమ్ /వార్తలు /క్రీడలు /

మేరీ కోమ్ కోసం మమ్మల్ని బలి చేస్తారా.. : ఓ యువ బాక్సర్ ఆవేదన

మేరీ కోమ్ కోసం మమ్మల్ని బలి చేస్తారా.. : ఓ యువ బాక్సర్ ఆవేదన

మేరీ కోమ్,నిఖత్ జరీన్ (File Photos)

మేరీ కోమ్,నిఖత్ జరీన్ (File Photos)

23 సార్లు గోల్డ్ మెడల్ సాధించిన మైఖెల్ ఫిలెప్స్ లాంటి అమెరికన్ క్రీడాకారులు సైతం ఒలింపిక్స్ అర్హత కోసం ట్రయల్ పోటీల్లో ఆడుతున్నారని.. అలాంటిది మేరీ కోమ్ లాంటి భారతీయ దిగ్గజ క్రీడాకారిణికి ట్రయల్స్ నుంచి ఎందుకు మినహాయింపునివ్వాలని ఆమె ప్రశ్నించారు.

ఇంకా చదవండి ...

క్రీడా నిబంధనలను ఉల్లంఘించి క్రీడాకారులకు తీరని అన్యాయం చేస్తున్నారని తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్(23) వాపోతున్నారు. ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే.. ముందు సన్నాహక పోటీల్లో(ట్రయల్స్) పాల్గొనాలని.. కానీ అవేవీ లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. బాక్సింగ్ విభాగంలో ట్రయల్ పోటీలు లేకుండా మేరీ కోమ్‌ను ఏకపక్షంగా ఎంపిక చేసి పంపించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకంటే సీనియర్‌గా మేరీ కోమ్ పట్ల చాలా గౌరవం ఉందని.. ఆమె విజయాల్ని చూస్తూ స్ఫూర్తితో పెరిగానని నిఖత్ గుర్తుచేసుకున్నారు. కానీ క్రీడా నిబంధనలను ఉల్లంఘించి మేరీ కోమ్‌ను ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపిక చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. ఈ మేరకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు ఆమె లేఖ రాశారు.

2011లో ఫ్లైవెయిట్ విభాగంలో గోల్డ్ మెడల్‌తో కెరీర్ ప్రారంభించానని నిఖత్ లేఖలో పేర్కొన్నారు. ఆ తర్వాత టర్కీలో ఉమెన్ జూనియర్& యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ గెలుచుకున్నట్టు తెలిపారు. 2013లో బల్గేరియాలో జరిగిన యూత్ వరల్డ్ బాక్సింగ్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించినట్టు చెప్పారు. 2019లో ఇటీవలే థాయిలాండ్ ఓపెన్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్నట్టు చెప్పుకొచ్చారు.

ఇదే క్రమంలో వరల్డ్ ఛాంపియన్‌షిప్ సెలక్షన్ కోసం అగస్టు 6,7వ తేదీల్లో ఢిల్లీ రావాల్సిందిగా  తనకు కబురు అందిందని చెప్పారు. కానీ అనూహ్యంగా అక్కడ నిర్వహించాల్సిన ట్రయల్స్ రద్దు చేసి భారత్ తరుపున మేరీ కోమ్‌‌ను పంపించారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ & సిల్వర్ మెడల్స్ సాధించినవారికి ఒలింపిక్ ఎంట్రీ కోసం ట్రయల్స్ అవసరం లేదన్న కొత్త నిబంధన తీసుకొచ్చారని గుర్తుచేశారు. మేరీ కోమ్ లాంటి సీనియర్లకు మార్గం సుగమం చేయడం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తనలాంటి ఔత్సాహిక క్రీడాకారులకు నష్టం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.

మేరీ కోమ్‌ను స్ఫూర్తిగా తీసుకుని బాక్సింగ్‌లోకి వచ్చిన తాను.. ఆమెలా గొప్ప పేరు తెచ్చుకోవాలనుకున్నానని.. అదే తాను ఆమెకు ఇచ్చే గొప్ప బహుమతి అని భావించానని చెప్పుకొచ్చారు. 23 సార్లు గోల్డ్ మెడల్ సాధించిన మైఖెల్ ఫిలెప్స్ లాంటి అమెరికన్ క్రీడాకారులు సైతం ఒలింపిక్స్ అర్హత కోసం ట్రయల్ పోటీల్లో ఆడుతున్నారని.. అలాంటిది మేరీ కోమ్ లాంటి భారతీయ దిగ్గజ క్రీడాకారిణికి ట్రయల్స్ నుంచి ఎందుకు మినహాయింపునివ్వాలని ఆమె ప్రశ్నించారు.

క్రీడాకారుల పట్ల పారదర్శకంగా వ్యవహరించాలని.. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ఆమె కేంద్రమంత్రికి విజ్ఞప్తికి చేశారు. కనీసం ట్రయల్స్‌లో పాల్గొని ఇంటి ముఖం పట్టినా.. నిరూపించుకోవడానికి అవకాశం దొరికినా ఉపయోగించుకోలేకపోయామని తమకు తాము సర్దిచెప్పుకుంటామని వ్యాఖ్యానించారు. అలాగైనా ఆ రాత్రికి నిద్రపోతామని చెప్పుకొచ్చారు. ఒక క్రీడామంత్రిగా, గతంలో క్రీడాకారుడిగా కొనసాగిన వ్యక్తిగా.. తన లాంటి క్రీడాకారుల బాధను అర్థం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్టు

లేఖను ముగించారు.

బాక్సర్ నిఖత్ జరీన్ కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకు రాసిన లేఖ

First published:

Tags: Boxing, Mary Kom

ఉత్తమ కథలు